🌹 సిద్దేశ్వరయానం - 80 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 బృందావన భక్తుడు 🏵
ఆరువందల సంవత్సరాల క్రింద శ్రీకృష్ణచైతన్య మహాప్రభువు బృందావనధామం వచ్చి రాధాకృష్ణులు తమ లీలలను ఎక్కడ ప్రదర్శించారో ఆ ప్రదేశాల సన్నింటిని గుర్తించి భక్తులకు తెలియజేశారు. అంతకుముందు కొన్ని స్థలాలు మాత్రమే ప్రజలకు తెలుసు. చైతన్యస్వామి అనుగ్రహం వల్ల ఇప్పుడు అన్నీ తెలుసుకొనే అవకాశం ప్రజలకు లభించింది. ఆయన తన భక్తులైన గోస్వాములను బృందావనధామంలో నివసించి రాధాకృష్ణులను సేవించవలసినదిగాను వారికి సంబంధించిన సాహిత్యాన్ని సృష్టించ వలసినదిగాను ఆదేశించారు. తత్ఫలితంగా రూపగోస్వామి సనాతనగోస్వామి మొదలైన మహనీయులు బృందావన నివాసులైనారు.
శ్లో॥ ఆరాధ్యోభగవాన్ ప్రజేశతనయః తద్దామ బృందావనం రమ్యాకాచిదుపాసనా ప్రజవధూవర్గేణయాకల్పితా శ్రీమద్భాగవతం ప్రమాణ మమలం ప్రేమా పుమర్ధోమహాన్ శ్రీ చైతన్యమహాప్రభో ర్మతమిదం తత్రాదరోనః పరః
ఈ అనంత సృష్టిలో పరమారాధ్యుడు నంద నందనుడైన గోవిందుడొక్కడే. ఆయన నివాసము బృందావనము. గోపికలు మధురభక్తితో చేసిన సాధనయే అన్నింటికంటే శ్రేష్ఠమైన ఉపాసనామార్గము. దీనిని తెలిపే శ్రీమద్ భాగవతమే పరమ ప్రామాణిక గ్రంథము. పురుషార్ధములు సామాన్యంగా నాలుగు చెప్పబడినవి. ధర్మార్థకామమోక్షములు. అయిదవది ప్రేమ. ఇదియే ఉత్తమమైనది గొప్పది. ఇదియే చైతన్యమహాప్రభువు యొక్క మతము. దీనియందే మాకు ఆదరము. దీనిని మించినది లేదు.
ఈ భావనతో, భజనలతో, తపస్సుతో బృందావన ధామం పులకించుపోతూ ఉంటుంది. గోస్వాములలో రూప గోస్వామి, న నాతనగోస్వామి ప్రముఖులు. పూర్వాశ్రమంలో వారు సోదరులు. సనాతనగోస్వామి ఆశ్రమం దగ్గర ఒక గృహస్థ భక్తుడు నివసిస్తూ ఆశ్రమంలో తన శక్తి కొద్ది ఆర్థికంగా, హార్ధికంగా సేవచేసేవాడు. యమునా తీరంలోని యోగులను భక్తిప్రపత్తులతో పూజిస్తూ ఉండేవాడు. ఒకరో జతడు రూపగోస్వామి ఆశ్రమంలో ఉండగా అక్కడకు ఒక హిమాలయయోగి వచ్చాడు. ఆ యోగి మంత్రసిద్ధుడని గంగాతీరంలో ఆయన చేసిన కాళీసాధన వల్ల జగన్మాత కాళీదేవి సాక్షాత్కరించి దీర్ఘాయువును, దివ్యశక్తులను ప్రసాదించిందని, రూపగోస్వామికి ఆయనకు జన్మాంతర సంబంధమేదో ఉండటం వల్ల ఇక్కడకు అప్పుడప్పుడు వస్తుంటారని విన్నాడు.
కాళీదేవి విగ్రహమొకటి ఆయన దగ్గర ఉన్నది. అది ప్రాణవంతమైన మూర్తియని, పెరుగుతూ ఉంటుందని విని ఆశ్చర్యపడినాడు. అదీగాక ఇప్పటికే ఆయన వయస్సు దాదాపు మూడు వందల సంవత్సరాలని తెలిసినప్పుడు దిగ్భ్రాంతి కలిగింది. తానుకూడా అలా కావచ్చునా? కాగలడా? రూపగోస్వామి దయవల్ల ఆ సిద్ధునితో పరిచయం బకలిగింది. అది సన్నిహితమైన అనుబంధానికి దారితీసింది. ఒక వైపు సనాతనగోస్వామి వాత్సల్యము, రాధాకృష్ణుల పై భక్తి మరొకవైపు సిద్ధశక్తులను సాధించాలనే తీవ్రమైన కోరిక. ఈ స్థితిలో ఉంటూనే కాళీసిద్దుని ఆశ్రయించాడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Komentáře