top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 6 Siddeshwarayanam - 6


🌹 సిద్దేశ్వరయానం - 6 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🌹సిద్దేశ్వరయానం 🌹


🏵 ద్వాపర యుగం 🏵


Part-6


ఒకనాటి అర్థనిశాసమయంలో తేజోమండలం మధ్య దేవి సాక్షాత్కరించి “సాధకుడా ! నీ తపస్సుకు సంతోషించాను. నీ జీవితగమనంలో మార్పులు రాబోతున్నాయి. సుమారు రెండు వందల సంవత్సరాల తరువాత నీకు మృత్యు గండమున్నది. నీజాతిని నశింపచేయటానికి ఒక రాజు సర్పయాగం తలపెడతాడు. మహాప్రభావసంపన్నులయిన బ్రాహ్మణుల మంత్రశక్తి వల్ల మీ జాతివారు కొన్ని లక్షలమంది హోమాగ్నిలోపడి దహనమవుతారు. నా భక్తుడవైన నిన్ను నేను కాపాడదలచుకొన్నాను. నేను రేపటి నుండి ఈ క్షేత్రంనుండి అదృశ్యమవుతున్నాను. భగవంతుడయిన నారాయణుడు నరకాసురాది దుష్టసంహారం కోసం అవతరించాడు. ఆయనలో నా శక్తి కూడా కలుస్తుంది. తపస్సు చేసిన వారికి మేము వరములిస్తాము. వారు దుర్మార్గాలు చేస్తే శిక్షిస్తాము. నీకు కృష్ణమంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఇక్కడ నుండి నీవు బృందావనం వెళ్ళి అక్కడ ఈ మంత్రజపసాధన చేయి. నీకు కృష్ణాను గ్రహం కలుగుతుంది" అని అని చెప్పి అదృశ్యమయింది. మరునాడు రాత్రి బ్రహ్మణ్యుడైన వసిష్ఠమహర్షి అక్కడకు వచ్చాడు. ఆయన దేవాలయ ప్రాంగణానికి వచ్చేసరికి కాళీ మందిర ద్వారాలు మూసివేయబడినవి. కాళీదర్శనం కోసం వచ్చానని, తలుపు తెరిపించమని అక్కడి అధికారులను అడిగాడు. "దర్శన సమయం దాటిపోయింది. మహారాజు ఆజ్ఞఇస్తే తప్ప ఇప్పుడింక తలుపులు తెరవటం ఉండదు. కావాలంటే సార్వభౌముల నడగండి" అని వారు జవాబు చెప్పారు. వసిష్టమహర్షి సరాసరి నరకాసుర భవనానికి వెళ్ళి కాళీదర్శనం వెంటనే చేయాలని, తానెవరో కూడా చెప్పాడు. మద్యపానపు మత్తులో ఉన్న నరకుడు మహర్షి మాటలు పట్టించుకోలేదు. తిరస్కార పూర్వకంగా ఇప్పుడు వీలుకాదు పొమ్మన్నాడు వసిష్ఠునకు ఆగ్రహం కలిగింది. "నాకు దర్శన మివ్వని కాళి ఇక్కడ నుండి అదృశ్యమగును గాక!' అని అక్కడ నుండి వెళ్ళి పోయినాడు.మరునాడు తెల్లవారేసరికి గర్భగుడిలో దేవతలేదు.


అమ్మవారి లీలను గ్రహించిన సిద్ధనాగుడు అక్కడి నుండి బయలుదేరి వేగంగా బృందావనం చేరుకొన్నాడు. యమునాతీరంలో ఒక కుటీరం ఏర్పరచుకొని మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా కఠోర తపస్సు మొదలుపెట్టాడు. సర్పములలో ఒక లక్షణమున్నది. ఆహారం లేకుండా దీర్ఘకాలం జీవించగలవు. అంతేకాక అతడు ఓషధీ పరిజ్ఞాత. కొండలమీద నుండి జలపాతములు పడేచోట్ల మహాసర్పములు నివసించే సందుల దగ్గర రాతిబొడ్డు లేక రాతిమదం అనే పదార్థం ఉంటుంది. అది కొంచెం మింగితే నెలల తరబడి ఆహారం లేకుండా ఉండవచ్చు. తాను నాగరాజు కనుక దానిని సులభంగా సంపాదించ గలిగాడు. తన నాగభూమిలో హిమాలయపర్వత శిఖరాలపై నుండి ఎన్నో జలపాతాలు పడుతుంటవి. అక్కడ ఈ పదార్థం సమృద్ధిగా దొరకుతుంది. కావలసినంత సేకరించి దగ్గర ఉంచుకొన్న సిద్ధనాగుడు దాని సహాయం వల్ల ఆహారంతో అవసరం లేకుండా సర్వకాల సర్వావస్థలలో కృష్ణమంత్రసాధన చేస్తున్నాడు. ఎన్నాళ్లు గడచిందో ఎంతకాలం గడచిందో ఎన్ని సూర్యోదయ, అస్తమయాలు జరిగిపోయినవో, ఎన్ని పగ ళ్ళెన్ని రాత్రులు కరిగిపోయినవో తెలియటం లేదు.


ఒకనాటి సంధ్యాసమయంలో యమునాతీరమంతా కలకలంతో నిండిపోయింది. యక్షులు, గంధర్వులు మొదలైన దేవజాతుల వారు కనిస్తున్నారు. వారిలో కొందరితో పూర్వ పరిచయం కూడా తనకున్నది. వారి నడిగితే వారు వివరాలు చెప్పారు. "ఈ రోజు రాత్రి యమునాతీరంలో శ్రీకృష్ణదేవుడు, రాధాదేవితో రాసక్రీడలు జరుపబోతున్నాడు. నేడు కార్తీక పూర్ణిమ. ఆ దివ్య శృంగారదృశ్యాలను చూడటానికి ఊర్థ్వలోకాల నుండి దేవతలు విమానాలలో వస్తున్నారు. వారంతా ఆకాశంలో దూరంగా తమ విమానాలలో ఉండి ఆ రాధాకృష్ణలీలలను చూస్తారట. ఈ విషయాన్ని మహనీయులైన పెద్దలు చెప్పగా విని మేము కూడా వచ్చాము. అయితే రాసక్రీడలు జరిగే దివ్యభూమికలో పురుషులెవ్వరికీ ప్రవేశముండదు. పరమేశ్వరుడయిన కృష్ణుడొక్కడే పురుషుడు. ఆయన ఎన్నివేల లక్షల శరీరాలనయినా ధరించగలడు. మనవంటి వారికి అందులో ప్రవేశము ఉండదు కనుక మేమంతా పక్షుల రూపాలను ధరించి ఇక్కడి చెట్లపై ఉండి కనులారా ఆ గోపసుందరుని దివ్యలీలలను దర్శించాలని అనుకొంటున్నానాము. నీవు కూడా మా వలెనే రూపం మార్చుకో, సరిపోతుంది". "మీ వలె పక్షిరూపాన్ని నేను ధరించవలసిన పనిలేదు. మానవేతరమైన ఏ రూపమయినా ఫరవాలేదని మీ మాటలను బట్టి అర్ధమవుతున్నది. నాకు సహజమైన నాగరూపాన్ని ధరించి దట్టమైన ఏ పొద దగ్గరో ఉండి గోవిందుల దర్శనం చేసుకొంటాను" అన్నాడు సిద్ధనాగుడు. పదహారు కళలతో చంద్రుడు సంవత్సరంలో ఒక్క కార్తీక పూర్ణిమరోజుననే ప్రకాశిస్తాడు. లలితకళాప్రపూర్ణుడైన కృష్ణచంద్రుడు రాసేశ్వరి అయిన రాధాదేవితో కలసి ఆడుతూ, పాడుతూ విహరించిన దృశ్యాలను చూచే అదృష్టం కలిగింది. శ్రీకృష్ణుని దివ్యమైన మురళీనాదం వినే అదృష్టం, బృందావనేశ్వరి అయిన రాధాదేవి నృత్యం చేస్తూంటే చూచే భాగ్యం అతనికి లభించినవి.


దట్టమైన పొదల గుబురుల మధ్య పడగయెత్తి చూస్తున్న అతనిని ఒక్క క్షణం పాటు కృష్ణచంద్రుడు వీక్షించాడు. గోవిందు డటువైపు ఎందుకు చూస్తున్నాడా అని రాధాదేవి కూడా చూచింది. ఆది దంపతులైన ఆ ప్రేమమూర్తుల కరుణార్ద్రదృష్టి ప్రసరించి తన తపస్సు ఫలించిందని అనిపించింది.


"నాయనా ! బృందావనధామంలో ఉండటానికి నీకు అనుమతి నిస్తున్నాము. సర్పయాగ ప్రమాదం నిన్నంటదు. నీవెంట ఒక గోపిక ఉండి నిన్ను ఎప్పుడూ రక్షిస్తుంటుంది" అన్న సందేశం వినిపించింది.


ఆ రాత్రి పూర్తయిన తరువాత నుండి బృందావన ధామంలోనే నివసిస్తున్నాడు. నిరంతర కృష్ణమంత్రాన్ని జపిస్తునే ఉన్నాడు. కొంతకాలం గడచిన తరువాత ఒకనాటి నిశీధసమయంలో కృష్ణుని మురళీనాదం వినిపించటం మొదలు పెట్టింది. అంతరిక్షం నుండి దివ్యతేజస్సు గల ఒక బాలిక దిగి వచ్చింది. "ఓయీ! చిరకాల కృష్ణమంత్ర జపం చేత రాధాసాధన చేయగల అర్హత నీకు లభించింది. నీ తపస్సు భావాత్మకంగా పరిణమించి దివ్యప్రేమామృతాన్ని అందుకోవటానికి రాసేశ్వరి కృపకావాలి. రాధాకృష్ణుల ఆజ్ఞవల్ల నీకు రాధామంత్రాన్ని ఉపదేశించటానికి వచ్చాను" అని ఆదివ్యమూర్తి అతనిని శ్రీరాధారసోపాసనలోనికి ప్రవేశపెట్టింది. ఆ సాధన వల్ల ఎన్నో దివ్యానుభూతుల నతడు పొందగలిగాడు.


( సశేషం )


🌹🌹🌹🌹🌹



Commenti


bottom of page