top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 87 Siddeshwarayanam - 87


🌹 సిద్దేశ్వరయానం - 87 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐



🏵 స్వామి విశుద్ధానంద - 2 🏵



విశుద్ధానంద: ఈ నాడు ప్రపంచాన్ని ముంచి వేస్తున్న పాశ్చాత్య నాగరికతా మహాప్రవాహంలో అందరూ కొట్టుకు పోతున్నారు. మన సంస్కృతి చులకనై పోయింది. దీనిని ఆపగల శక్తి మనకుందా?


పరమాత్మ: నిజమే. కాని చీకటిని తిడుతూ అకర్మణ్యంగా కూచోటము కంటే చిరుదీపం వెలిగించవచ్చు. పరమ గురువుల కృప ఉంటే ఏదైనా సాధించవచ్చు.


విశుద్ధానంద: మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. అయితే మహాప్రభంజనంలో అల్లల్లాడే చెట్ల ఆకులవంటి వాళ్ళమేమో! అని ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతున్నది.


పరమాత్మ: లేదు. లేదు. గురుకృప ఉన్న వాళ్ళం మనం. అధైర్య పడరాదు. దానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. మీరిద్దరు మిత్రులు వైరాగ్యం కలిగి సన్యాసం తీసుకొన్నారు. సిద్ధ గురువుల సేవచేసి కొన్ని శక్తులు లభించిన తర్వాత మీ గురువుగారు సన్యాసం విసర్జించి సంసారం స్వీకరించి లోకంలోకి వెళ్ళి ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక ప్రబోధం చేయమని ఆదేశించారు. గురువుగారి ఆజ్ఞను తలదాల్చి సంప్రదాయ విరుద్ధమైనా మీరు ప్రపంచంలోకి వచ్చారు. మీకు మరిన్ని సిద్ధ శక్తులు ప్రాప్తించినవి. గురు వాక్యం కంటే ఆచార వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మీ మిత్రుడు గురుశాపంవల్ల ఉన్న శక్తులు పోగొట్టుకొని అధోగతిపాలైనాడు. కనుక మహాగురువులను నమ్ముకొని ముందుకు వెళుదాము.


విశుద్ధానంద: స్వామీ! దివ్యచక్షువు వికసించిన మహనీయులు మీరు. నా భవిష్యత్తును గూర్చి చెప్పవలసినదిగా అభ్యర్థిస్తున్నాను. నాకు కర్తవ్య ప్రబోధం చేయండి!


పరమాత్మ: ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా తపస్సు ప్రధానం.


యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసాప్రాప్యం తపోహి దురతిక్రమం


మానవ ప్రయత్నం వలన దేనిని పొందలేమో దానిని తపస్సు వల్ల సాధించవచ్చు. అయితే తపస్సు చేయటం చాలా కష్టం. కానీ ఆ మార్గంలో పురోగమిస్తున్నవారు మీరు. తీవ్రంగా తపస్సు చేయండి. దానివల్ల పుట్టే అగ్నిని మీరు తట్టుకోలేని స్థితి వస్తుంది. శరీరం మంటలు పుడుతుంది. దానిని నివారించుకొని ముందుకు వెళ్ళే ప్రక్రియ చెపుతాను. నేను అనాదిగా నాగజాతి వాడిని. ఆ నాగ విద్యలు నాకు ప్రతిజన్మలోను సంక్రమిస్తుంటవి. ఒక విద్య మీకు తెలియజేస్తున్నాను. దానివల్ల సర్పములు మీకు వశమవుతవి. ఉత్తమ జాతి సర్పములను మీ దగ్గర ఉంచుకోండి. అవి మీ శరీరానికి చుట్టుకొని మీకు చల్ల దనాన్ని ఇస్తుంటవి. వాటి భయం వల్ల మీ అనుమతి లేకుండా మీ గదిలోకెవరూ రారు. మీ మహిమలను చూచి, విని ఆకర్షించబడి ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయ జాతీయులు మీ దగ్గరకు వస్తారు. వారిలో కొందరివల్ల మీకు కీర్తి పెరుగుతుంది. కొన్నాళ్ళకు కాలవశాన ఈ శరీరం పతనమవుతుంది. అయినా మీరు తపస్సు చేసిన నవముండీ ఆసనం ప్రఖ్యాతమవుతుంది.



విశుద్ధా: స్వామీ! ఆ తరువాత?


పరమాత్మ: త్వరలోనే మరొక జన్మవస్తుంది. నీయందు అభిమానం కల మిత్రుడు స్వామి నిఖిలేశ్వరానంద నిన్ను గుర్తించి కొన్ని దివ్యశక్తుల ననుగ్రహిస్తాడు. వాటివల్ల పేరుప్రతిష్ఠలు లభిస్తవి. ఇవన్నీ వచ్చే శతాబ్దం చివర.



విశుద్ధానంద: స్వామీ ! మళ్ళీ మనం కలుస్తామా?


పరమాత్మస్వామి : నీకు నిఖిలేశ్వరానందతో, శివచిదానందతో ఉన్నంత అనుబంధం నాతో లేదు. నాకు శివచిదానందకు ప్రగాఢమైన ఆత్మీయత. ఆయనకోసం నేను దక్షిణ దేశంలోని కుర్తాళ పీఠానికి వెళ్ళవలసి వస్తుంది. ఆ మజిలీలో మనం మళ్ళీ తప్పక కలుస్తాము. దైవ నిర్దేశం ప్రకారము వాటి సంకల్ప వికల్పాలుండ గలవు. ఇప్పటికిది.


విశుద్ధానంద: ఇటీవలి కాలంలో నాకు అత్యంత సంతృప్తికరమైన కలయికయిది. సెలవు.


పరమాత్మ స్వామి: శుభమస్తు!


( సశేషం )


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page