🌹 సిద్దేశ్వరయానం - 5 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🌹సిద్దేశ్వరయానం 🌹
🏵️ ద్వాపర యుగం 🏵️
Part-5
సిద్ధనాగుడు :
గురుదేవా ! నన్ను శిష్యునిగా స్వీకరించటానికి అంగీకరించినందుకు కృతజ్ఞుడను. నేను నాగజాతివాడను. ద్విరూపధారణశక్తి కలిగినవాడను. ఏ కారణం వల్లనో మా వంశంలోని ఇతరులవలె లౌకిక భోగములందు నా కాసక్తి లేదు. రాజ్యాధికారము లందు కోరిక లేదు, నా జాతిలో కులవ్యవస్థ లేదు. నా జాతిలోని కన్యలను బ్రాహ్మణులు, క్షత్రియులు వివాహమాడిన సంఘటనలు మీరు వినే ఉంటారు. సహజంగా జాతిలక్షణముతో వచ్చిన శక్తులు గాక మా వారిలో కూడా కొందరు తపస్సు నందు ఆసక్తి కలిగి ఆదిశేషునివలె విష్ణుదేవుని అనుగ్రహాన్ని, వాసుకివలె పరమశివుని అనుగ్రహాన్ని, కద్రువవలె ఇంద్రుని దయను పొందాలని సాధనచేస్తున్నారు. నేనుకూడా ఆ మార్గము నందు అపేక్ష కలిగి ఋషుల ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నాను. దివ్య క్షేత్రాలను దర్శిస్తున్నాను. ఇంతకాలానికి మహావీరులు, మహాయోగులయిన మీరు నాయందు దయ చూపించారు. ఏ సాధన నా జీవితాన్ని ఉద్ధరిస్తుందో దేనివలన నేను పరిపూర్ణమైన పరమేశ్వరానుగ్రహాన్ని పొందగలనో ఆ విద్యను నాకు ఉపదేశించండి.
పరశు రాముడు :
నేను మంత్రశాస్త్ర రచన చేస్తుండగా నీవు వచ్చావు. నా గ్రంథంలో శాక్తేయ సాధనలు చేసే పద్ధతులు వివరించాను. నేను సహజంగా శివభక్తుడను. మహాదేవుని అనుగ్రహం వల్ల ఆయన నుండి దివ్యమైన పరశువును పొంది సర్వక్షత్రియ సంహారం చేశాను. ఆ పరశువు యొక్క తేజోమయమైన ఆకృతి నీలో భాసిస్తున్నది. నీయందు వాత్సల్యం కలగటానికి, అభిమానం కలగటానికి ఇది ఒక కారణం. శివభక్తుడనైన నేను చిత్రమైన పరిస్థితిలో దేవీభక్తునిగా మారాను. తండ్రి ఆజ్ఞవల్ల నా తల్లిశిరస్సును నేను ఖండించాను. అప్పుడామెలో పరమేశ్వరి ప్రవేశించింది. అపరాధ రహిత, త్యాగమూర్తి అయిన ఆమె దేవత అయిన సంగతి దత్తాత్రేయస్వామి చెప్పినదాకా నాకు తెలియలేదు. నా ప్రార్థనను మన్నించిన నా తండ్రి జమదగ్నిమహర్షి యొక్క తపశ్శక్తి వలన ఆమె పునరుజ్జీవితురాలయినదని మాత్రమే అనుకొన్నాను. నా మాత రేణుకాదేవి జగన్మాత అయినదని తెలుసుకొన్న తరువాత నాకు శాక్తేయమార్గము నందు అభిరుచి కల్గింది. అందుకే 'పరశురామకల్పం' అన్న పేరుతో ఈ మంత్రశాస్త్ర గ్రంధాన్ని రచించాను. సరే ! దాని సంగతి అటుంచు.
నీలోని జిజ్ఞాసను, అన్వేషణను నీ జీవుని వేదనను చూస్తున్నాను. నీవలన దేవకార్యములు కొన్ని కావలసి ఉన్నవి. దానికి కావలసిన శక్తులు పొందటానికి నీవు కాళీసాధన చేయాలి. నీకు కాళీమంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. దీనిని గ్రహించి కామాఖ్యలోని కాళీసన్నిధికి వెళ్ళి సాధన చెయ్యి. అక్కడ ఇప్పుడు నరకాసురుడు పరిపాలిస్తునాడు. వాడు దుశ్శీలుడు, దుర్మార్గుడు. వానితో నీకు సంబంధం లేదు. ఆమె సన్నిధిలో కొన్నాళ్ళు తపస్సాధన చేయి. ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది.” సిద్ధనాగుడు భార్గవ రాముని నుండి కాళీమంత్రాన్ని పొంది మళ్ళీ ప్రయాణాలు చేస్తూ ప్రాగ్జ్యోతిషపురాన్ని చేరుకొన్నాడు. నరకాసురుని పాలనలో ఆ దేవి మహావైభవంతో ప్రకాశిస్తున్నది. పరమ శివుని భార్య అయిన సతీదేవి దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసినపుడు. ఆ యజ్ఞాన్ని వీరభద్రుని చేత ధ్వంసం చేయించిన తరువాత మహేశ్వరుడు వచ్చి భార్య కళేబరాన్ని చూచి బాధపడి ఆ శరీరాన్ని చేతులలో ఎత్తి పట్టుకొని ఆవేశంతో తాండవం చేశాడు. ఆ తాండవోద్దతిని భరించలేక భువనములు కదలిపోయి కల్లోలితమవుతుంటే దేవతల ప్రార్థనమీద విష్ణుదేవుడు తన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండములు చేశాడు. ఆ దేహభాగములు పడిన చోట్లు శక్తిపీఠములయినవి. ఆమె 'యోనిభాగం' పడిన చోటు ఈ కామాఖ్య. ఈ ప్రాంతానికి పరిపాలకుడయిన నరకుడు నిరంతర మద్యమాంసముల నీ దేవికి సమర్పించి వామాచారమార్గంలో సాధనచేసి అజేయ పరాక్రమాన్ని అమిత వశీకరణశక్తిని పొంది 16,000 మంది రాజకుమారికలను తెచ్చి వారిని బలవంతంగా అనుభవించాడు. వాని కామదాహానికి ఆహుతి అయిన కన్యలెందరో. ఇంతటి దుష్టునకు వరములిచ్చి వాడు దుష్కార్యములు చేస్తున్నా కాళీదేవి ఎందు కుపేక్షిస్తున్నదో తెలియదు.
అయినా వీటిని గురించి ఆలోచించటం నాకర్తవ్యం కాదు. గురూపదిష్టమార్గంలో నా సాధన నేను కొనసాగించాలి. మధుకైటభసంహారిణి, శుంభ నిశుంభ వినాశిని, మహిషాసురమర్దిని రాక్షస సంహారిణి అయిన, ఆ మహాశక్తిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అని నిశ్చయించుకొని సిద్ధనాగుడు తన సాధనను ప్రారంభించాడు. తన జన్మస్థానమయిన నాగభూమికి దగ్గరగా ఉన్న ప్రదేశమిది. తమవారంతా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ఈ రాజ్యం గుండానే వెళ్ళాలి. నాగజాతికి అసురజాతికి అప్పుడు పెద్దగా విరోధాలు లేవు కనుక రాకపోకలకు కాని, కొన్నాళ్ళు ఉండటానికి గాని ఆంక్షలు, అడ్డంకులు లేవు. ఆలయానికి దగ్గరలో ఒక వసతి ఏర్పరచుకొని ఆహార విహారాది కఠోరనియమాలతో దృఢ దీక్షతో జపధ్యానములు చేశాడు. కొంతకాలం గడచిన తరువాత అతనియందు కాళీదేవికి అనుగ్రహం కలిగింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments