🌹 సిద్దేశ్వరయానం - 73 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 1864 - సాధకయోగి 🏵
పరమాత్మస్వామి: హిమాలయాలలో డాకినులు మాట్లాడే ఒక ప్రాకృత భాష ఉంది. దానిని నేర్చుకొనే అవకాశం నీకు లభిస్తుంది. ఆభాషలోని కొన్ని మంత్రములు నీకు ప్రాప్తిస్తవి. కిరాతరూపుడైన పరమేశ్వరుడు అనాగరికులైన ఆటవికులు, క్రూరజంతువుల నుండి బాధల నుండి తప్పించుకోవటం కోసం తీవ్ర సాధనలతో, ఆచారాలతో, హోమాదులతో అవసరంలేని మంత్రములను సృష్టించాడు. అవి చాలా త్వరగా సిద్ధిస్తవి. వాటి వల్ల వచ్చిన శక్తులతో లోకోపకారం చేయగలుగుతావు. ప్రస్తుతం వీలైనంత త్వరలో హిమాలయాలకు వెళ్ళు.
ఆశ్రమ : స్వామీ ! నేను ఊహించని, ఊహించలేని ఎన్నో విశేషాలను తెలియజేశారు. మళ్ళీ మనం కలుసుకొనే అవకాశం కలిగించండి!
పరమాత్మస్వామి : ఈశ్వరేచ్ఛ! జీవులు నదిలో కొట్టుకుపోయే కాష్ఠముల వంటివారు. కొంతసేపు కలిసి విడిపోతుంటారు. భాగవతంలో ఇలా చెప్పబడింది.
ఉ . వాయువశంబులై యెగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు నొక భంగి చరింపదు కాలమన్నిటిన్ జేయుచునుందు కాలము విచిత్రము దుస్తరమెంత వానికిన్ - అన్నింటికి మూలం కాలం. ఎంత వారికైనా దాటరానిది. నీవడిగినది మనసులో పెట్టుకొంటాను. నీవు కోరిన ప్రకారము మళ్ళీ కలుద్దాము.
ఆశ్రమ : స్వామివారూ ! మీరప్పటికి ఈ శరీరంతోనే వస్తారు గదా!
పరమాత్మస్వామి : నేనిప్పటికి ఎన్నో శరీరాలు మారాను. దేవతల,సిద్ధాశ్రమ గురువుల సంకల్పాన్ని, ఆజ్ఞను అనుసరించి యోగ్యులలో దివ్యచైతన్యాన్ని జాగృతం చేయటం కోసం సమయాన్ని బట్టి కొత్త శరీరాలను తీసుకొంటుంటాను. అప్పటికి నేను కూడా మారిన శరీరంతో వస్తాను.
ఆశ్రమ : మహానుభావ! మీరు అపారశక్తి సంపన్నులు. మీరు కోరితే ఈ శరీరంతో ఉండలేరా?
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం
పుట్టుక, చావు, మళ్ళీ పుట్టుక ఇవి తప్పవా?
స్వామి : సామాన్యంగా తప్పవు. తీవ్రంగా సంకల్పిస్తే దీర్ఘకాలం జీవించవచ్చు. కాలాన్ని జయించాలన్న పట్టుదలతో కాలానికి అధీశ్వరియైన కాళిని ఉపాసించి పూర్వజన్మలో మూడు వందల సంవత్సరాలు జీవించాను. సిద్ధగురుకృపఉంటే వారి అనుగ్రహం వల్ల దివ్యస్ఫురణ కలుగుతూ ఉంటే దేవకార్య, గురుకార్యం చేయటం కోసం శరీరాలు మారటంలో విచారం ఉండదు. నేను కర్తను కాదు, భోక్తనూ కాదు. దేవకార్యం కోసం నియమించ బడిన నిమిత్తమాత్రుడను అని మనసా వాచా కర్మణా భావించ గలిగితే అప్పుడు మనలను గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకొనేవారు వేరే ఉంటారు. సరి! వీటికేమి! మనం మళ్ళీ కలుస్తాము. నేను నిన్ను గుర్తుపట్టగలను. నీవు కూడా తెలుసుకోగలవు. ప్రస్తుతానికి ఇది చాలు.
ఆశ్రమాధిపతి : మీ ఆజ్ఞ! కర్తవ్య నిర్వహణకు దీవించండి.!
పరమాత్మస్వామి : తథాస్తు !
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments