🌹 సిద్దేశ్వరయానం - 54 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵
తూర్పు బెంగాలులోని జస్వర్ ప్రాంతానికి పరిపాలకునిగా ఉన్న ఒక జమీందారు దగ్గర కులగురువులుగా ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబం వారు వేదాధ్యయన పరులుగా మంత్రోపాసకులుగా, ఆధ్యాత్మిక విద్యావేత్తలుగా పేరుగాంచారు. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి బ్రిటీష్ ప్రభుత్వం అప్పుడే, బలాన్ని పెంపొందించు కొంటున్నది. బెంగాలులో ఎక్కువ భాగం నవాబుల పరిపాలనలో ఉన్నది. ముస్లిం మతవిజృంభణం అరికట్టటం కష్టసాధ్యంగా ఉన్నకాలమది. హిందువులంతా మహమ్మదీయుల పాలనలో బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు.
ఆరాధన మార్గాల దృష్టిలో వంగదేశంలో హిందూ సంప్రదాయాలు రెండు రకాలుగా వ్యాపించి యున్నవి. తాంత్రిక మార్గాలలో కాళీసాధన తీవ్రంగా ప్రచారంలో ఉండగా మరొక వైపు కృష్ణచైతన్య మహాప్రభువు ప్రభావం వల్ల కృష్ణభక్తి కూడా సామాన్య ప్రజల హృదయాలను ఆక్రమించుకొని ఉన్నది. మామూలు ప్రజలంతా ఉభయచరులు. అటు కాళీ ఉత్సవాలకు వెళతారు. ఇటు కృష్ణభజనలకు వెళతారు. చైతన్య మహాప్రభువు యొక్క ముఖ్య శిష్యులు, రూపగోస్వామి, సనాతన గోస్వామి అక్కడివారే. ఆ రెండు సంప్రదాయాల ప్రభావము ఈ రాజ గురువుల కుటుంబం మీద కూడా ఉన్నది. కలకత్తాలోని శక్తి పీఠమయిన కాళీదేవిని తరచుగా వారు దర్శించుటకు వెళ్తూనే ఉంటారు. అదే విధంగా కొన్ని కుటుంబాల వారు కలసి యాత్రికుల గుంపుగా బయలుదేరి భజనలు చేసుకొంటూ మధుర బృందావనాలకు వెళ్ళిరావటం కూడా తరచుగా జరుగుతున్న అంశమే.
ఈ రాజగురువుల కుటుంబంలో 19వ శతాబ్దం మొట్టమొదట ఒక ఆడపిల్ల పుట్టింది. చాలాకాలం సంతానం కలగక చిరకాలం కులదేవత అయిన కాళిని ఉపాసించటం వల్ల లేకలేక కలిగిన ఆ బిడ్డకు ముద్దుగా 'యోగేశ్వరి' అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనం నుండే గృహవాతావరణంలో దైవభక్తి ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం వల్ల ఆ లక్షణాలు ఈ బాలికలోనూ నెలకొన్నవి. చిరుతప్రాయంలోనే యోగేశ్వరి భజనలలో పాల్గొనేది. పూజలు చేయటానికి ఉత్సాహం చూపేది. యోగేశ్వరికి షుమారు పదిసంవత్సరాలు వచ్చిన సమయంలో ఆమె తల్లిదండ్రులకు మరొక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయికి అయిదు ఏండ్ల వయస్సు వచ్చేసరికి, ఆయువు తీరి తండ్రి మరణించాడు. వీరి వంశంలో మగపిల్లవాడు లేకపోవటం వల్ల రాజగురువు పదవి వారి సోదరుల కుటుంబాలలో మరొకరికి వెళ్ళిపోయింది. పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉండటం వలన జరుగుబాటుకు లోటు లేదు.
ఇలా గడుస్తుండగా వారి గ్రామంలో ఊరి పెద్దలు ఒక పండితుని పిలిపించి భాగవత ప్రవచనం చేయించారు. ఆ పౌరాణికుడు మంచి సమర్థుడు కావటం వల్ల ఎంతో ఆకర్షణీయంగా కమ్మని కంఠంతో భాగవత కథలు వినిపిస్తున్నాడు. అందరితో పాటు యోగేశ్వరి, వాళ్ళ అమ్మ కూడా వెళ్ళేవారు. దశమస్కంధం చెప్పేటప్పుడు ఆ విద్వాంసుడు భాగవతానికి బ్రహ్మ వైవర్త పురాణాన్ని కూడ జోడించి చెప్పటంతో భాగవతంలో లేని కొత్త విశేషాలు ఎన్నో తెలిసినవి. ముఖ్యంగా రాధాదేవిని గురించి చాలా అద్భుతమైన విశేషాలు విన్నారు. తమ ప్రాంతం వారయిన రూపగోస్వామి, సనాతన గోస్వామి మొదలైనవారు చైతన్య మహాప్రభువు శిష్యులై, వైష్ణవులై, కృష్ణభక్తులై మహాప్రభువు ఆజ్ఞవల్ల బృందావనం వెళ్ళి అక్కడ రాధాభక్తులుగా మారిన విషయాలను ఆ పౌరాణికుడు విశదీకరిస్తూంటే బృందావన దర్శనాభిలాష ప్రబలంగా కలిగింది.
యమునా తీరానికి వెళ్ళాలని కృష్ణుడు లీలలు ప్రదర్శించిన ప్రదేశాలన్నింటినీ చూడాలని రాధాకృష్ణుల విహార భూమిలో సంచరించి జీవితాలను చరితార్థం చేసుకోవాలని బలమైన ఆకాంక్ష కలిగింది. ఆ ఊళ్ళో ఉన్న చాలామందికి కూడా అటువంటి కోరిక కలగటం వల్ల అంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ పౌరాణికుడు కూడా సకుటుంబంగా వీరితో బయలుదేరాడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments