top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 7 Siddeshwarayanam - 7


🌹 సిద్దేశ్వరయానం - 7 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🌹సిద్దేశ్వరయానం 🌹


Part-7


🏵 బృందావన సంఘటన 🏵


యమునా తీరం - బృందావన ప్రాంతం - చెట్లు మొక్కలు బాగా పెరిగి అడవివలె ఉన్నది. జనపద ప్రాంతం - దుష్ట మృగాల భయం లేదు. చిన్న చిన్న కాలి బాటలు. ప్రాంత గ్రామ ప్రజలు యమునలో ఎక్కడ బడితే అక్కడ దిగి స్నానాలు చేసిపోతుంటారు. అయితే ఎక్కువమంది స్నానాలు చేసే చోట్ల బురద లేకుండా రేవులు ఏర్పడి ఉంటవి. అటువంటి ఒక ప్రదేశం దగ్గరకు పదియేండ్ల బాలిక నడుస్తూ వచ్చింది.


ప్రభాత సమయం. జనం ఎవ్వరూ లేరు. కొంచెం దూరంగా జనావాసాలకు అందుబాటులో లేని ప్రదేశం కావటం వల్ల నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది. ఎక్కువసేపు స్నానం చేస్తూ ఈతలుకొడుతూ జలక్రీడలలోని ఆనందాన్ని అనుభవించదలచుకొన్నవారు ఇటువంటి స్థలాలను ఎన్నుకొంటారు. ఆ అమ్మాయి ఆ ఆలోచనలతో వచ్చినట్లుంది. వయస్సు పదియేండ్లే కాని పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు అలరారుతున్నది. యమున ఒడ్డుకు వచ్చి ఆ కన్య కట్టుకొన్న వస్త్రములను తీసి అక్కడి చెట్టు దగ్గర పెట్టి ఒక ఉత్తరీయం ఒంటికి చుట్టబెట్టుకొని యమునలోకి దిగి లోపలికి వెళ్ళింది. ఈతబాగా వచ్చు గనుక నీళ్ళలో ఆడుతూ సరదాగా చాలా సేపు మునుగుతూ లేస్తూ నీరుచిందిస్తూ జలవిహారం చేసింది. పూర్తి సంతృప్తిగా ఈతకొట్టిన తర్వాత ఒడ్డుకు వద్దామని బయలుదేరుతుంటే ఒంటికి చుట్టుకొన్న ఉత్తరీయం నీటిలో కొట్టుకుపోయిందని గమనించింది. తీరంవైపు చూస్తే ఎవరు కనపడలేదు. నదిలో నుంచి బయటకు వచ్చి చెట్టు దగ్గర గుడ్డలు అందుకొంటున్నది. ఉన్నటుండి పెద్ద పాము బుస్సు మని పైకి లేచింది. దట్టంగా ఉన్న గడ్డిలో తానా సర్పంతోక త్రొక్కి నటులున్నది. భయపడి వస్త్రాలు తీసుకోకుండా ఎగిరి ఆవలకు దూకి పరుగెత్తటం మొదలు పెట్టింది. అది వెంటబడింది. ఆ అమ్మాయికి అలసట వచ్చి పడిపోబోతున్నది. ఇంతలో ఎవరో వచ్చి పట్టుకొన్నారు. పడకుండా ఆపారు, కండ్లు తెరచి చూచింది. తానొక పురుషుని చేతులో ఉన్నది. అతడు తనను చూడటం లేదు. ఆ మహాసర్పాన్ని చూస్తున్నాడు. "నాగరాజా! ఆగు. ముందుకు రావద్దు. సిద్ధనాగుని ఆజ్ఞ!" అన్నాడు. ఆ పాము పడగవిప్పి ముందుకు రాబోతున్నది ఆగిపోయింది.


ఆమెను చుట్టి ఉన్న తన దృఢ దీర్ఘబాహువులను ఇవతలకి తీసి “ఇందులేఖా! ఇక్కడ ప్రక్కనే ఉన్న పెద్దరాయి మీదకూచో, భయంతో అలసటతో ఉన్నావు. నీ వస్త్రాలు నేను తెచ్చి యిస్తాను. వాటిని ధరించు" అని అతడు తీసుకు వచ్చి యిచ్చాడు. ఆమె గబగబా వస్త్రాలు ధరించింది. అతడు మరొక్కసారి ఆ పాము వైపు చూచి “సర్పరాజా ! ఉత్తమజాతి సర్పానివి నీవు. పొరపాటున తోక తొక్కగానే అంతకోపం తెచ్చుకోకూడదు. ఒక వేళ ఈమెను కరచి అనుకోనిది ఏదైనా జరిగితే నీకు మహాపాపం చుట్టుకొని దుర్గతి పాలయ్యేవాడివి. వెళ్ళు - ఇకముందు ఎన్నడూ ఇటువంటి పనులు చేయకు!" అన్నాడు. ఆ మహానాగం పడగ వంచి నేలమీద ఆన్చి నమస్కరించి నెమ్మదిగా పొదలలోకి వెళ్ళిపోయింది.


ఆ బాలిక అతని వైపు చూచి "ఆర్యా! మీరెవ్వరు? ఆ సర్పరాజుకు ఇస్తున్న ఆజ్ఞనుబట్టి మీ పేరు సిద్ధనాగుడని తెలుసుకొన్నాను. నాపేరు మీకెలా తెలుసు? పేరు పెట్టి పిలిచారు. భయంలోనుంచి తేరుకొంటున్నాను. కాని ఆశ్చర్యంలోనించి బయటకు రాలేకున్నాను.


సిద్ధనాగుడు :


ఇందులేఖా! ఐరావత వంశీయుడైన ఒక నాగరాజుకు గంధర్వకాంతయందు పుట్టినవాడను. మానవరూపంలో ఉన్న నాగజాతిమాది. మా తల్లిదండ్రులది ప్రేమవివాహం. వారి సంతానమైన నాకు తల్లివైపు నుండి మా మాతామహుని వల్ల కొన్ని గాంధర్వ విద్యలు సిద్ధించినవి. అందువల్ల నీవెవరో తెలుసు. ద్విరూపధారణశక్తి సహజంగా తండ్రి వైపు నుండి లభించింది. అవసరమైనప్పుడు నాగరూపాన్ని ధరించగలను. ఇప్పుడు వచ్చిపోయిన ఈ పెద్దపాముకు నేను దివ్యనాగంగా కనిపించాను. భయపడి వెళ్ళిపోయింది. అది ఇక నీ జోలికి రాదు. నీవు నిర్భయంగా నీ యిష్టమైన చోటికి వెళ్ళవచ్చు.


ఇందు :


మహానుభావా! మీ మాటలు విన్న తరువాత మరింత దిగ్భ్రాంతికి లోనవుతున్నాను. నేను కన్యను. సౌందర్యవతినని అందరూ అంటారు. దిగంబర దశలో మిమ్ము కౌగలించుకొన్నాను. తరువాత గుడ్డలు వేసుకొన్నాను. మీతో మాట్లాడుతున్నాను. మీలో ఏవిధమైన కామ వికారమూ కనపడలేదు. నే నెందరో యువకులను చూచాను. కాని మీ వంటి జితేంద్రియుని చూడలేదు.


మరొక ప్రధానమైన విషయము. నేను ఉత్తమవంశంలో ఉదయించాను. నన్నొక పురుషుడు వస్త్రరహితగా చూచి నన్ను స్పర్శించి ఆలింగనం చేసుకొన్న తరువాత అందులోను ఏ దుష్ట ప్రవృత్తి లేక ప్రాణరక్షణకు మాత్రమే ప్రవర్తించిన సంఘటన అనంతరము - నేను మరొక పురుషుని ఎలా పెండ్లి చేసుకొంటాను? ఏమీ జరగనట్లు నన్ను వెళ్ళిపొమ్మంటున్నారు. ఇది న్యాయమేనా?


( సశేషం )


🌹🌹🌹🌹🌹



댓글


bottom of page