🌹 సిద్దేశ్వరయానం - 58 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵
యోగేశ్వరి మరునాడు సాయంకాలం మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళేసరికి కాళీయోగి బయటకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్లు కన్పించింది. వారితో పాటు వారి పరివారము కొద్దిమంది బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెడుతున్నారని నెమ్మదిగా పరివారంలో ఒకరిని అడిగింది. సనాతనగోస్వామి సమాధిదగ్గరకు, హితహరివంశ మహరాజ్ అదృశ్యమైన స్థలానికి వెడుతున్నట్లు చెప్పబడింది. వారితో పాటు తానుకూడా అక్కడికి వస్తానని అభ్యర్థించగా యోగి సరేనన్నాడు. ఆ రెండు చోట్లకూడా, పూర్వమహానీయులతో వారు మాట్లాడుతూనే ఉన్నట్లున్నది. అక్కడ నుండి మళ్ళీ రూపగోస్వామి సమాధిమందిరానికి వచ్చిన తరువాత శిష్యులంతా నమస్కరించి వెళ్ళిపోయినారు. యోగేశ్వరి ఒక్కతే మిగిలి ఉన్నది. యోగి విశ్రాంతిగా కూర్చున్న తరువాత, ఆమె నిన్న తాను పొందిన దర్శనాన్ని గూర్చి అడుగుదామని అనుకొంటూ ఉండగా యోగి ఇలా అన్నారు.
యోగి : అమ్మా ! నిన్న నీవు పొందిన అనుభవాన్ని గూర్చి అడగాలని అనుకొంటున్నావు. రాధాభక్తురాలివయిన నీకు కాళీదేవితో జన్మాంతర బంధం ఉండటం వల్ల నీకా అనుభూతి ఇవ్వబడింది. నీవు దర్శించిన కాళీదేవి విగ్రహం ఇక్కడకు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఒక మహారణ్యంలోని నా ఆశ్రమంలో ఉన్నది. బృందావనంతోను ఇంతకముందు ఇక్కడ జీవించిన గోస్వాములతోను, భక్తులతోను ఉన్న అనుబంధం వల్ల వారు భౌతికశరీరాలతో ఉన్నప్పుడు ఏర్పడిన మైత్రిని పురస్కరించుకొని, వారు పాంచభౌతిక శరీరాలు విడచిపెట్టినా రాధాదేవి పరివారంలో మంజరులుగా మారిపోయినారు. నాకు దీర్ఘాయువు ఉండటం వల్ల ఇక్కడకు వచ్చి వారిని పలకరిస్తుంటాను. కాళీదేవి అనుగ్రహంవల్ల ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాల నుండి జీవించియున్నాను. ఇక్కడి పెద్దల వల్ల నీవూ కొంతవిన్నావు. నీకు నిన్న ఇవ్వబడిన అనుభూతి కాళీదేవి యొక్క అనుగ్రహము నీలో పునర్వికసిత మవుతున్నదనటానికి గుర్తు. నిన్ను ఎన్నో జన్మలనుండి ఎరుగుదును. నీ వెవరో నీకు సంబంధించిన వివరాలు నీవే తెలుసుకొంటే నీకు సంతృప్తి కరంగా ఉంటుంది. ఆ స్థితి రావటానికి నీవు తీవ్రతపస్సు చేయాలి. వేగంగా రావాలంటే తాంత్రిక సాధనలు చేయాలి. అదినీ సంకల్పం మీద, భగవతి మహాకాళి కృపమీద ఆధారపడి ఉన్నది. నేనింక రెండు రోజులలో ఇక్కడ నుంచి బయలుదేరి వెడుతున్నాను. నీ మార్గం నిశ్చయించుకోవలసినదానిని నీవే.
యోగేశ్వరి : మీ మాటలు వింటూంటే నాలో ఏదో కొత్తమార్పు వస్తున్నది. నేను ఆలోచించుకొని రేపు మీ దర్శనానికి వస్తాను. మీ కరుణాకటాక్షములు నామీద ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను.
యోగి : తథాస్తు.
యోగీశ్వరి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా ఎడతెగని ఆలోచనలు. "ఇప్పుడు నేనేమి చేయాలి ? కాళీయోగి ఇచ్చిన అనుభూతివల్ల ఆయన మాటల వల్ల తెలియని దివ్యలోకాల తలుపులు తెరుచుకొంటున్నవి. మొదటి నుండి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థానం సాధించాలన్న తపన లోలోపల అగ్నిజ్వాలవలె రగులుతున్నది. దానిని సాధించాలంటే కఠోర తపస్సాధన చేయాలి. వయస్సు వచ్చింది కనుక పెళ్ళికి ఇప్పటికే ఆలస్యమయిందని అమ్మ గొడవ చేస్తున్నది. ఇంట్లో ఉంటే ఎక్కువకాలం పెళ్లిని ఆపటం సాధ్యం కాదు. కనుక గార్హస్థ్యబంధంలో ఇరుక్కోకుండా తాను సిద్ధయోగినిగా మారాలి.
బృందావన ధామంలో అనన్యమైన రాధాకృష్ణభక్తి మార్గాన్ని తప్ప మరొకదానిని గూర్చి ఇక్కడి భక్తులు ఆలోచించరు. మంత్రశక్తుల యందు దీర్ఘాయువు నందు తాంత్రికసాధనల యందు ఇక్కడ ఆశ్రమాధిపతులకు గాని వారి శిష్యులకు గాని ఆసక్తి లేదు. నాకు రాధాకృష్ణుల యందు భక్తి ఉన్నది. కానీ దానితో పాటు సిద్ధులయందు కూడా మోజు ఉన్నది. ఆ కాళీయోగి ఎప్పటివాడో ? 300 ఏండ్లు దాటుతున్నా ముసలితనం రాలేదు. నేను కూడా ఆ విధంగా దీర్ఘాయురారోగ్యములు సాధించగలనా ?
జరాభారంపైన పడకుండా ఆపగలనా? ఇవన్నీ సాధించాలంటే సిద్ధుడైన గురువు యొక్క సహాయం లేకుండా సాధ్యంకాదు. కన్పిస్తున్నంతలో ఒక్క కాళీయోగి మాత్రమే చేయగలిగిన పని ఇది. కనుక నా జీవిత లక్ష్యం నెరవేరాలంటే ఆయనతో వెళ్ళాలి. వారి ఆశ్రమంలో వారి నీడలో ఉండి, ఆయన అనుగ్రహంతోనే ననుకొన్నది సాదించాలి. ఒకసారి ఆయనతో వెళ్ళిపోతే తిరిగి ఎప్పటి రాగలనో, చెప్పకుండా వెడితే ఏమయినానో ! అని అమ్మ దిగులు పడుతుంది. చెప్పితే పోనీయరు” ఇలా పరిపరివిధాల ఆలోచించి ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comentarii