🌹 సిద్దేశ్వరయానం - 55 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵
శ్లో॥ ఆరాధ్యో భగవాన్ ప్రజేశతనయః తద్దామబృందావనం రమ్యా కాచి దుపాసనా ప్రజవధూవర్గేణ యాకల్పితా
శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమర్థోమహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మత మిదం తత్రాదరో నః పరః
దేవతలందరిలో ఆరాధించతగినవాడు పరమేశ్వరుడైన కృష్ణుడు ఒక్కడే. ఆయన స్వస్థలం బృందావనము. ఆ జగన్నాధుని ఉపాసించే మార్గాలలో వ్రజకాంతలు అనుసరించిన మధురభక్తి మార్గం శ్రేష్ఠమయినది. మానవుడు సాధించవలసిన పురుషార్థములలో నాలుగు పురుషార్ధములయిన ధర్మార్థ కామమోక్షములను మించిన అయిదవ పురుషార్ధము ప్రేమ అది బృందావనములో మాత్రమే సాధ్యము. ఈ ప్రేమ సిద్ధాంతమునకు శ్రీ మద్భాగవతములో దశమస్కంధము ప్రమాణం.
ఇది చైతన్య మహాప్రభువు మతము. దీని యందు మాత్రమే మాకు ఆదరము. ఈ విధంగా ఆ పౌరాణికుడు బృందావనయాత్ర అంతా కృష్ణగాథలు చెప్పి ప్రయాణశ్రమ అంతగా లేకుండా చేశాడు. యోగేశ్వరి, వాళ్ళ అమ్మ, చెల్లెలు బృందావనం చేరుకొన్న తరువాత అక్కడి విశేషాలన్నీ దర్శించారు. యాత్రికులందరూ కలసి స్థానికంగా ఉన్న రాధాకృష్ణ లీలాఘట్టాలన్నింటినీ చూచారు. హరిదాస్మహారాజ్ కోసం అవతరించిన బాంకే బిహారీ ఆలయం, అలానే రూపగోస్వామి సమాధి దగ్గర ఉన్న రాధామోదర మందిరం. సనాతనగోస్వామి పూజించిన మదనమోహనుని ఆలయం ఇటువంటివన్నీ వారు దర్శించారు. కృష్ణుని మునిమనుమడైన వజ్రుడు కృష్ణుని బాల్యదశను, యౌవనాన్ని, చివరి పరిణత దశను సూచించే విగ్రహాలతో నిర్మించిన మూడుదేవాలయాలను చూచినప్పుడు ఆనందకరమైన అనుభూతి కలిగింది.
రాధాసుధానిధి గ్రంథకర్త హితహరివంశ మహారాజ్ సశరీరంగా గాలిలో కలిసిపోయి రాధాసఖిగా మారిన ప్రదేశం చూచినప్పుడు అందరికీ ఒళ్ళు పులకించింది. యమునకు రెండవ వైపు రాధాకృష్ణుల వివాహం జరిగిన భాండీరవనం, వేణుకూపం, లక్ష్మీదేవి తపస్సు చేసిన బిల్వవనం, అన్నిటికంటె 5000 ఏండ్లనాటి శ్రీకృష్ణుని వేణునాదాన్ని రాధాదేవి పాదనూపురశింజితాలను వినిపించే వటవృక్షం దిగ్భ్రాంతిని పరవశత్వాన్ని కలిగించింది. ఆ మర్రిచెట్టు బోదెకు చెవి ఆనిస్తే దివ్యనాదం వినిపించడం మహాద్భుతమైన సన్నివేశం.
అదే విధంగా బృందావనానికి 50, 60 కిలోమీటర్ల పరిధిలో కృష్ణుడు యశోదకు విశ్వరూపాన్ని చూపిన బ్రహ్మాండఘాట్, స్నేహితులతో కలిసి ఆడుకున్న 'రమణరేతి' రాధాకృష్ణులు సృష్టించిన రాధాశ్యామకుండాలు, రాధాదేవి అవతరించిన రావల్ గ్రామంలోని పవిత్రస్థలం, పెరిగిన బర్సానా కొండమీది ఆలయం ఇవన్నీ భక్తులను ద్వాపర యుగాంతానికి తీసుకు వెళ్ళినాయి. అందరికీ ఆశ్చర్యం కలిగిన అంశం ఏమిటంటే బలరామ కృష్ణులు, గోపకులు మొదట ఉన్న గోకులానికి తరువాత చేరిన బృందావనానికి, కృష్ణుడు లీలలు చూపిన మిగతా స్థలాలకు మధ్యలో చాలా దూరాలున్నాయి. ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కృష్ణుడు నిద్రలేచి యమునలో స్నానం చేయటానికి ఒక 30 కి.మీ. మిత్రులతో కలసి చద్దన్నం తినటానికి మరొక వైపు 40కి.మీ. ఆవులను మేపటానికి ఇంకో 50 కి.మీ. రోజు మొత్తం మీద షుమారు 150 కి.మీ. నడచినట్లు కన్పిస్తుంది. కృష్ణుడు మన్నుతింటున్నాడని గోపకులు ఒక 40 కి.మీ. వెళ్ళి ఇంట్లో ఉన్న యశోదకు చెపితే ఆమె రెండు నిమిషాలలో అక్కడకు నడిచివచ్చి కృష్ణుని మందలించి అతడు చూపిన విశ్వరూపానికి దిగ్రమచెంది మరల కృష్ణుని మాయలోపడిపోయి మామూలు మనిషిలాగా ఇంటికి వెళ్ళింది. అంటే సర్వశక్తి సంపన్నుడయిన కృష్ణుడేగాక పిల్లలు, వృద్ధులు కూడా ప్రతిరోజూ ఒక 100 కి.మీ. నడవటం సహజంగా ఉండేదన్నమాట. దీనిని బట్టి వాళ్ళ శరీర ప్రమాణాలు బలదార్థ్యాలు ఊహించవచ్చు.
ప్రసిద్ధయోగిని ఆనందమాయి మహనీయుడైన దేవరహాబాబా అనుగ్రహం వల్ల తానుద్వాపరయుగ జీవులను చూచానని వారు 18 నుండి 20 అడుగుల ఎత్తులో ఉన్నారని చెప్పింది. ఇటీవల ఇంటర్నెట్లో జి.సుబ్రహ్మణ్యం అన్నపరిశోధకుడు "Bhima's son Gadotkach - Like Skeliton found" అన్న శీర్షిక క్రింద లిఖించిన విషయాన్ని బొమ్మలను చూస్తే దానిలో భారత సైన్యము చేత రక్షితమైన ఒక ఎడారిలో బ్రహ్మాండమైన మానవుని అస్థిపంజరము బయటపడిందని దాని పొడవు షుమారు 30-40 అడుగులుందని, ప్రపంచంలో ఇంతటి పెద్ద మానవ అస్థిపంజరం ఇంతవరకూ దొరకలేదని చెప్పబడింది. భీముని పుత్రుడైన ఘటోత్కచునిది అయి ఉండవచ్చునని ఆయన ఊహ. ఇటువంటి సాక్ష్యాలను బట్టి అప్పటి మానవులు మన ఊహకందని దీర్ఘశరీరాలు కలిగి ఉండేవారని భావించవచ్చు. బృందావన ధామంలో ఇప్పటికి సుమారు 500 సంవత్సరాల క్రితం జీవించిన రూపగోస్వామి సనాతనగోస్వామి మొదలైన మహనీయుల సమాధులు అత్యంత స్ఫూర్తిదాయకములు. వాటి సన్నిధిలో ధ్యానము చేస్తే ఎవరికైనా దివ్యానుభవాలు కలగటం సహజం.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments