top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 77 Siddeshwarayanam - 77



🌹 సిద్దేశ్వరయానం - 77 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 రత్న ప్రభ - 4 🏵


లలితాదేవి పరివారంలో డాకినీగణం ఉంది. ఆ గణంలో ఉంటూ ఒకరోజు త్రివిష్టప (టిబెట్) సమీప ప్రదేశంలోని ఒక గుహలో తపస్సు చేస్తున్న ఒక ఋషిదగ్గర ఆడిపాడి కుతూహలం కొద్దీ ఆతనిని కదిలించింది. ధ్యానభంగమై అతడు కోపం తెచ్చుకొని కోతివలె ప్రవర్తించి నాకు ఇబ్బంది కలిగించావు కనుక కోతి వగుదువుగాక! అని శపించాడు. ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉండగా సిద్ధేశ్వరయోగి ఎవరి శరీరంలో ప్రవేశించి యున్నాడో ఆ పద్మ సంభవుడనే భైరవయోగి వజ్ర వైరోచనీమంత్ర సిద్ధుడక్కడికి వచ్చాడు. ఆ గుహలో ఉన్న వజ్రేశ్వరీ, భైరవులను సేవించి ప్రక్కన ఉన్న జలపాతం దగ్గర నిలుచున్నాడు. తానుశాపగ్రస్త బాలికగా అక్కడ తిరుగుతూ అతనిని చూచింది. తనవలె ఉన్న ఒక జీవిని చూడటం అదే మొదటిసారి. ఆ తరువాత అద్భుతమైన సన్నివేశాలు తన జీవితంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నవి. ఒక సాక్షివలె రత్నప్రభ ఆ దృశ్యాలను చూస్తున్నది.


ఇంతలో పన్నెండేళ్ళ అమ్మాయిగా తాను వచ్చింది. దిగంబర. చెట్ల ఆకులు కొన్ని నడుముకు చుట్టుకొన్నది.పద్మసంభవుని దగ్గరకు వచ్చింది. వింతగా చూస్తున్నది. కోతివలె కిచకిచమని ధ్వని చేసింది. చుట్టూ తిరిగింది. వస్త్రాలు పీకింది. మళ్ళీ నిల్చుని అదేపనిగా వీక్షిస్తున్నది. అతడామెను నిశితంగా పరిశీలించాడు. కోతి లక్షణాలు తప్ప మనిషి లక్షణాలు కనపడటం లేదు. మనుష్య భాష వచ్చినట్లు లేదు. ఈమె వివరాలు తెలుసుకోవాలి. తానీమె కోసం వచ్చినట్లుంది. ఈ మనిషికి భాష ఎందుకు రాలేదు ? ఒక్కసారి సమ్మోహినీ దేవతను స్మరించాడు. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని ఒక పెద్ద రాతి బండ మీద కూర్చోబెట్టాడు. ఆ బాలిక కాదనలేదు. ఆ కన్య నొసలు బొటనవేలితో తాకి సమ్మోహన నిద్రలోకి పంపాడు. ఆరాతి మీద ఆమె వెల్లికల పడుకొన్నది. కన్నులు మూతలు పడినవి. ఆ స్థితిలో అతడామెను ప్రశ్నిస్తున్నాడు.


పద్మ : బాలికా ! ఎవరువు నీవు ?


కన్య : సమాధానం లేదు ఏదో మాట్లాడాలని ప్రయత్నం. కాని మాటలు రావటం లేదు.


పద్మ : నిద్రలోనికి వెళ్తున్నావు. గాఢనిద్రలో ప్రవేశించావు. నీకు మాట్లాడే శక్తినిస్తున్నాను. పలుకు ! నీవు పలుకగలవు.


కన్య : నెమ్మదిగా పెదవులు కదలుతున్నవి. "నేను డాకినిని. మధురగాయకిని. నర్తకిని. సౌందర్యవతిని. ఒకరోజిక్కడ తపస్సు చేసుకొంటున్న ఒక యోగికి నా పాటలతో, అరుపులతో ధ్యానభంగం కలిగించాను. అతనికి కష్టం వేసింది. కోతివలె ప్రవర్తించి నాకు ఇబ్బంది కలిగించావు. కోతివై పుట్టుదువు గాక ! అని శపించాడు. నా దివ్యశక్తులన్నీ పోయినవి. నా కంఠం మూగపోయింది. ఆయన కాళ్ళమీద పడి ఏడ్చాను. క్షమించమని ప్రార్థించాను. చాలా సేపటికి ఆయనకు దయ కలిగింది. శాపాన్ని కొంతమార్పు చేసి మనిషిగాపుడతావు గాని కోతుల మధ్య పెరుగుతావు. మనుషుల మధ్య ఉండవు. పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక యోగి వల్ల శాపవిమోచనం కలుగుతుంది అని అనుగ్రహించాడు. నాశరీరం పతనమైంది. నేపాల్లోని ఒక శాక్య రాజవంశస్త్రీ గర్భంలో ప్రవేశించాను.


నెలలు నిండుతుండగా ఆమె పుట్టింటికి భర్త అనుమతితో బయలుదేరింది. భటులు, పరివారం అంతా ఉన్నారు. ఒక పల్లకిలో ఆమె. ఆమె గర్భంలో నేను. ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో భయంకరమైన పులి వచ్చి దాడి చేసింది. ఒకరిద్దరు పరివారంలోని వారిని చంపి తిన్నంత మాంసం తిని వెళ్ళిపోయింది. హతశేషులు పరుగెత్తి పారిపోయినారు. ఆ స్త్రీ అక్కడే ప్రసవించి దిక్కులేని స్థితిలో మరణించింది. నన్నిక్కడి కోతులు పెంచినవి. ఈప్రదేశానికి తరువాత ఎవరైనా వచ్చారో లేదో నాకు తెలియదు. నాకు కొంచెం ఊహ వచ్చేసరికి ఈ కోతుల పెంపకంలో ఉన్నాను. ఇక్కడి పండ్లు ఆహారం, జలపాతం నీరు తాగటానికి, ఇన్నేండ్లు ఎలా గడిచినవో తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారు. నన్ను రక్షించండి"


( సశేషం )


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comentarios


bottom of page