🌹 సిద్దేశ్వరయానం - 83 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 కాశీలో కథ - రామకవి 🏵
శ్లో ||రత్నసానుశరాసనం రజతాద్రి శృంగనికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం
క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వైయమః
మధురమంజులమైన కంఠంతో ఒక బ్రాహ్మణుడు గంగాస్నానం చేసి ఈ శ్లోకం దీని తరువాతి క్రమంలో నాలుగవ పాదం మకుటంగా ఉన్న శ్లోకాలు పఠిస్తూ నడుస్తున్నాడు. ఆయనకు ముందు శిష్యులతో కలిసి వెళుతున్న ఒక యోగి ఆగి “రామకవీ! మీ గళం చాలా మనోహరంగా ఉంది. గానం మాత్రమే కాక దానిలో భక్తిరసార్ద్రత గోచరిస్తున్నది. ధన్యులు మీరు" అన్నాడు. ఆ భక్తుడు ఆశ్చర్యంతో వేగంగా ముందుకు నడిచి ఆ యోగికి పాదనమస్కారం చేసి "అయ్యా! మీరెవరో మహానుభావులు. ఇంతకు ముందెప్పుడూ మిమ్ము చూడలేదు. నా ముందు నడుస్తూ నన్ను చూడకుండానే పేరుతో పిలిచారు. మీరెవరో తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించండి" అని ప్రార్ధించాడు.
యోగి : మీరు గంగలో మునిగి దురితదూరులై వస్తున్నారు. మీ వసతికి వెళ్ళి అనుష్ఠానం పూర్తి చేసుకొని రండి. కేదారేశ్వర మందిరానికి ప్రక్కన భైరవీ బ్రాహ్మణి గృహం ఉంది. దానికి కొద్ది దూరంలో ఒక క్షత్రియుని భవనం ఉంది. నా భక్తుడైన అతని యింటిలో ఉంటాను. నా శిష్యులు మిగతా వివరాలు చెపుతారు. అక్కడకు విశ్రాంతిగా రండి!
రామకవి ఆయన దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పూజా జప కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆతృతతో యోగీశ్వరుని నివాస భవనానికి వెళ్ళాడు. ఆ యోగిని భక్తులు పరమాత్మస్వామి అని పిలుస్తున్నారు. భక్తులందరూ వెళ్ళిపోయిన తరువాత రామకవిని స్వామివారి దర్శనానికి వెళ్ళి విశ్రాంతిగా మాట్లాడటానికి వీలుగా ఏర్పాట్లు జరిగినవి. పాదనమస్కారాది సంప్రదాయాలు పూర్తి అయిన తర్వాత స్వామి నిర్దేశంమీద వారి యెదురుగా రామకవి కూర్చున్నాడు. సంభాషణ ప్రారంభమైంది.
రామకవి : స్వామివారూ! నన్నెప్పుడూ చూడకుండానే అన్ని విశేషాలు మీరు చెపుతుంటే మహనీయులైన సిద్ధపురుషులని గ్రహించాను. తమరేదైనా పలికితే వినాలని కుతూహలంగా ఉంది.
స్వామి : కాశీనగరాధిపతి విశ్వనాథుడు. కాశీనగర రక్షకుడు కాలభైరవుడు వారి అనుగ్రహం ఉంటే ఏదైనా తెలుసుకోవచ్చు.
రామకవి : ఆ అనుగ్రహం అంత సులభంగా రాదు గదా! నాకు కొంత పురాణ పరిజ్ఞానం ఉన్నది. ఎంతో కఠోర తపస్సు చేసి దేవతానుగ్రహం పొందితే తప్ప ఇటువంటి సిద్ధశక్తులు రావు. మిమ్ము చూస్తుంటే యువకులుగా ఉన్నారు. పూర్వజన్మ మంత్రసిద్ధి ఈ జన్మలో ఎక్కువ సాధన లేకుండా వచ్చిందా? లేక మరేదైనా కారణం ఉన్నదా? నాకు తెలుసుకొనే అర్హత ఉంటే దయచేసి చెప్పండి.
స్వామి : నేను యువకుడనే. కాని వయస్సు వంద సంవత్సరాలకు పైనే. మీకిప్పుడే ముసలితనం ప్రవేశిస్తున్నది. నేను పూర్వజన్మలో ఇంకా ఎక్కువ సిద్ధుడను. కాళీదేవిని గూర్చి తపస్సు చేసి ఆ దేవి కృపవల్ల మూడు వందల సంవత్సరాలు జీవించాను. ఇప్పుడు భైరవుని దయవల్ల ఇలా ఉన్నాను. భైరవుడు మీ యందు చాలా కృప కలిగి ఉన్నాడు. ఆయనే మిమ్ము గురించి తెలిపాడు.
రామకవి : చాలా ఆశ్చర్యంగా ఉంది. శ్రీనాథ మహాకవి కాశీఖండం వల్ల భైరవుని గురించి కొంత తెలుసుకున్నాను. ఇక్కడకు వచ్చిన తరువాత కాలభైరవుని అష్టభైరవులను దర్శించుకొన్నాను. ఆ కాశీపురాధినాధునకు నా యందు అనుగ్రహం కలగటం అనూహ్యం.
స్వామి : కారణాలుంటవి. కొన్నిసార్లు తెలియవు. అప్పుడు అకారణ జాయమాన కరుణాస్వరూపుడని కీర్తిస్తారు. మీలో నరసింహస్వామి కనిపిస్తున్నాడు. ఆ స్వామి భైరవునకు చెప్పి ఉండవచ్చు. దేవతల పరస్పర సంబంధాలు మనం తెలుసుకోలేము.
రామకవి : మీరు తెలుసుకోగలరు కనుకనే ఆ మాట అన్నారు. ఆంధ్రదేశంలో గుంటూరు కవిబ్రహ్మ తిక్కన మహాకవి పుట్టిన చోటు. శ్రీనాధ కవిరాజు తిరిగిన ప్రదేశం. ఆ నగరానికి కొంత దూరంలో కోటప్ప కొండ ఉంది దానికి త్రికూటాచల క్షేత్రమని పేరు. దానికి దగ్గర మా స్వగ్రామం ఏల్చూరు. అక్కడ కొండపై గుహలో నరసింహస్వామి వెలిశాడు. ఆయన మా యిలవేల్పు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Opmerkingen