top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 84 Siddeshwarayanam - 84

Updated: Jun 21, 2024




🌹 సిద్దేశ్వరయానం - 84 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 కాశీలో కథ - రామకవి - 2 🏵


రామ కవి: శ్రీనాధ కవిరాజు తిరిగిన ప్రదేశం. ఆ నగరానికి కొంత దూరంలో కోటప్ప కొండ ఉంది దానికి త్రికూటాచల క్షేత్రమని పేరు. దానికి దగ్గర మా స్వగ్రామం ఏల్చూరు. అక్కడ కొండపై గుహలో నరసింహస్వామి వెలిశాడు. ఆయన మా యిలవేల్పు.


స్వామి : తెలుసు. మీరా స్వామిపై శతకం వ్రాస్తున్నారు గదా! ఆ ప్రహ్లాద వరదుడు మీ యందు బాగా అనుగ్రహం కలిగి ఉన్నాడు. ఒక పద్యం మీ తీర్ధయాత్రలను గూర్చి పలకండి.


రామకవి : మీ ఆజ్ఞ!


సీ. కాశికాధీశుని గాంచి గంగానది గ్రుంకి గయాదుల కోర్కె జూచి శ్రీరంగనగరిని చేరి రంగని గాంచి కాంచికాధీశునగ్గించి యెంచి కుశశాయి గన్గాని కోర్కెదీర ననంత శయను వీక్షించి నార్హతను గాంచి సేతుస్థలిని గ్రుంకి శేషాద్రి నిలయుని కాళహస్తీశుని కాంక్ష గొలిచి


గీ|| యిందరిని నిన్నెకా హృదినెన్నుకొనుచు తిరిగితిని తీర్థ దర్శనాధీన గతిని నిత్యలోక స్థితినొసంగు నీరజాక్ష ! జితదనుజరంహ! యేర్చూరి శ్రీనృసింహ!


స్వామి : మంచి పద్యం చెప్పారు. మరి యేల్చూరులో విశ్వనాధుడు నీలకంఠుని పేర ప్రకాశిస్తున్నాడు గదా! ఆ స్వామికి ఈవిశేషాలను విన్నవించరా?


రామ : తప్పకుండా ! మీ మాటే ప్రేరణ. ఇది కూడా సీసపద్యంలోనే చెపుతాను.


సీ|| గంగానదీజలోత్తుంగ తరంగాళి భంగపెట్టితి పాపపటలములను సరయూనదీ జలస్పర్శనం బొనరించి హరియించితిని ఘోరదురితచయము ఫల్గునీ నది జలాస్వాదనం బొనరించి కలిగించితిని మనః కలుషశుద్ధ సప్తగోదావరీ లములలో దోగి సంతసించితి దోషసమితినడచి కృష్ణానదీ జలక్రీడలు గావించి వెడలించికొంటిని వృజిన తతిని కావేరి నీటిలో గావించి స్నానంబు పారజిమ్మితి సర్వపాతకముల


గీ॥ ప్రథిత పంచాక్షరీమంత్ర పఠనమునకు నైతినర్హుడ మీద యనంద ముక్తి నిత్యనందిత వైకుంఠ ! దైత్యలుంఠ! నిరుపమోత్కంఠ! యేర్చూరి నీలకంఠ!


స్వామి : సీసమాలతో శివుని అలంకరించారు. రమణీయంగా ఉన్నది. అప్పుడప్పుడు వచ్చి కాశీలో ఉన్నంతకాలం మీకవిత వినిపిస్తూ ఉండండి! ఇవాళ ఉదయం గంగాస్నానం చేసివస్తూ “చంద్రశేఖరమాశ్రయే” అని శ్లోకాలు చదివారు గదా! వాటిని తెలుగులో అనువాదం చేయండి! మీ తెలుగు కవిత చాలా సుందరంగా ఉంది.


రామకవి : రేపే వ్రాసి తీసుకు వస్తాను. మీ సమయం ఎక్కువ తీసుకోవటం వల్ల వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందేమోనని సంకోచిస్తున్నాను. కాని మీరు అనుగ్రహిస్తే మీ నుండి వీలైనన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలని కోరికగా ఉంది.


స్వామి : అలానే ! మీ వల్ల తెలుగు కవిత్వమంటే నాకు ఇష్టం ఏర్పడుతున్నది. ఇది యెటు దారి తీస్తుందో ! మంచిది వెళ్ళి రండి!


రామకవి: నమస్కారం సెలవు.


మరుసటి రోజు వచ్చి రామకవి చంద్రశేఖర స్తుతికి తెలుగు అనువాదం వినిపించాడు. (మూలసంస్కృత శ్లోకాలు రామకవిగారి పద్యాలు ప్రత్యేకంగా ఇవ్వబడుతున్నవి). ఇలా కాశీలో ఉన్నన్ని రోజులు అప్పుడప్పుడు వచ్చి స్వామివారి కోరిక మీద తను వ్రాసిన తెలుగు పద్యాలు వినిపించేవాడు. సంస్కృత కాశీఖండాన్ని పోల్చి శ్రీనాథుని తెలుగు రచనను వ్యాఖ్యానిస్తూ కొన్నిరోజులు వరుసగా పురాణ ప్రవచనం చేయవలసిందిగా స్వామి వారిచ్చిన ఆదేశాన్ని శిరసావహించి వారి ఆశ్రమంలో సాయంకాలవేళ ప్రసంగించాడు. సందర్భానుసారంగా తాను చేసిన తీర్థయాత్రా విశేషాలను కూడా కలిపి కమనీయంగా ఉపన్యసిస్తూ మధ్య మధ్య శ్లోకాలను, పద్యాలను వినిపిస్తుంటే తెలుగువారు చాలామంది వచ్చి వినేవారు.


ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత రామకవి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. సాయంకాలం దర్శనానికి వచ్చి స్వామి వారితో తన ప్రయాణాన్ని గురించి విన్నవించుకొన్నాడు. ఆయన వచ్చే సమయంలో స్వామివారు శంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం గొంతెత్తి చదువుతున్నారు. అవి పఠిస్తుంటే స్వామి కంటి వెంట కన్నీరుకారుతున్నది. నెమ్మదిగా ఆపుకొని రామకవి వైపు చూచి ఇలా అన్నారు.


స్వామి : కవిగారూ! మీరీరోజు ఉదయం భైరవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని సెలవు తీసుకొంటూ ఏమి కోరుకున్నారు?


రామకవి : మీతో చెప్పాలంటే భయ సంకోచములు కలుగుతున్నవి. అయినా మీరు దివ్య దృష్టి కలవారు. నేను చెప్పకపోయినా మీకు తెలుస్తుంది.



( సశేషం )


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


bottom of page