top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 53 Siddeshwarayanam - 53

🌹 సిద్దేశ్వరయానం - 53 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 16వ శతాబ్దం 🏵


మనసు కరిగిన కాళీ యోగి మరోసారి నిమీలితనేత్రుడై ధ్యానించి "శ్రీనాధకవీ! చాలకాలం తర్వాత నీ యాత్రలో ఒక మంత్రవేత్త నీకు పరిచయమవుతాడు. అతడు నీకు పరకాయప్రవేశవిద్యను నేర్పుతాడు. అతని పేరు శివరాయప్ప - కన్నడిగుడు. సిద్ధవిద్య నేర్చుకోవాలన్న మోజులో అక్కడి మతంగ పర్వతం మీద 40 రోజులు సాధన చేస్తావు. ఆ విద్య సిద్ధిస్తుంది. దానిని పరీక్షచేసి చూడాలన్న కోరికతో ఒక యువకుని మృత శరీరంలో ప్రవేశిస్తావు. ఆ సమయంలో నీ శత్రువుల అనుచరుడొకడు నీ అసలు శరీరంలో ప్రవేశించి తానే శ్రీనాధునిగా నటిస్తూ ఆంధ్ర దేశానికి వెళ్ళిపోతాడు. నీవు మూడురోజుల తర్వాత చూస్తే నీ శరీరం దొరకదు. ఆ యువకుని శరీరంలోనే ఉండిపోవలసివస్తుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న నీ మాటలను ఎవరూ నమ్మరు. ఆ ప్రాంతంలో అంతకు ముందు నిన్ను ఆదరించిన రాజుతో చెప్పుకొన్నా అతడు విశ్వసించడు. ఆంధ్రదేశానికి వెళ్ళి నిరూపించుకొందామని నీవు చేసే ప్రయత్నం విఫలమవుతుంది.


విషప్రయోగంతో నీవు హత్య చేయబడతావు. ఇప్పటికి తెలుస్తున్న విషయాలివి. నీవు రక్షించమని ప్రార్ధిస్తున్నావు. కాని అప్పటికి నేనెక్కడ ఉంటానో బహుశా నీ హత్యా సమయానికి నేనీ శరీరంతో ఉండక పోవచ్చు. అయితే ఎక్కడ ఉన్నా నీ విషయంలో శ్రద్ధ వహిస్తాను. జగన్మాతకు నివేదించి నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తాను. శుభం భవతు "అని వీడ్కోలు పల్కి కాళీయోగి కళింగ సీమలో ప్రవేశించాడు.


కాళీ విగ్రహం పెరిగి పెద్దదయింది. ఒరిస్సాలోని భువనేశ్వరు దగ్గర ఉన్న ఒక అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని భక్తుల సహకారంతో కాళీదేవికి ఆలయం నిర్మించాడు. కాళి అనుగ్రహం వల్ల ముసలితనం ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయినా శరీర పతనం తప్పలేదు. దానికి కొద్ది కాలం ముందే భైరవీబ్రాహ్మణి ఒకరు శిష్యురాలుగా చేరింది. ఆమె తాంత్రికసాధనలో ప్రవీణురాలు. ఎందరి చేతనో ఆ సాధనలు చేయించి కొన్ని సిద్ధశక్తులు వచ్చేలా చేయగలిగింది. ఆమె వద్ద ఆ సాధనలలో కృషి చేసిన వారిలో రామకృష్ణపరమహంస ఒకరు. ఆ భైరవి కాళీపూజ శ్రద్ధాభక్తులతో చేస్తున్నది. మరికొందరు శిష్యులు కూడా ఉన్నారు. వారికి ఆలయాన్ని అప్పగించి కాళీయోగి ప్రాణములు వదిలాడు.


ఆ తరువాత కొంత కాలానికి దక్షిణ దేశంలో కంచి క్షేత్రంలో జన్మించడం జరిగింది. దేవతల సిద్ధుల కరుణ వల్ల సాధన చిన్న వయస్సులోనే ప్రారంభమైంది. ఒక కొండ మీది దేవీఆలయంలో తీవ్రసాధన సాగింది. దేవతానుగ్రహం వల్ల పూర్వస్ఫురణ లభించింది. కళింగవనంలోని కాళి దగ్గరకు వెళ్ళి ఆ దేవి అనుగ్రహం కోసం మళ్ళీ తపస్సు చేశాడు.


ఈ సారి కొందరు తాంత్రికులు కలవటం వల్ల సాధనలు చేసి కాళి కృపను వేగంగా పొందటం జరిగింది. ఆనాటి తోటి సాధకులలో ఒకరు లీలానంద ఠాకూర్ అనే ఔత్తరాహుడు. అతడు కళింగా శ్రమంనుండి తనస్వస్థలం వెళ్ళి అక్కడ నుండి బృందావనం చేరి రాధాకృష్ణ భక్తుడై జీవితాన్ని చరితార్ధం చేసుకొన్నాడు. అక్కడ అతనిని ఇబ్బంది పెట్టిన దుష్టులనుండి కాళీదేవి రక్షించింది. అతని కోర్కె ప్రకారం అతడు మరణించిన తర్వాత అతని సమాధి మీద కాళీ విగ్రహాన్ని స్థాపించా రతని శిష్యులు, ఈనాడు బృందావనంలో పాగల్ బాబా మందిరం సుప్రసిద్ధమైనది. తోటి సాధకులలో మరొక వ్యక్తి తరువాతి జన్మలో అద్దంకి కృష్ణమూర్తి అన్న పేరుతో విఖ్యాతుడైన మాంత్రికుడు. అప్పుడొక యాత్రలో మౌనస్వామి కలిసి కుర్తాళానికి ఆహ్వానించాడు. ఆనా డది సమకూడలేదు దాని ఫలితంగా తర్వాత జన్మలో మౌనస్వామిపీఠానికి ఆధిపత్యం స్వీకరించ వలసి వచ్చింది.


ఈ విధంగా ఆటుపోటులతో సుఖదుఃఖాలతో ఆ జీవితం సుమారు ఒక శతాబ్దం కొనసాగి మృత్యుకుహరంలోకి వెళ్ళి పొయింది. అనంతరం వచ్చిన ఇప్పటి జన్మ ఆంధ్రదేశంలో సంభవించింది. అనంత కాలంలోకి చొచ్చుకొనిపోయే దేవతల దృష్టి అపారమైనది. ఖండకాలానికి పరిమితం కాని వారి ప్రణాళికలు అందరికీ అర్ధంకావు. అర్ధమైన సిద్ధయోగులు దాదాపు పదిమంది తెలుగు దేశంలో పుట్టారు. కొందరు కాస్త ముందు - వెనకా కొందరు సమకాలికులు. సింధువులో బిందువులు - మహాగ్ని కుండంలోని విస్ఫూలింగాలు - పరమేశ్వరుడనే సూర్యబింబం నుండి బయలుదేరిన ఒక్కొక్క కిరణం వంటివారు. ఎవరి నిర్దిష్ట కార్యక్రమాన్ని వారు చేస్తూ - మధ్య మధ్యలో కలుస్తూ విడిపోతూ ఉంటారు.


( సశేషం )


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page