🌹 సిద్దేశ్వరయానం - 65 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵
భైరవి బ్రాహ్మిణి కి దేవాలయంలో నివాసానికి ఒక గది ఏర్పాటు చేయబడింది. అక్కడ నుండి, ప్రతిరోజూ వారిద్దరూ ఏకాంతంగా కూర్చొని అనేక విషయాలు చర్చించేవారు. తరువాత గదాధరుని మేనల్లుడు చెప్పటం వల్లగాని, సామాజిక అవగాహన వల్లగాని ఇద్దరూ సమవయస్కులుగా కన్పిస్తున్నవారు. (నిజానికి భైరవీ బ్రాహ్మణి తనకంటే చాలా పెద్దదని గదాధరునికి తెలుసు. కానీ ఆమె 25సం|| సౌందర్యవతిగా కన్పించేది.) ఒకే చోట ఉండటంగాని ఎక్కువసేపు కలిసి ఉన్నట్లు కనపడటంగాని ఉచితంగాదని గుర్తించి, తెలిసిన, వేరేచోట ఆమెకు వసతి ఏర్పాటు చేశాడు. ఆమె ఏ మహత్తర కార్యక్రమం కోసం వచ్చిందో ఆ కార్యక్రమం ప్రారంభించబడింది. కలకత్తాలో ఎక్కడెక్కడో వెదికి అనేక వస్తువులు తీసుకువచ్చి గదాధరుని చేత చిత్ర విచిత్రమైన సాధనలు చేయించింది.ఈ విధంగా 64 రకములైన తాంత్రిక సాధనలలో, భైరవీ బ్రాహ్మణి గురుత్వంలో గదాధరుడు శిక్షణ పూర్తి చేశాడు.
ఈ దశలో ఒకరోజు సుదీర్ఘదేహం కలిగిన ఒక నగ్న సాధువు దక్షిణేశ్వరం వచ్చాడు. గడ్డము జటాజూటములు గల ఆ దిగంబర సాధువు, నాగ సంప్రదాయానికి చెందినవాడు. గదాధరునిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే తాను ఎంత సిద్ధపురుషుడైన, కాళీదేవీ యొక్క దర్శనాలను, అనుభూతులను పొందినవాడైనా, తాంత్రికసాధనలో ఉత్తీర్ణుడైనా, ఏదో ఒక విద్యలో నిష్ణాతులైన వ్యక్తులు వస్తే వారి ద్వారా ఆ విద్యనేర్చుకొని ఆ మార్గం యొక్క స్వరూపస్వభావాలు తెలుసుకోవాలని అనుకొనేవాడు. ఇప్పుడు వచ్చిన ఈ'తోతాపురి' గదాధారుని యోగ్యతను గుర్తించి సన్యాసదీక్ష ఇవ్వాలని భావించాడు. అయితే ఆ విషయం గదాధరునితో చెప్పినపుడు "నాకు తల్లీ భార్య ఉన్నారు, నేను సన్యాసం తీసుకోవటానికి వారు ఇష్టపడరు" అని ఆతడన్నాడు.
"సన్యాసానికి వైరాగ్యం ప్రధానం, తల్లి అనుమతి, భార్య అనుమతి కావాలని అంటే వారితో అనుబంధాలు, ఇంకా ఉన్నవన్నమాట. వైరాగ్యం కలిగినవారికి ఎవరి అనుమతీ అవసరం లేదు" అనగా గదాధరుడు- ఆ నాగసాధువు దగ్గర సన్యాస స్వీకారం చేశాడు. అతనికి 'రామకృష్ణ' అన్న నూతన నామధేయం ఇవ్వబడింది. సన్యాస మార్గంలో 'పరమహంస' అన్నది అత్యున్నతస్థానం కనుక, రామకృష్ణుడు ఆ స్థాయికి ఎదిగిన వాడుగనుక, అనంతరకాలంలో ఆయన 'రామకృష్ణ పరమహంస'గా పిలువబడినాడు.
తోతాపురి సూచనల వల్ల ప్రేరణ వల్ల నిర్వికల్ప సమాధిలో నిర్విరామంగా 3 రోజుల పాటు ఉండటం తోతాపురికే దిగ్భ్రాంతి కల్గించింది. కొన్నాళ్ళుండి తన కర్తవ్యం పూర్తయినదని భావించిన తోతాపురి అక్కడ నుండి వెళ్ళి పోయినాడు.
దక్షిణేశ్వర కాళీ మందిర యజమాని మధురాబాబుకు రామకృష్ణుడంటే ఎనలేని గౌరవం. కాళీమాత యొక్క దివ్యమైన అనుబంధాన్ని పొందిన మహాభక్తుడని ఆయనను గూర్చిన ప్రగాఢమైన విశ్వాసం. ఒకరోజు భైరవీబ్రాహ్మణి అక్కడ ఉండగా మధురాబాబు అక్కడికి వచ్చాడు. ఆమెకు రామకృష్ణునికి, ఇద్దరికి నమస్కారము చేసినప్పుడు సంభాషణ వశాన ఆమె రామకృష్ణుడు అవతార పురుషుడని ప్రతిపాదించింది. ఆ మాటలు విని మధుబాబు "రామకృష్ణులవారు, మహనీయులనటంలోను, కాళీదేవి కరుణను పొందిన వారనటం లోనూ ఎటువంటి సందేహమూ లేదు కానీ, అవతారాల విషయానికివస్తే నాకు తెలిసిన కొద్ది పరిజ్ఞానంలో అవతారాలు 10 అని అందులో 9 అవతారాలు కృష్ణావతారంతో పూర్తయినవని పదియవ అవతారం కలియుగాంతంలో మాత్రమే వస్తుందని ప్రజలు చెప్పగా విన్నాను అన్నాడు.
దానికి భైరవబ్రాహ్మణి సమాధానం చెపుతూ “అవతారాలలో దశావతారాలు ముఖ్యమైనవి మాత్రమే, భాగవతంలో ఏకవింశతి అవతారాలు చెప్పబడినవి. మరికొన్నికూడా ఉండవచ్చు. రామకృష్ణుల వారికి కలిగిన అనుభవాలను వివిధ సాధనల వల్ల ఆయన పొందిన సిద్ధశక్తులను విశ్లేషించినపుడు ఆయన అవతార మని చెప్పక తప్పదు. అదీకాక మహాపురుషుడైన కృష్ణచైతన్య మహాప్రభువు మళ్ళీ అవతరిస్తాడని గౌడీయ సంప్రదాయంలో యోగులు చెపుతున్నారు. ఈ విషయం నేను వాదించి సప్రమాణంగా శాస్త్రబద్ధంగా నిరూపించి ఏ పండితుడినైనా ఒప్పిస్తాను. మీరు విద్వత్ సభ ఏర్పాటు చేయండి. మిగతావి నేను చూచుకుంటాను" అన్నది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
コメント