🌹 సిద్దేశ్వరయానం - 79 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 రత్న ప్రభ - 6 🏵
పద్మ సంభవుని మాటలతో శాక్యదేవికిప్పుడు దిగులు తీరింది. ఆ శరీరంతో కొంతకాలం ఉండి కర్తవ్య నిర్వహణచేసి అది పతనమైన తర్వాత మరల బృందావనంలో మనోరమ అన్నపేరుతో పుట్టింది. సిద్ధేశ్వరుడు కాళీసిద్ధుడై బృందావనం వచ్చినపుడు ఆ మహాత్ముని సేవించింది. ఆయన తనకు పూర్వజన్మ స్మృతి కలిగించి అప్పుడు చేసిన వజ్ర గురుమంత్రము, కాళీమంత్రము తిరిగి ప్రసాదించాడు. మరల వెనుకటివలెనే స్వప్నానుభూతులు మొదలైనవి. అప్పుడప్పుడు వారిని చూడటానికి భువనేశ్వరారణ్యానికి వెళ్ళి అక్కడి కాళీదేవిని దర్శించేది. ఆ జన్మ ముగిసిన తరువాత ఇప్పుడు దక్షిణభారతంలో వచ్చిన జన్మ యిది. ఆ మహాపురుషునితో సిద్ధభైరవునితో ఎన్నిజన్మల అనుబంధమో - ఏ సుకృతమో తనని నడిపిస్తున్నది.
కల ముగిసింది. మెలకువ వచ్చింది. కనిపించిందంతా ఒక మహేంద్రజాలంవలె ఉంది. ఆనందోత్సాహాలతో శరీరం పులకించిపోతున్నది. తెల్లవారగానే స్నానాదులు ముగించుకొని స్వామివారి దగ్గరకు వెళ్ళింది. ఆయన కండ్లు మూసుకొని ఏదో పాడుకొంటున్నారు.
"రత్నప్రభా! రా! సరియైన సమయానికి వచ్చావు" అని కూర్చోమని నిర్దేశించారు. ఆమె పాదనమస్కారం చేసి వినయంతో కూర్చున్నది. స్వామి : రత్నా! తెలుసుకోవలసినంత వరకు తెలుసుకొన్నావు. ఇప్పుడు నీ వెవ్వరో నీ జీవిత గమనమేమిటో తెలుసుకొన్నావు గదా!
రత్న : తెలిసినట్లే ఉంది కానీ ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉందని అనిపిస్తుది.
స్వామి : అలానే ఉంటుంది. ఏ కాళీవిద్య, ఏ స్వప్నవిద్య నీవు పూర్వజన్మలో సాధన చేశావో వాటినే ఇప్పుడు కూడా చెయ్యి. ఈ జీవితం కూడా అలానే నడుపుతారు దేవతలు. ఇప్పుడు మనం కాశీ వెళుతున్నాము. కాలభైరవుడు నన్ను పిలుస్తున్నాడు. నీ భవిష్యత్తు ఇక్కడ నిర్దేశించబడినట్లే నా భవిష్యత్తు అక్కడ నిర్దేశించబడుతుంది. కాశీనుండి మళ్ళీ మనం కంచి వెళ్తాము. అది నీ తపస్థానం. వృద్ధత్వం వచ్చిం దాకా అక్కడ ఉండి శరీరం విడిచి మళ్ళీ తమిళదేశంలోనే పుణ్యవతి అనే పేరుతో పుట్టి నా దగ్గరకు వస్తావు. నేనింకా ఈ శరీరంతోనే అప్పటివరకు ఉంటాను. ఆ తర్వాత ఇద్దరమూ దేహాలుమారి ఆంధ్రదేశంలో పుడతాము. నేను నీకంటే ముందు పుట్టి పెరిగి పెద్దవాడనైన తర్వాత హిమాలయకాళి - భువనేశ్వరికాళి విగ్రహరూపంలో నా దగ్గరకు వచ్చి పూజలందు కొంటుంది. నీవు కూడా పెరిగి వయసులోకి వచ్చి వైద్యవిద్య చదివి, డాక్టరై నా దర్శనానికి వచ్చి కాళీసాధన పునః ప్రారంభం చేస్తావు.
అప్పుడు నేను కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠాధిపతినై సిద్ధేశ్వరానంద నామంతో ఉంటాను. నీవు నా దగ్గర యోగినీదీక్ష తీసుకొని బ్రహ్మచారిణివై, కఠోరదీక్షలతో జపహోమములుచేసి కాళీ కాలభైరవుల అనుగ్రహాన్ని సాధిస్తావు. అప్పుడు హోమకుండంలో నుండి హిమాలయ వజ్రభైరవ గుహలో నీవు పూజించిన ఏకముఖి రుద్రాక్షవచ్చి నీ కందించబడుతుంది. నీ గతజన్మలన్నీ స్మృతిపథంలోకి వస్తవి. కాలక్రమాన సన్యాసిని ఎవుతావు. మిగతా విషయాలు నెమ్మదిగా నీకు తెలియజేయబడుతవి. ఇక బయలుదేరు! గంగాస్నానము, విశ్వనాధ దర్శనము, కాలభైరవపూజ నిన్ను పవిత్రీకృతం చేస్తవి. నే నెప్పుడూ నిన్ను కనిపెట్టి ఉంటాను. శుభమస్తు!
రత్న : నేనేమీ మాట్లాడలేకున్నాను. మీ ఆజ్ఞానుసారిణిని.
ఆత్మీయమూర్తి! పరమాత్మ! మహానుభావా! ఆనందరూప! కరుణామృత రాగదీపా!
శుద్ధాంతరంగ! శివసుందర ప్రేమయోగా! ప్రజ్ఞానపావన! కృపన్ నను కావరావా! లీలాంక! నీదుమురళీ తరళీకృతశ్రీ కేళీ పథమ్ములివి కేవల యౌగికమ్ముల్ నాలో వెలింగిన వనంత రసాంతరాంతః కాలావధి స్మృతులు - గాఢతమో మహస్సుల్
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments