top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 64 Siddeshwarayanam - 64


🌹 సిద్దేశ్వరయానం - 64 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


యోగేశ్వరి ఇలా తీర్థయాత్రలలో క్షేత్ర కేంద్రీకృత తపస్సులో దాదాపు 40 సంవత్సరాలు గడిచిపోయినవి. గురువర్యులు ఇచ్చిన వరంవల్ల వయసు పైనబడ్డా ముసలి తనం రాలేదు. తనసంచారంలో భాగంగా కాశీ, బృందావనం మాత్రం తరుచుగా వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం గడిపేది. కాశీలోని శవశివకాళీ మందిరంలో ధ్యానం చేస్తున్నపుడు తానే కాళినన్న తాదాత్మ్య భావన కలిగేది. అక్కడికి దగ్గరలో ఉన్న తారాపీఠంలో గాని, వటుక భైరవ మందిరానికి దగ్గరగా ఉన్న కామాఖ్య కాళి ఆలయంలో కాని ధ్యానం చేస్తే, అరుణ సుందరి అయిన మూర్తిగా తారా లక్షణాలుకల కాళి కనిపించేది. అంతః ప్రేరణవల్ల మళ్ళీ వంగదేశం సంచారం చేస్తూ భిన్న ప్రదేశములలో తటస్థించిన ఇద్దరు యువకులకు తాంత్రిక సాధనలు కొన్ని అభ్యసింప చేసింది. వారికి చిన్న చిన్న శక్తులు కొన్ని లభించినవి. ఒక యువకుడు కావాలనుకొన్నపుడు తన శరీరంలోనుండి కాంతి పుంజాలను ఎంతదూరమైనా ప్రసరింపచేయ గలిగేవాడు. మరొక వ్యక్తికి అదృశ్యుడయ్యేశక్తి వచ్చింది. ఈ శక్తులను దుర్వినియోగం చేయవద్దని వారిని హెచ్చరించి తనదోవన తాను సంచారానికి బయలు దేరింది.


ఒకనాడు కలకత్తాలో గంగానది మీద పడవలో వెళ్ళి ఎదురుగా రాణీరాసమణీదేవి కట్టించిన దక్షిణేశ్వరకాళీ మందిరం వైపునడిచింది. అక్కడికి యాత్రికులుగా వచ్చిన సన్యాసులకు దేవాలయ అధికారులు వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని విని ఉన్నది. గుడివైపు నడుస్తుండగా ఒక యువకుడు ఆమెను ఎదురుగా వచ్చి "మా మామయ్య మిమ్ములను తీసుకురమ్మన్నాడు. రండి". అని ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు పరిచితులెవరూ లేరు. మీ మామయ్య ఎవరు? ఎందుకు పిలుస్తున్నాడని అడగకుండా, సరే,పద అని ఆతని వెంబడి నడిచింది. ఆ యువకుడు గుడి పూజారి అయిన గదాధరుని దగ్గరకు తీసుకువెళ్ళాడు.


గదాధరుని చూడగానే తను అతని కోసమే వచ్చానని స్ఫురణకల్గింది. "నాయనా! నీవు ఇక్కడ ఉన్నావా! నీ కోసమే వెతుకుతూ వస్తున్నాను" అన్నది. గదాధరుడు కూడా అలానా? తల్లీ చాలా సంతోషము రా. అని మర్యాద చేసి సుఖాసనాసీనురాలిని చేశాడు.బాగా పరిచయమున్న వ్యక్తి తో మాట్లాడుతున్నట్లుగా గదాధరుడు తాను చేస్తున్న కాళీసాధన గురించి చెప్పి, తన అనుభవాలను చెప్పటం మొదలుపెట్టాడు. గదాధరుని మేనల్లుడు, ఆమెను ఆహ్వానించి తీసుకు వచ్చిన హృదయ్ ఆ దృశ్యాన్ని దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. వారిద్దరూ చిరకాల పరిచితులవలె మాట్లాడుకుంటున్నారు. వారికి పూర్వపరిచయం లేదని తనకు తెలుసు. అద్భుత సౌందర్యంతో దివ్యతేజస్సుతో కాషాయంబరధారిణి యైన ఈ సన్యాసిని ఎవరు? ఆమె తన మేనమామను, గుడిపూజారిని నాయనా ! అని చిన్న పిల్లవానిగా పిలిచి మాట్లాడుతున్నది. తన మామ కూడ ఆమెను 'అమ్మా' అని తల్లివలె మాట్లాడుతున్నాడు. చూడటానికి ఇద్దరూ సమవయస్కులుగా ఉన్నారు. అతడికి ఏమీ అర్ధంకాలేదు. మామ సూచనను అనుసరించి ఆమెకు వసతి మొదలైన సౌకర్యాలు ఏర్పాటు చేయటం కోసం అతడు అవతలికి వెళ్ళాడు. గుడికి దగ్గరలో ఉన్న పంచవటిలో తాను చేసిన సాధనలను పొందిన దర్శనాలను, అనుభవాలను ఆమెకు విశదీకరించి చెప్పి "అమ్మా! నీవు చాలాగొప్పదానవు, సిద్ధురాలివి. నాకు కలిగిన ఈ అనుభవాలను విన్నవారు చాలా మంది మనః కల్పిత భ్రాంతులని కొట్టి వేస్తున్నారు. మరి కొందరు నన్ను పిచ్చివానిగా జమకడుతున్నారు. వీనిలో ఏది నిజమో నీవు చెప్పు అమ్మా” అని పసివాని వలె ఆమెను గదాధరుడు అభ్యర్థించాడు.


యోగేశ్వరి "నాయనా! నీవు పొందిన దర్శనాలు అనుభవాలు అన్నీ సుసత్యాలు. జగన్మాత అయిన కాళి నీకు ప్రసాదించిన అనుగ్రహ చిహ్నాలు. వాటి సత్యాన్ని గురించి నీవు సందేహించవలసిన పనిలేదు. కాదనే వారి సంగతి ఇక నేను చూచుకొంటాను. నీవు నిశ్చింతగా ఉండు" అన్నది.


( సశేషం )


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


bottom of page