top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 75 Siddeshwarayanam - 75



🌹 సిద్దేశ్వరయానం - 75 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 రత్న ప్రభ -2 🏵


రత్న ప్రభ : మహాత్మా! నేను మీతో మాట్లాడలేను. మొదటిసారి మిమ్ము కామాక్షీదేవి దగ్గర చూచినప్పుడే ఏదో చెప్పలేని భక్తి పారవశ్యం కలిగింది. ఎందుకో ఏమో తెలియదు. నా అనుభూతికి ఏ ఆధారము లేదు. కానీ అంతరాంతరాలలో మీరు తప్పక నన్ను కరుణిస్తారని అనిపిస్తున్నది. మీతో మాట్లాడాలని మీతో ఎక్కువసేపు గడపాలని, మీ సన్నిధిలో ఉండాలని తీవ్రమైన ఆకాంక్ష. నేను కొంచెం సంస్కృతం చదువుకొన్నాను. కాళిదాస మహాకవి రచించిన ఒక శ్లోకం గుర్తుకు వస్తున్నది.


శ్లో॥ రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకోభవతి యత్సుఖితో పిజంతుః

తచ్చేతసా స్మరతి నూన మబోధ పూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని


ఎప్పటివో ఏవో పూర్వజన్మ అనుబంధాలు నన్ను కలచి వేస్తున్నవా? కానీ మీముందు అంత సాహస వచనాలు పలుకలేను.


స్వామీ : ఓ! మంచి పండితురాలివి. పంచకావ్యాల వరకు చదువుకొన్నావు గదా! ఇంకా చదివేదానివే. నీ తండ్రి - నిన్ను మీ అమ్మను విడిచిపెట్టి వేరెవరితోనో ఉండటంవల్ల మీ యింటి పరిస్థితి కల్లోలితమైంది. ఏదో మీ అమ్మ పుట్టింటి వారిచ్చిన ఆస్తితో నిన్నుపెంచి పెద్ద చేస్తున్నది. ఇంకా పెద్ద చదువులు చదవవలసిన దానివే. సరిలే! దానికేమి? ఈ మంత్రోపదేశం సంగతి అటుంచు. పెళ్ళెప్పుడు చేసుకొంటావు?


రత్న : స్వామీ! స్వామీ! నేనెంత అదృష్టవంతురాలిని. నా కుటుంబ విషయాలు నేను మీకు చెప్పలేదు. మీకెవరూ చెప్పే అవకాశం లేదు. ఇవి మీకెలా తెలిసినవని నేనడగను. మీరు సర్వజ్ఞులని సిద్ధపురుషులని లోకమంతా చెపుతున్నది. నన్ను గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మీకు రావటమే నా అదృష్టం. పేదదానిని. నాకు పెళ్ళేమిటి? మీ సేవ చేసుకొనే అవకాశమిస్తే చాలు. జీవితమంతా మీ పాద సన్నిధిలో గడుపుతాను.


స్వామి : చాలు! చాలు! చాలా ఉద్వేగంలో ఉన్నావు. నా సేవలోకి వస్తానంటున్నావు. మరి మీ అమ్మను ఏం చేస్తావు?


రత్న : గురుదేవా! నేనేమి చేస్తాను. మీరే నిర్ణయించాలి.


స్వామి : నన్ను గురుదేవా అంటున్నావు. నేనింకా మంత్రోపదేశం చేయలేదుగా!


రత్న : మహాప్రభూ! మంత్రోపదేశాన్ని మించిన జీవితోపదేశం మొదలైందని అనుకొంటున్నాను. మీరు ఆజ్ఞాపించండి! ఏం చేయమంటారు?


స్వామి : ఏమి చేయగలవు? ఏదైనా చేయగలరోజు భవిష్యత్తులో వస్తుంది. దాని కోసం సాధన చేయాలి. నీవు మంత్రోపదేశం కోసం వచ్చావు. కానీ నేను నీకు ఉపదేశం చేయాలని అనుకోటంలేదు.


రత్న : పూజ్యగురుదేవా! అంత అయోగ్యురాలినా? మీ దగ్గర మంత్రం తీసుకొనే అర్హతలేదా? అయితే నేనింక బ్రతికి ప్రయోజనమేమున్నది?


స్వామి : ఉన్నది. నీకు మంత్రాన్ని కృష్ణ భైరవుడిచ్చేట్లు చేస్తాను.


రత్న : గురుదేవా! నాకు మీరే ఇవ్వాలని నా ప్రార్ధన.


స్వామి : నీకోరిక కాదనను. అలానే!


రత్న : అయితే అనుగ్రహించండి!


స్వామి : ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు.


రత్న : మరి యెప్పుడు? ఎక్కడ? నాకు చాలా ఆదుర్దాగా ఉంది.


స్వామి : ఆతురత అవసరంలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ జరగవలసిన పద్ధతిలో జరుగుతవి. నీ ఉపదేశాన్ని గురించి నేను చెప్పింది, నీవు కోరింది - రెండూ జరుగగలవు. అయితే భౌతిక భూమికలో కాదు.


దివ్యభూమికలో నాలో కృష్ణభైరవుడుండి నీకు ఉపదేశిస్తాడు.


రత్న : సిద్ధేశ్వరా! కృష్ణభైరవు డుండుట యేమిటి! మీరే కృష్ణభైరవులు.


స్వామి : తథాస్తు! సిద్ధేశ్వరా! అన్నావు. భక్తితో నిఘంటువు యొక్క అర్థంలో అన్నా భవిష్యత్తులో నా పేరదే అవుతుంది. ఇప్పటివలెనే అప్పుడూ నా దగ్గరకు వస్తావు. అవన్నీ తరువాత తెలియజేయబడతవి.


రత్న : నేను రావటమేమిటి? మీరు రప్పించుకొంటారన్నమాట. ఇప్పుడర్ధమవుతున్నది. నేను మంత్రం కోసం మీదగ్గరకు వచ్చానని అనుకొన్నాను. మీ సంకల్పంవల్ల నేను వచ్చానని ఇప్పుడు తెలుసుకొంటున్నాను.


స్వామి : (చిరునవ్వుతో) తెలివిగల దానివి. ఈ తెలివి నిజమైన అసలు తెలివిగా మారాలి. ఆరోజు త్వరలో వస్తుంది.


రత్న : మంత్రేశ్వరా! యోగీశ్వరులు మీరు. మీ మాటలు వింటుంటే నా తల తిరిగి పోతున్నది. నేనేమై పోతున్నానో అర్ధం కావటంలేదు. మిమ్ము శరణు వేడుకొంటున్నాను. మీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను.


త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ నాధశ్చ గురు స్త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ!


అంటూ ఆనందాశ్రువులు జాలువారుతుండగా స్వామి వారి పాదములపై తల ఉంచి రెండు చేతులతో నాగిని వలె చుట్టి నమస్కరించింది.


స్వామి : రత్నా! లే! ఇప్పటికీ అనుభవం చాలు! జాగ్రత్తగా విను. ఈ నవరాత్రుల తర్వాత నేను తీర్ధయాత్రలకు బయలుదేరుతున్నాను. శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ఉజ్జయిని, కామాఖ్య క్షేత్రాలకు ప్రయాణం. నాతో చాలామంది పరివారం భక్తయాత్రికులు ఉంటారు. మీ అమ్మతో చెప్పు. ఆమె నా ఇచ్ఛాశక్తివల్ల అంగీకరిస్తుంది. మీ యింటిని బంధువులకు అప్పగించండి. ఈ క్షేత్ర దేవతల అనుగ్రహంతో పునీతురాలివైన నీకు కామాఖ్యలో మంత్రోపదేశం జరుగుతుంది. ఇక యింటికి వెళ్ళు.


రత్న : మీ ఆజ్ఞ. మీ పాదపద్మస్థలమే నా యిల్లు. రేపు మళ్ళీ వస్తాను.


స్వామి : శుభమస్తు, వెళ్ళిరా.


(సశేషం )


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


bottom of page