🌹 సిద్దేశ్వరయానం - 70 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 19వ శతాబ్దం - గుహలో కాళి 🏵
తీర్థ యాత్రకు బయలుదేరి పాంధులతో కలిసి ఆంధ్ర ప్రాంతం నుండి ఓడ్ర దేశంలోకి ప్రవేశించాము. రైలు వేగంగా కదలిపోతున్నది. ఒక అడవిలోకి ప్రవేశించిన తరువాత ఎందుకో గమనం మందగించి నెమ్మదిగా సాగుతూ కాసేపటికి బండి ఆగిపోయింది. గంట, రెండు గంటలు, మూడు గంటలు గడిచినవి. ఈ లోపు ప్రయాణికులు గార్డు దగ్గరికి కొందరు, ఇంజను దగ్గరకు కొందరు వెళ్ళి కనుక్కుంటే త్రోవలో కొంత దూరాన పట్టాలు బాగుచేస్తున్నారు. త్వరలో సందేశం వస్తుంది బయలుదేరుతాము అని సమాధానం వచ్చింది. నాకెందుకో మనస్సులో ఇక్కడ దిగు దిగు -రైలులో వెళ్ళవద్దు. అని సందేశం వస్తున్నట్లు అనిపించింది. చాలామంది క్రింద దిగి మాట్లాడుకుంటున్నారు. కొందరు దూరంగా ఉన్న చెట్ల దగ్గరకు వెళ్ళి నీడలో విశ్రాంతి తీసుకొంటున్నారు. నేనూ దిగి దూరంగా ఒక రావిచెట్టు కింద కూర్చున్నాను.
శ్లో॥ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమః
అశ్వత్థ వృక్షం మొదలు బ్రహ్మస్వరూపం, మధ్య విష్ణు స్వరూపం. కొమ్మల చివరలు పైన శివరూపం. అటువంటి దేవతా వృక్షానికి నమస్కారం అనుకొంటూ ఉన్నాను. సాయంసంధ్య దాటి కొంచెం చీకటిపడుతున్న సమయానికి రైలు కూత వేసి బయలుదేరింది. గార్డు విజిల్ వేశాడు. అందరూ గబగబా రైలెక్కారు. నేను ఉండిపోయినాను. నేను తమతో రాకపోతే ఈ ప్రయాణీకుడు ఏమైపోయినాడో పట్టించుకొనే వారు నా ఆప్తులు- బంధువులు - రైలులో ఎవరూ లేరు. నేను ఎప్పుడూ ఒంటరివాడినే. ఇప్పుడూ ఒంటరివాడినే. నాలో నేనే నవ్వుకొన్నాను. ఈ ప్రపంచంలో ఎవరికెవరు ? ఒంటరిగా రావటం ఒంటరిగా పోవటం. మధ్యలో భార్యా - బిడ్డలు - చుట్టాలు - స్నేహితులు నదీ ప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉండే కట్టెల వంటి వారు. జీవితం ఎంత చిత్రమైనది! ఆ రాత్రి ఆ చెట్టు క్రిందనే శయనించి ప్రొద్దుననే లేచి చూచి నెమ్మదిగా దగ్గరనే ఉన్న ఒక సరస్సులో స్నానం ముగించుకొని రైలు వెళ్ళిన త్రోవ ప్రక్క నడవటం మొదలుపెట్టాను.
మధ్యాహ్నం దాకా నడిచిన తర్వాత ఒక చోట దిగుడుబావి. పండ్లచెట్లు కనిపించినవి. ఆగి నాలుగు పండ్లు కోసుకొని తిని కాసిని మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకొన్నాను. ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ లేచి బయలుదేరుతుంటే ఒక కోయవాడు కనిపించి ఎక్కడకు వెళుతున్నారని అడిగాడు. భువనేశ్వర్ వెళ్తున్నానని చెప్పాను. అతడు " ఈ బండ్లదోవన నడుస్తూ పోతే చాలా రోజులు పడుతుంది. అడవిలో దగ్గర దోవ ఉంది. కాలిబాట. నేనూ అటే వెళుతున్నాను. మీరు వస్తే మిమ్మూ తీసుకెళ్తాను. ఇక్కడి మార్గాలన్ని నాకు బాగా తెలిసినవి" అన్నాడు. అతనిని చూస్తే మనిషి మంచి వాడిలానే ఉన్నాడు. ఒక వేళ కాదు - అయితే ఏమిటి? నా దగ్గర ఏముంది? నా గమ్యస్థానం అంత వేగంగా చేరుకోవలసిన పనేమీ లేదు. తొందరగా చేరినా మంచిదే చేరకపోయినా మంచిదే. ఎవరో ఒకరు తోడు దొరికారు. అనుకొని అలాగే కలసి వెళదామన్నాను. కొంతదూరం ప్రధాన మార్గంలో నడిచి తర్వాత అడవిలో ప్రవేశించాము. మధ్యాహ్నం, రాత్రి పూట ఆగటం పండ్ల చెట్లున్న చోట్లు నీళ్ళు దొరికే చోట్లు మాకు విశ్రమస్థానాలు. అవి ఆ కోయవానికి తెలుసు. ఇలా కొద్దిరోజుల ప్రయాణం సాగింది.
ఒక చోటుకు వెళ్ళేసరికి కనుచూపు మేర మోకాలి లోతు నీళ్ళు. త్రోవ కనపడటం లేదు. ఆ కోయవాడు "బాబుగారూ! దోవ ఇటే కానీ ఇప్పుడు పోవటానికి వీలు లేదు. ఎక్కడ ఎంత లోతు నీళ్ళుంటవో, ఎక్కడైనా ఊబి ఉంటుందో ప్రమాదం. ఎన్ని రోజులు ఇలా ఉంటుందో చెప్పలేము. ఇటీవల కురిసిన వానల వల్ల ఇలా జరిగింది. ఇప్పుడేమి చెయ్యాలో తోచటం లేదు" అన్నాడు. నేను "ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కు పోవాలనిపించటం లేదు. ఈ నీటి ప్రక్కనే నడుచుకుంటూ వెళ్లాము. అమ్మవారు సహాయం చేస్తుంది” అని ముందుకు దోవదీశాను. ఇప్పుడు నేను తెలియని మార్గదర్శిని. అలా వెళ్ళగా వెళ్ళగా అడవిలో ఒక కొలను. అక్కడికి మనుషులు వచ్చిన జాడలు కనిపిస్తున్నవి. వాటిని పట్టుకొని వెళుతున్నాము. సాయంకాలం కావచ్చింది దారి కాస్త పెద్దదైంది. మరి కొన్ని కాలిబాటలు దీనిలో వచ్చి కలిసినవి. బండ్లు ప్రయాణం చేసే దోవలోకి చేరాము. ఎక్కువ దూరం పోకముందే ఒక తోట కనిపిస్తున్నది. మనుషులు గోచరిస్తున్నారు. ఒక కొండగుట్ట మరీ ఎత్తు లేదు. అక్కడి నుండి కొ దరు ఎదురు వచ్చారు. పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి కంఠంలో పూలదండ వేశారు. కోయవాడు దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. వారంతా నా పాదములకు నమస్కారం చేశారు. "స్వామీ! మీరాక కోసం ఎదురు చూస్తున్నాము" అంటూ వారిలో పెద్దాయన అరవై సంవత్సరాల వానివలె ఉన్నాడు. ఆయనతో ముప్ఫైయేండ్ల యువకుడు, మధ్యవయస్కులు కొందరు. స్త్రీలు - వినయంతో రావలసినదిగా ప్రార్థించారు. ముందుకు వెళ్ళిన తర్వాత పాణిపాద ప్రక్షాళనం చేసి ఆ కొండగుట్టలోని ఒక గుహలోకి ప్రవేశించాము.
అది పెద్ద గుహ. అందులో కాళీదేవి యొక్క విగ్రహం అద్భుతంగా అలరారుతున్నది. ఆ పెద్దాయన అమ్మవారికి హారతి యిచ్చి విధేయతతో నన్ను అచట సింహాసనం మీద ఆసీనుని చేసి విన్నవించాడు. "గురుదేవా! మీరిక్కడకు వస్తున్నారని అమ్మవారు తెలియజేశారు. ఈ గుహమీది. ఈ దేవి మీతో హిమాలయాల నుండి వచ్చినది. కాళీసిద్ధునిగా మూడు వందల సంవత్సరాలు జీవించి శరీరాన్ని విడిచి వెడుతూ నాకిక్కడి బాధ్యతలు అప్పగించారు. గత రెండు వందల సంవత్సరాలుగా నేనిక్కడ సేవచేస్తున్నాను. మా అబ్బాయి ఇప్పుడే తపస్సులో కొంత పురోగమిస్తున్నాడు. ఇక ఈ క్షణం నుండి మేమంతా మీ అజ్ఞాబద్ధులము. మీతో వచ్చిన ఈ కోయవాడు నిమిత్తమాత్రుడు. వానికి సుఖంగా జీవించటానికి కావలసినంత ధనమిచ్చి పంపిస్తున్నాము".
కాళీదేవిని చూస్తున్నాను. తప్పిపోయిన బిడ్డ తిరిగివస్తే తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది కాళీమాత. ఆమె కన్నులలో ప్రేమ, కరుణ, జాలి అన్నీ భాసిస్తున్నవి. కాసేపటికి అందరూ బయటికి వెళ్ళిపోయినారు. మిగిలింది అమ్మ - నేను.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments