🌹 సిద్దేశ్వరయానం - 81 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 బృందావన భక్తుడు - 2 🏵
మహాసిద్దుడు ఒక రోజు తనను అనుగ్రహించి ఇలా పలికాడు !
"ఓయీ! నీ మనస్సు నాకు తెలుసు. నీ ఆకాంక్ష నాకు తెలుసు. రాధాగోవిందుల భక్తునిగా ఈ దీవ్యధామంలో భక్తి యోగమార్గంలో సాధన చేస్తున్నావు. మహనీయులైన రూపగోస్వామి, సనాతనగోస్వామి, కరుణపొందిన వాడవు. అయినా తాంత్రిక సాధన వైపు నీ మనస్సు మొగ్గుతున్నది. అది తప్పేమీ కాదు. నీవు పూర్వజన్మలలో నాకు పరమాప్తుడవు. ఆ రహస్యములు నాకు తెలుసు. నీకు తెలియదు. నీకు చాలా రహస్యమైన కాళీసాధన ఉపదేశిస్తున్నాను. ఈ పద్ధతిలో తపస్సు చెయ్యి. నీకు దేవి సాక్షాత్కరిస్తుంది. ఆమెయే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలియజేస్తుంది.”
కొన్నాళ్ళ తర్వాత కాళీసిద్ధుడు బృందావనం నుండి కళింగసీమ వైపు తన కాళీవిగ్రహంతో బయలుదేరి వెళ్ళాడు. తాను ఒక వైపు గోస్వాముల సేవచేస్తూనే రాత్రులు కాళీసాధన చేసేవాడు. అప్పటికే తనకు వయస్సు పైనబడింది. కొన్ని సంవత్సరాలు గడిచినవి. యథాశక్తి రాత్రి సాధనసాగుతూనే ఉన్నది. అప్పుడప్పుడు కాళి-రాధాసఖియైన శ్యామకాళీగా బాలికగా ధ్యానవేళ లీలాదర్శనమిస్తున్నది. ఒకనాడు మహాశివరాత్రి ఉపవాసముండి రాత్రంతా ధ్యానం చేస్తున్నాడు. అర్ధరాత్రీ లింగోద్భవ వేళ తన కంటిముందు ఒక జ్యోతి కనిపిస్తున్నది. దానిలో కాళీదేవి ఆకృతి - భీషణసుందరమైన ఆమె ముఖం నుండి మాటలు వెలువడుతున్నవి.
"సాధకుడా ! నీ యందు దయ కలిగి వచ్చాను. దివ్యశక్తులు పొందాలని, దీర్ఘకాలం జీవించాలని, బలమైన కోరికతో సాధన ప్రారంభించావు. కాని ఈ సాధన చాలదు. ఈ శరీరంలో నీ ఆయువు ముగిసిపోయింది. అయితే నీ తపస్సు నిష్ఫలం కాదు. వచ్చే జన్మలో నీవు హిమాలయాలలో త్రివిష్టపభూమిలో ఉదయించి ఒక ఏకాంతగుహలోకఠోర సాధనలు చేస్తావు. అప్పుడు నేను వజ్రేశ్వరినై నిన్ను అనుగ్రహిస్తాను. సిద్ధశక్తులతో నీవు మూడువందల సంవత్సరాలు జీవిస్తావు. ఆ తర్వాత ఇంకో జన్మ ఆంధ్రభూమిలో ఉదయించి సన్యాసివై ద్రవిడ దేశంలోని కుర్తాళక్షేత్రంలో పీఠస్థాపన చేస్తావు. ఇప్పటి నీ గురువైన కాళీసిద్దుడు అప్పుడు జన్మమారినా మళ్లీ నిన్ను కలుస్తాడు. అతడు అనంతర కాలంలో నీ పీఠానికి అధిపతియై మా నిర్దేశాన్ని పరిపాలిస్తాడు. నీవు ఎక్కడ ఉన్నా ఏ జన్మలో ఉన్నా నిన్ను రక్షిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు నీకు మార్గనిర్దేశం చేయబడుతూ ఉంటుంది”.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comentarios