🌹 సిద్దేశ్వరయానం - 85 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 కాశీలో కథ - రామకవి - 3 🏵
స్వామి : కవిగారూ! మీరీరోజు ఉదయం భైరవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని సెలవు తీసుకొంటూ ఏమి కోరుకున్నారు?
రామకవి : మీతో చెప్పాలంటే భయ సంకోచములు కలుగుతున్నవి. అయినా మీరు దివ్య దృష్టి కలవారు. నేను చెప్పకపోయినా మీకు తెలుస్తుంది.మీ వంటి మహాత్ములు అరుదు. మీరు మా వంశంలో పుడితే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరిస్తవన్న విశ్వాసంతో ఆశతో ఆ కోరిక కోరి భైరవ స్వామిని ప్రార్ధించాను. విచిత్రంగా నేనిక్కడకు వచ్చిన సమయానికి మీరు భైరవాష్టకం చదువుతున్నారు. నన్ను అనుగ్రహించమని మిమ్ము వేడుకొంటున్నాను.
స్వామి : మీరక్కడ ప్రార్థించినప్పుడే భైరవుని పరివారంలోని శంఖపాలుడనే వీరుడు నాకు తెలియజేసి భైరవస్వామి మీ ప్రార్ధనను అంగీకరించాడని చెప్పినాడు. మీరు కోరినది భైరవేచ్ఛ. హిమాలయ సిద్ధాశ్రమ యోగులు నా జీవిత గమన ప్రణాళికను నిర్ణయిస్తారు. అప్పుడు మీరు కాంక్షించింది జరుగుతుంది. నేనీ శరీరంలో మరికొన్ని దశాబ్దాలుంటాను. తరువాత దక్షిణదేశ సంచారానికి బయలు దేరి యేల్చూరు వచ్చి కొండమీది నరసింహస్వామిని దర్శనం చేసుకొని అక్కడే శరీరాన్ని వదిలి పెడతాను.
అయితే అప్పటికి మీ వంశంలో రెండు తరాలు గడుస్తవి. మీకు ముని మనుమడుగా పుట్టి కవినై గ్రంథరచన చేస్తాను. సిద్ధాశ్రమ యోగుల కృపవల్ల, భైరవుని అనుగ్రహం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. దేశవిదేశాలు తిరిగి ధర్మప్రచారం చేస్తాను. ప్రస్తుతానికి వచ్చిన కర్తవ్య సూచన యిది. ఒక చిన్న కోరిక. నేను నరసింహస్వామిని దర్శించటానికి వచ్చినప్పుడు ఆ దేవతావల్లభుని స్తుతించటానికి మంచి శ్లోకాలు చెప్పండి. నేను చదివిన భైరవాష్టకం ఏ ఛందస్సులో ఉందో ఆ ఛందస్సులో పలకండి!
రామ కవి ఆశువుగా ఆ ఛందస్సు - సుగంథివృత్తంలో నారసింహాష్టకం శ్లోకాలు సంస్కృతంలో పలికాడు.
స్వామి: కవీశ్వరా! సంస్కృతాంధ్రాలలో సమానమైన అసమానమైన ప్రజ్ఞ మీది. చాలా సంతృప్తి కలిగింది. ఈ శ్లోకాలు చెప్పినట్లే శంకరులవారి కరావలంబ స్తోత్ర ఛందస్సులో కూడా పలకండి! మీరు రమణీయంగా తడుముకోకుండా ఇంత అందంగా శ్లోకాలు చెప్పుతుంటే ఇంకా ఇంకా అడగాలని అనుపిస్తున్నది.
రామకవి: నేను ధన్యుణ్ణి. ఇంతకంటే కావలసింది ఏముంది? అంటూ వసంత తిలక వృత్తాలు పలికాడు.
స్వామి: మీరు కవి సింహులు. నరసింహుని అనుగ్రహం మీ యందు పరిపూర్ణంగా ఉంది. విశ్వనాధుడు కరుణించాడు. మీ భక్తికి భైరవుడు సంతోషించాడు. మీరు ఎంతో పుణ్యాత్ములు. ఆయువు పూర్తి అయిన తరువాత దీర్ఘకాలం దివ్యభూమికలో ఉంటారు. మీరక్కడినుండి నన్ను చూద్దురుగాని. ఇదంతా దేవతల ప్రణాళిక, సిద్ధ సంకల్పము. మనం నిమిత్తమాత్రులం. తీర్థయాత్రలు చేస్తూ స్వగ్రామానికి చేరుకోండి! అంతా శుభం జరుగుతుంది.
రామకవి: మీ దయ! సెలవు అని పాద నమస్కారం చేసి చెమ్మగిల్లుతున్న కన్నులతో కదలి వెళ్ళాడు. స్వామి ఆయన వెళ్ళినవైపు చూస్తూ నిమీలిత నేత్రాలతో ధ్యానంలోకి వెళ్ళారు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
コメント