🌹 సిద్దేశ్వరయానం - 82 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 కొండమీది దేవళము 🏵
శివచిదానందసరస్వతీస్వామి తన దేశ సంచారంలో ఒకసారి ద్రవిదాంధ్ర మధ్య ప్రాంతంలో ఒక కొండమీది గుడి దగ్గరికి వెళ్ళారు. ఇది ఒక అమ్మవారి దేవాలయం. జనమెవ్వరూ లేరు. గర్భగుడిలో నుండి మధ్య వయస్కుడైన ఒక యోగి బయటకు వచ్చాడు. మౌనస్వామికి స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్పి ఆతిథ్య మర్యాదలు జరిపిన తరువాత ఇద్దరూ సుఖాసీనులైనారు.
యోగి : శివ చిదానందా! చతురగిరి సిద్ధుని ప్రేరణ వల్ల మీరిక్కడికి రావడం జరిగింది. సిద్ధ పురుషులైన మీరాక నాకెంతో సంతోషం కల్గిస్తున్నది.
శివచిదానంద : యోగీశ్వరా ! ఏదో ప్రబలమైన శక్తి నన్నిక్కడికి ఆకర్షించింది. ఈ కొండగాని, ఈ అడవి కాని, ఈ గుడికాని పరిచితమైనవి కావు. ఈ కీకారణ్యంలో ఇక్కడ ఒక గుడి ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు ఏదో అంతరమైన ఆదేశం వల్ల నేనిక్కడికి వచ్చాను. మీరెవరో తెలుసుకోవాలని ఉంది.
యోగి : స్వామీ! మీరు సన్యాసులు. నేను యతిని కాదు. సంప్రదాయాన్ని అనుసరించి మీరు నాకు పూజ్యులు, మనది సిద్ధాశ్రమబంధం. నేను మిమ్ము చాలా పూర్వం నుండీ ఎరుగుదును. హిమాలయాలలో కైలాస శిఖర ప్రాంతంలోని ఒక ఆశ్రమ గుహలో మీరు వజ్రేశ్వరీ సాధన చేయడం నేనెరుగుదును. సిద్ధ గురువుల ఆదేశం వల్ల మీరు ఆ శరీరాన్ని విడిచి మళ్ళీ జన్మ ఎత్తారు. పూర్వమిత్రుల సహకారం వల్ల పరమ గురువుల అనుగ్రహం వల్ల మీకు పూర్వస్ఫురణ దివ్య శక్తులు లభించినవి. తెలుగుదేశంలో పుట్టి హిమాలయాలకు వెళ్ళి అక్కడి అనుబందాలను పునర్నిర్మించుకొని తపస్సు చేసి సద్గురువుల కరుణను పొంది వారి ఆదేశంపై మీరు ఈ ధరణీ పీఠంలో త్రికూటాచల క్షేత్రంలో నివసిస్తున్నారని నాకు తెలుసు. చతురగిరి సిద్ధుని సందేశం, మీతో ఉన్న అనుబంధంతో మిమ్ము చూడాలనిపించి ఇక్కడకు వచ్చేలా సంకల్పించాను. దాని ఫలితమే ఈ సమాగమము.
శివచిదానంద : సిద్ధపురుషా ! మీరు కాళీ మంత్ర సిద్ధులని, కాళీమాత సాక్షాత్తుగా విగ్రహ రూపంలో మీకోసం అవతరించిందని విన్నాను. ఆ విగ్రహాన్ని గురించి విశేషాలు వినాలని ఉన్నది. అంతేకాక మీ వయసు కొన్ని వందల సంవత్సరాలని చతురగిరి సిద్ధుని ద్వారా విన్నాను. వాటిని గురించి మీరు చెపితే వినాలని కోరుతున్నాను.
యోగి : స్వామి అచ్యుతానంద దగ్గరకు మీరు వెళ్ళినపుడు ఒక వ్యక్తి వయస్సు ఎంత అనేది ఎలా నిర్ణయించడమో మీరు విన్నారు. శారీరకంగా మీకంటే కొంత పెద్దవాణ్ణి. కానీ పూర్వస్ఫురణ ఉండటం వల్ల వందల ఏండ్లని అనుకోవలసి వస్తుంది. షుమారు 400సంల క్రింద నేను హిమాలయాలలో తపస్సు చేస్తున్నప్పుడు నాయందు కరుణ కలిగి కాళీదేవి విగ్రహ రూపంలో అవతరించింది. అది ప్రాణం గల్గిన విగ్రహం. కృష్ణశిలా మూర్తియై జీవలక్షణాలు మూర్తీభవించిన ఆకృతి. ఆమెను మూడు వందల సంలపాటు ఆనాడు సేవించాను. ఆ తర్వాత శరీరపతనం జరిగి మళ్ళీ ఈ దేహం ధరించాను, అంతకుముందు కొన్నాళ్ళు బృందావనంలో ఉన్నాను.
కృష్ణచైతన్య మహాప్రభువు భక్తుడైన రూపగోస్వామి నాకు చాలా ఆప్తుడు. ఆయన ఆశ్రమంలో కొన్నాళ్ళు కాళిని పూజిస్తూ ఉన్నాను. ఆ రోజులలో అక్కడికి వచ్చే సిద్ధులలో ఒకరు ఆకాశగమనాది శక్తులు కల్గిన కాళీభక్తుడు. తరువాత ఈకాలంలో రామకృష్ణపరమహంసగా జన్మించాడు. రూపగోస్వామి మాత్రము బృందావన ధామములోనే రాధాదేవి సఖీమండలంలో చేరి ఉన్నాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని కొన్నాళ్ళు కాశీవాసియైన దీర్ఘజీవి త్రైలింగస్వామి సేవించాడు. ఆ పిమ్మట పరమ హంసకు తాంత్రిక సాధనలు నేర్పిన భైరవీబ్రాహ్మణి కొన్నాళ్ళు పూజలు జరిపింది. ఆ తర్వాత పరంపరగా శిష్యులు సాధకులు పూజిస్తూ వచ్చారు. అది ప్రస్తుతం ఒరిస్సాలోని భువనేశ్వర ప్రాంతపు అడవులలో రహస్యంగా తీవ్రసాధకులచే పూజలందుకుంటున్నది. అక్కడికి అప్పుడప్పుడు నేను వెళ్తున్నాను.
శివచిదానంద : ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను. ఆ దేవిని చూడాలని నాకు కూడా కోరికగా ఉన్నది. అంతేకాదు కుర్తాళంలోని మా ఆశ్రమానికి కూడా మీరొకసారి రావాలి.
యోగి : ఈరెండూ భవిష్యత్లో జరుగవలసినవే. ఎందుకంటే ఈ శరీరంలో కూడా నేనెక్కువగాలం ఉండబోవడం లేదు. కపాలేశ్వర కాళిదాస్ అనే శిష్యునకు ఆ విగ్రహాన్ని అప్పగించి నేను త్వరలో ఈ దేహాన్ని త్యాగం చేస్తాను. మళ్ళీ జన్మలో నేను పెరిగి పెద్దవాడిని అయ్యేదాకా ఇంచుమించు వందసంవత్సరాల పాటు అతడా విగ్రహాన్ని పూజిస్తుంటాడు. ఆ తరువాత ఆంధ్రదేశంలోని గుంటూరు అనే పట్టణంలో ప్రసాదరాయకులపతి అనే పేరుతో ఉండే నా దగ్గరకు ఆకాశమార్గంలో పంపిస్తాడు. ఆ కాళీదేవి పునరాగమనం తర్వాతనే మనం కలుసుకుంటాము.
🍀🍀🍀
శివచిదానంద : అప్పటిదాకా నేనూ ఈ భౌతిక శరీరంతో ఉండకపోవచ్చు కదా !
యోగి : నిజమే ! ఉండరు. కానీ అభౌతికమైన సిద్ధశరీరంతో మీరలు ప్రకాశిస్తూనే ఉంటారు. హిమాలయాలలో మీరు సాధించిన సిద్ధేశ్వరీదేవి పేరుతో మీరు ఒక పీఠాన్ని స్థాపిస్తారు. మీ తరువాత ముగ్గురు పీఠాధిపతులు పరిపాలించిన పిదప నేను కుర్తాళం వచ్చి మీ పీఠాన్ని స్వీకరిస్తాను. మీరు స్థాపించిన సిద్ధశక్తి కేంద్రాన్ని అభివృద్ధి చేసి సిద్ధమండల గురువులకు సంతృప్తి కలిగిస్తాను.
మీరు అప్పుడు నాతో ఉండి మార్గదర్శనం చేస్తూ గురువుల ఆదేశాన్ని విజయవంతం చేయాలి.
శివచిదానంద : శివేచ్ఛ అలా ఉంటే అలాగే జరుగుతుంది. మీరన్నట్లు భౌతిక శరీరాలు వాటి ఆయువులు మన అనుబంధానికి అడ్డంకావు.
యోగి : సిద్ధేశ్వరియైన కాళి మనలను అనుగ్రహించును గాక!
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments