top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 71 Siddeshwarayanam - 71



🌹 సిద్దేశ్వరయానం - 71 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 నిస్తికథ 🏵


స్వామివారు కొండలో గుహలలో సంచారం చేస్తూ ఒక గ్రామానికి చేరారు. గ్రామస్థులు వారికి వారి పరివారానికి ఒక యింట్లో వసతి యేర్పాటు చేసి బియ్యం, ఉప్పు, పప్పు కూరలు మొదలైనవి తెచ్చి పెట్టారు. శిష్యులు వండిన పదార్థాలను స్వామివారు భోజనం చేసిన తర్వాత ఆ రోజు సాయంకాలం చాలామంది దర్శనానికి వచ్చారు. శిష్యుల ద్వారా స్వామివారు మహిమాన్వితుడైన యోగి అని తెలుసుకొని తమ తమ సమస్యలను విన్నవించుకొంటుంటే వాటి పరిష్కారానికి కావలసిన మంత్రము లుపదేశించి వానిని చేయవలసిన విధానాలు చెప్పి పంపిస్తున్నారు.


ఇలా జనం వస్తున్నారు. పోతున్నారు. కాసేపటికి ఇద్దరు దంపతులు తమ కూతురును తీసుకొచ్చి చూపించి "అయ్యవారూ! ఈ బిడ్డ ఒంటి నిండా కురువులు లేచినవి. చీము కారుతున్నది. దురదతో చాలా బాధపడుతున్నది. ఎన్నిమందులు వాడినా తగ్గటం లేదు. ఊళ్ళో సుగాలి అని మంత్రవేత్త ఉన్నాడు. నెలరోజుల నుండి మంత్రం వేస్తున్నాడు. మందులిస్తున్నాడు. కానీ తగ్గలేదు. మీరు గొప్ప యోగీశ్వరులని ఊళ్ళో అందరు చెప్పుకొంటుంటే విని తీసుకొచ్చాము. దయతో మా అమ్మాయిని బాగు చేయండి" అని ప్రార్థించారు. స్వామివారు "చర్మవ్యాధులు పోవటానికి నాగ మంత్రం పనిచేస్తుంది. మీరు చెయ్యగలిగితే ఉపదేశిస్తాను" అన్నారు.


వారు "అయ్యా! మేము ఎంత చెయ్యగలుగుతాము? మా వల్ల ఏమవుతుంది? ఇంటి పనులు పొలం పనులతో ఏదో కొద్దిగా చేస్తాము. అది సరిపోతుందా? అని విచారం వ్యక్తం చేశారు. స్వామివారు “నేనిక్కడ రెండు మూడు రోజులుంటాను. మీరు భక్తితో చేతనయినంత చేయండి. ఒక పాము పుట్ట దగ్గరకు వెళ్ళి కాస్త పసుపు, కుంకుమ చల్లి కాసిని పాలు పోసి ఆ పుట్ట మట్టి కొంచెం తెచ్చుకొని అది కాస్త తడిచేసి బొట్టు పెట్టుకొని జపం చేయండి.! నాగరాజు అనుగ్రహం వల్ల తగ్గుతుంది. అమ్మాయికి బాగవుతుంది” అని వారిని పంపివేశారు. స్వామివారు చెప్పినట్లు మూడవరోజు కల్లా ఆ అమ్మాయికి కురుపులు మాడిపోయినవి. దురదలు తగ్గినవి. అందరికి ఆశ్చర్యం కలిగింది. ఆ పిల్ల తల్లిదండ్రులు వచ్చి కృతజ్ఞతతో పాద నమస్కారములు చేశారు.


ఈ వార్త విని ఆ ఊరి మాంత్రికుడు వచ్చాడు. తాను చేయలేని దానిని ఇంకెవడో వచ్చి చేయటం అతడు భరించలేక పోయాడు. “ఏమయ్యా! నీవేదో పెద్ద చేశానని విర్రవీగకు. ఈ అమ్మాయి అసలు పుట్టింది నా దయ వల్ల. ఈ దంపతులకు పిల్లలు పుట్టక బాధపడి నన్ను ఆశ్రయిస్తే ఒక ప్రత్యేక దేవతను ఆవాహన చేసి ఆ విగ్రహంకు పూజ చేశాను. అది ఒక ఉచ్ఛిష్ట విద్య. దాని ప్రభావం వల్ల ఈ బాలిక పుట్టింది. నిష్ఠీవన ప్రభావం వల్ల పుట్టింది కనుక నిస్తి అని పేరు పెట్టాను. ఇప్పుడు ఆ అమ్మాయికి చర్మవ్యాధి తగ్గించానని పొంగిపోతున్నావేమో! అది ఎక్కడకు పోయింది? నీ మీదకు వచ్చింది. చూచుకో" అన్నాడు. స్వామివారి శరీర మంతా దద్దురులు - కురుపులు వచ్చినవి. వారేమీ మాట్లాడ లేదు. ప్రశాంతంగా కండ్లు మూసుకొని నాగస్తుతి చేయటం మొదలు పెట్టారు.


ఆ స్తోత్రం పూర్తి అయ్యేసరికి స్వామివారి చర్మం మీది కురుపులు మాయమైనవి. జనం ఆశ్చర్యంతో చూస్తున్నారు. స్వామివారు ఇలా అన్నారు. “సుగాలీ! క్షుద్రవిద్యలు కొన్ని నేర్చుకొని వాటిని ఇలా ప్రయోగిస్తున్నావు. ఎప్పుడూ ఇది సాగదు. నీవు చేసిన ప్రయోగాన్ని నేను తిప్పికొట్టగలను. ఒంటి మీదకు భయంకరమైన కురుపులు వచ్చి శరీరమంతా కుళ్ళిపోయి మరణిస్తావు. కాని నా ప్రవృత్తి అది కాదు. అయితే నీకు శిక్ష తప్పదు. ఇక ముందు నీవు చేసిన మంత్ర విద్యలేవీ పనిచేయవు. ఎవరిమీద ప్రయోగాలు చేయాలని తలపెట్టవద్దు. అవి ఫలించవు. భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ సాధన చేసుకో”


ఆ క్షుద్ర మాంత్రికుడు తలవంచుకొని కాళ్ళమీద పడ్డాడు. ప్రజల నమస్కారాల మధ్య స్వామివారు ఆ ఊరి నించి బయలుదేరారు.


( సశేషం )


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


bottom of page