🌹 సిద్దేశ్వరయానం - 86 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 స్వామి విశుద్ధానంద - 1 🏵
శ్లో || ఆరక్త జిహ్వాం వికటోగ్ర దంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కర త్రిశూలం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి.
అని స్తుతిస్తూ పరమాత్మస్వామి కాళీపూజ చేస్తున్నాడు. పూజానంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలిచ్చి సందర్శకుల కోసం ఒక గదిలో కూర్చున్నారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి, మంత్రోపదేశం తీసుకోటానికి వివిధ కారణాలతో జనం వస్తున్నారు. ఇంతలో ఒక శిష్యుడు వచ్చి "గురువుగారూ! ఈ కాశిలో ప్రసిద్ధులైన యోగి విశుద్ధానందులవారు వచ్చారు" అని మనవి చేశాడు.
స్వామివారి అనుమతితో ఆయనవచ్చి నమస్కరించారు. అతిథి మర్యాదల తరువాత వారి కోరికతో కొంతసేవు ఏకాంత సమావేశం ఏర్పాటు చేయబడింది.
విశుద్ధానంద: స్వామివారూ! మీరు కాళీదేవతానుగ్రహం వల్ల ఎన్నో అద్భుత శక్తులు సాధించారని త్రైలింగస్వామి వంటి దీర్ఘకాలజీవి కూడా మీరంటే ఎంతో గౌరవం చూపిస్తారని విన్నాను. నేను సామాన్యంగా ఎవరినీ చూడటానికి వెళ్ళను. కానీ ఎందుకో మిమ్ము దర్శించాలని అనిపించి వచ్చాను.
పరమాత్మ: ఆ అనిపించటానికి కారణం చెపుతాను. కవికుల గురువైన కాళిదాసు ఇలా పలికాడు.
శ్లో || రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకోభవతి యత్సుఖితో2పిజంతుః
తచ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని.
అందమైన దృశ్యాలు చూచి, మధురమైన శబ్దాలు విని సుఖానుభూతిలో ఉన్నవాడు ఒక్కసారి ఊహించని యేదో మానసిక సంచలనానికి లోనవుతాడు. అంతరాంతరాలలో పూర్వజన్మకు సంబంధించిన అనుభవాలు స్మృతికి రావడమే కారణం.
విశుద్ధానంద: అదియేదో తెలుసుకోవాలని కుతూహలం కలుగు తున్నది.
పరమాత్మ: సహజమే. కాళిదాస మహాకవి చెప్పిన జననాంతర సౌహృదం మనమధ్య ఉన్నది. నూటయాభై సంవత్సరాల క్రింద మనం ముగ్గురం మిత్రులము హిమాలయాలలో కలిసి తపస్సు చేసాము. మూడవ మిత్రుడు తేజోమయమైన సిద్ధశరీరాన్ని సాధించి సిద్ధాశ్రమంలో ఉన్నాడు. మీరు కూడా మహాతపయోగి అనుగ్రహం వల్ల ఖండ యోగాది విద్యలు కొన్ని సాధించారు. ఏవాసననైనా సృష్టించగల గంధవాహ విద్య సిద్ధించింది. అన్నిటికంటే మహనీయమైన మృతసంజీవనీ శక్తి - మరణించిన వారిని బ్రతికించేవిద్య లభించింది. అయితే మీకు క్రియాశక్తి వికసించినంతగా జ్ఞానశక్తి వికసించలేదు.
విశుద్ధానంద: స్వామీ! యెవరికీ తెలియని నా రహస్యాలను మీరు చూస్తూనే చెప్పారు. ఇంతటి సిద్ధులను నేను ఇంతవరకు చూడలేదు.
పరమాత్మ: నీ మిత్రులలోనూ అసామాన్యులున్నారు. స్వామి నిఖిలేశ్వరానంద, స్వామి శివచిదానందవంటివారు. వారిలో శివచిదానంద నాకు ఎక్కువ ఆప్తుడు. నాలుగు వేలయేండ్ల నుండి ఆప్తుడు. తపస్సు చేసి గురుకృపవల్ల మీరు సాధించినవి సామాన్యమైనవి కావు. దేవకార్య నిర్వహణకు సిద్ధగురువులచే ఎంపిక చేయబడినవారం మనమంతా. కాలప్రభావం వల్ల కలి ప్రభావంవల్ల శిథిలమై శీర్ణమై పీడితమవుతున్న హిందూ సమాజంలో చైతన్యాన్ని కలిగించటానికి మనవంతు కర్తవ్యం మనం చేయాలి. అందుకే మహా గురువులు మనకు కొన్ని శక్తులనిచ్చారు.
శ్లో || దుర్భర దురూహ పీడనాందూనిబద్ధ శిథిల హిందూ సమాజ సంస్కృతి సమగ్ర శక్తి సంధాన నవవికాస ప్రదాన ధర్మదీక్షైక కంకణ ధారి నేను.
మీరు కూడా ఆ మార్గంలో దీక్షా కంకణం ధరించి ముందుకు సాగండి.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments