🌹 సిద్దేశ్వరయానం - 56 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵
యోగేశ్వరి నెమ్మది నెమ్మదిగా బృందావనం వైపు ఎక్కువ ఆకర్షించబడింది. బంగారు రంగుతో లోకోత్తర సౌందర్యవతిగా రూపుదిద్దుకొన్న ఆ బాలిక బృందావన ధామంలోని ఆకర్షణతో రాధాకృష్ణ రస ప్రపంచంలో మునిగిపోయింది. యాత్రకు వచ్చిన వారి సహకుటుంబీకులు ఆప్తులు అందరూ తిరిగి వెళ్ళటానికి ఉద్యుక్తులవుతున్న దశలో వీరు మాత్రం మరి కొంతకాలం బృందావనంలో ఉందామని నిశ్చయించు కొన్నారు. బెంగాలు నుంచి అప్పుడప్పుడు యాత్రికుల బృందాలురావటం అలవాటు గనుక వెళ్ళాలని అనిపిస్తే అటువైపు వెళ్ళే మరో బృందంతో వెళ్ళవచ్చునని అనుకొన్నారు. పెళ్ళీడుకు వచ్చింది. అమ్మాయికి పెళ్ళి చేయాలన్న ఆలోచన తల్లికి ఉన్నా యోగేశ్వరి ఎంత మాత్రం అంగీకరించటం లేదు. తాను సన్యాసిని అవుతానని తనకు విషయ సుఖములయందు ఆసక్తి లేదని తల్లితో ఎప్పుడూ అంటూండేది.
కాలం ఇలాగడుస్తూండగా ఒకనాడు రూపగోస్వామి సమాధిమందిరం దగ్గర ఒక మహనీయ వ్యక్తిని యోగేశ్వరి దర్శించింది. మధ్యవయస్కుడుగా ఉన్న ఆవ్యక్తికి అక్కడి పిన్నలు, పెద్దలు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఎవరీయన అని తెలిసిన ఒకవృద్దుని అడిగితే ఆయన ఇలా అన్నాడు “అమ్మా! ఆయన ఎవరో ఎక్కడివారో ఎవరికీ తెలియదు. నా చిన్నప్పుడు సుమారు 80 సంవత్సరాల క్రింద మొదటిసారి ఆయనను చూచాను. అప్పుడూ ఇలానే ఉన్నాడు. మహా పురుషుడైన రూపగోస్వామికి స్నేహితుడని అందరూ చెప్పుకోనేవారు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 300 సంవత్సరాలు పై బడి ఉంటుంది. బృందావన ధామంలో ఎప్పుడోగాని ఇటువంటి మహాత్ములురారు. అందరూ ఆయనను 'కాళీయోగి' అంటారు. కాళీదేవి అనుగ్రహం వల్ల దీర్ఘాయువును అద్భుతశక్తులను సాధించాడని చెపుతారు” అందరితో పాటు యోగీశ్వరి కూడా వెళ్ళి ఆయన పాదములకు మ్రొక్కింది.
ఆయన తలెత్తి చూచి చిరునవ్వుతో యోగేశ్వరీ ! బాగున్నావా ? అని తెలిసినవానివలె పలకరించాడు. తన పేరాయనకు ఎలా తెలుసు ?ఈ అమ్మాయికి ఆశ్చర్యం కలిగింది. ఆయన చూపులో మాటలో చిరకాలంగా తెలిసినవాడు పలకరించిన తీరు కనిపించింది. జనం చాలా మంది ఉండటం వల్ల అప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం కలుగలేదు. ఆ రోజు రాత్రి ఎంత సేపయినా సరే ఉండి ఆయనతో మాట్లాడాలని వేచి ఉన్నది. అందరూ కదిలి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. అయినాసరే పట్టుదలతో దృఢసంకల్పంతో ఉన్నది. చివరికాయన లేచి తన వసతిగదిలోకి వెడుతూ ఈ అమ్మాయివైపు ఒక్కసారి చూచి మాట్లాడకుండా లోపలకు వెడుతున్నాడు. ఆయన పొమ్మనలేదు, అన్న ధైర్యంతో ఆయన వెంట లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆయన ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఆయన పాదములకు నమస్కరించి చేతులు కట్టుకుని ఎదురుగా నిల్చున్నది. అప్పుడాయన ఇలా అన్నాడు.
కాళీయోగి : యోగేశ్వరీ ! నీకేం కావాలి ? చాలాసేపటి నుండి వేచి ఉన్నావు.
యోగేశ్వరి : స్వామీ! నాకేం కావాలో నాకు తెలియదు. మీరు కాళీదేవి అనుగ్రహం వల్ల సిద్ధశక్తులు సాధించారని కొన్ని వందల ఏండ్ల నుండి జీవిస్తున్నారని విని, మీతో మాట్లాడాలని అనిపించింది. కొత్తగా వచ్చిన నన్ను పేరుతో పలకరించారు. నే నెవరో మాములుగా మీకు తెలిసే అవకాశం లేదు. చిన్నపిల్లను గనుక నన్ను ఎవరూ పరిచయమూ చేయలేదు.
కాళీయోగి : నేను ఎవరి గురించి తెలుసు కోవాలనుకుంటే వారి గురించి తెలుస్తుంది. నిన్ను చూడగానే చాలాకాలం నుండి, అంటే కొన్ని వందల ఏండ్ల నుండి నిన్నెరుగుడు సన్న స్మృతి వచ్చింది.
యోగేశ్వరి : స్వామీ ! నన్నంతగా ఎరిగిన మీరెవరు ? నేనెవరు ?
యోగి : తెలియవలసిన సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తున్నది. ఈపూటకు ఇంటికి వెళ్ళు. తరువాత కలువవచ్చు.
యోగేశ్వరి : నాకు మళ్ళీ దర్శనమెప్పుడు అనుగ్రహిస్తారు ?
యోగి : రేపు రూపగోస్వామి ఆరాధన. అతడు నా చిరకాల మిత్రుడు. చాలా కాలం తరువాత అతనిని చూడాలని సమాధిలో ఉన్న అతనిని పలుకరించాలని వచ్చాను. అందువల్ల రేపు పగలంతా అక్కడ కార్యక్రమంలో మునిగి ఉంటాను. రేపు కూడా ఇదే సమయానికి రా. ఆమె నమస్కరించి వెళ్ళిపోయింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments