top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 8 Siddeshwarayanam - 8


🌹 సిద్దేశ్వరయానం - 8 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🌹సిద్దేశ్వరయానం 🌹


Part-8


🏵 బృందావన సంఘటన 🏵


సిద్ధ నాగుడు :


ఇందులేఖా ! నీ ధర్మదీక్షను నేను అర్థం చేసుకొంటున్నాను. ఇంత దూరం నేను ఆలోచించలేదు. ప్రమాదంలోని ఒక అమ్మాయికి శక్తి ఉన్నది గనుక ఉపకారం చేశాను. ప్రత్యుపకారం కోరటం నా లక్షణం కాదు. కానీ నీ మాటలు విన్న తరువాత ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది.


ఇందు లేఖ :


మీకేవైనా సమస్యలున్నవా? మీరు అసామాన్య శక్తి సంపన్నులుగా ఉన్నారు. మీ మెడలో మూడు పోగుల యజ్ఞోపవీతమున్నది. కనుక అవివాహితులని తెలుసుకోగలిగాను. మహనీయులైన మీకు నా వంటి సామాన్యురాలిని స్వీకరించటానికి అభ్యంతరమా ?


సిద్ధ:


గోపికా ! నాగజాతిలో కులవ్యవస్థ లేదు. వైదికమైన ఉపనయనములు లేవు. నాకు తపస్సు మీద ఇచ్చ ఎక్కువ. అందుకని ఋషులు - ఆశ్రమాలు- వీటినాశ్రయించి తిరుగుతుంటాను. ఒక ఋషి నా యందు దయదలచి వడుగు చేసి జందెంవేసి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. సరి ! అది అలా ఉంచుదాము. ప్రేమతో తనువు, మనస్సు- జీవితము సమస్తము సమర్పించటానికి సిద్ధమైన నీవంటి సుందరిని కాదనగల శక్తిలేదు. మనసార అంగీకరిస్తున్నాను. అయితే నీకిప్పటిలో వివాహయోగము లేదు.


ఇందు :


అదియేమి ! నాకర్ధం కావటం లేదు. నేను ఈ ప్రక్క గ్రామంలో ఒక గోపవంశంలో పుట్టిన దానిని. కుటుంబపోషణకు కావలసిన గోవులు మాకున్నవి. వాటి పాలు, పెరుగు, వెన్నలను విక్రయించి వచ్చిన ధనంతో ఇల్లు గడచిపోతున్నది. ఇటీవల బర్సానా ప్రభువు వృషభాను మహారాజు కుమార్తె రాధాదేవి చెలికత్తెగా చిన్న ఉద్యోగంలో చేరి ఆమె సేవచేస్తున్నాను. ప్రభువు ఇచ్చే జీతంతో కుటుంబం మరింత సుఖంగా ఉంది. రాజకుమారికి బృందావన వాసులైన నందరాజు కుమారుడు శ్రీకృష్ణునితో వివాహం నిశ్చయమైందని విన్నాను. రాధాకృష్ణులు పరస్పరం ప్రేమించుకొంటున్నారు. మా చెలికత్తెలలో కొందరికీ విషయం తెలుసు, వారి మధ్య రాయబారాలు, అప్పుడప్పుడు రహస్యంగా కలుసుకోటాలు, ప్రేమలేఖలు - ఇవన్నీ జరుగుతున్నవి. రాజదంపతులకు ఈ విషయం తెలిసి లేకలేక పుట్టినకుమార్తె కోరిక కాదనలేక ఒప్పుకొన్నారు. రాజసభలో దీనిపైన చాలాచర్చలు జరిగినవి. కులపెద్దలు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తినా చివరకు రాజు మాటకు అంగీకరించారు. ముహూర్తాలు పెట్టుకొనే దశలో ఉంది.


రాజకుమారి వివాహమైతే తరువాత నా వివాహం చేద్దామని మావాళ్ళు అనుకొంటున్నారు. ఈ స్థితిలో మీ పలుకు అశనిపాతం లాగా ఉంది. భయం వేస్తున్నది.


సిద్ధ :


ఇందూ! కాలకర్మగమనం అనూహ్యమైనది. రాధాదేవి వివాహం ఆగిపోతుంది. తరువాత వచ్చే పరిణామాలను నీవు ఊహించలేవు. నిజానికి నీవు దివ్యలోకం నుండి వచ్చావు. కాని జననీగర్భంలోకి ప్రవేశించి మానవ శరీరం ధరించటం వల్ల మరపు వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న జరగబోతున్న సంఘటనలు సామాన్యమైనవి కావు.


ఇందు:


మహాత్మా! మీరు సిద్ధపురుషులు రాజకుమారి పెండ్లి ఆగకుండా జరిగేలా చేయండి! అప్పుడు మన పెండ్లి నిరాటంకంగ జరుగుతుంది. మీరు తలచుకుంటే ఏదైనా చేయగలరు.


సిద్ధ:


చేయలేను. ఈ కార్యక్రమ ప్రణాళికను ప్రచోదన చేస్తున్న మహాశక్తి ముందు నేను చాలా అల్పుడను. జగదీశ్వరుడైన కృష్ణచంద్రుని ప్రణాళికయిది. కృష్ణుడు యశోదానందుల పుత్రుడని, చిన్నతనం నుండే దుష్టులను సంహరించిన బలవంతుడని మీరంతా అనుకొంటున్నారు. రాధాదేవిని రాజకుమారిగా సౌందర్య సౌజన్యములు మూర్తీభవించిన ప్రేమస్వరూపిణిగా మీకు తెలుసు.


ఇప్పుడు అసలు విషయాలు తెలుసుకోవలసిన సమయం ఆసన్నమయింది. వాటిని తెలుసుకోటానికి నేను చెప్పటానికి ఇది తగిన స్థలమూ కాదూ, సమయమూ కాదు.


ఇందు :


మరి ఎలా ? నాకు చాలా ఆదుర్దాగా ఉంది.


సిద్ధ :


ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. రేపు బర్సానా వెళ్ళి రాజకుమారి సేవలో చేరు. నేను నీకొక యంత్రం ఇస్తాను. రాత్రివేళ నీవు పడుకొనేప్పుడు తల దిండు క్రింద దానిని పెట్టుకొని నిద్రించు. మూడు రోజులు మూడు స్వప్నములు వస్తవి. జరిగిన, జరుగుతున్న పరిణామ రహస్యాలు నీకు తెలుస్తవి. నీ జీవితమార్గమూ నిర్ణయమవుతుంది. అప్పుడు నేను వచ్చి నిన్ను కలుసుకొంటాను. మనం మాట్లాడుకోవలసిన అంశాలు చాలా ఉన్నవి.


ఇందు :


మీరు నాకు భర్త, గురువు, దేవుడు - సమస్తము. నన్నెక్కడకు రమ్మంటారు?


సిద్ధ :


నీవెక్కడకు రావలసిన పని లేదు. నేను నిన్ను కలుసుకొంటాను. నీ మనః ప్రేరణవల్ల రావలసిన చోటికి వస్తావు. అక్కడ నేను సిద్ధంగా ఉంటాను.


ఇందు :


మిమ్ము విడిచి వెళ్ళ లేకున్నాను. దిగులుగా ఉంది.


సిద్ధ :


నాకు కూడా అలాగే ఉంది. కాని కొన్ని తప్పవు.ఆ బాలిక వెనక్కు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ కదిలి వెళ్ళింది. ఆ దీర్గోన్నత దేహుడు నిర్ణమేషంగా చూస్తూ నిలుచున్నాడు.


( సశేషం )


🌹🌹🌹🌹🌹





Comments


bottom of page