🌹 సిద్దేశ్వరయానం - 89 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 19 వ శతాబ్దం-ఆంధ్రదేశానికి ప్రయాణం - 2 🏵
పరమాత్మ స్వామి కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిపై విరాజిల్లుతున్న దుర్గా మల్లేశ్వరులను దర్శనం చేసుకొని అర్జునుడు తపస్సుచేసిన స్థలాన్ని చూచాడు. ఆ ప్రదేశంలో ఒక శిలాశాసనం కనిపించింది. సుమారు నాలుగైదు వందల సంవత్సరాల క్రింద ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఆటవిక రాజు త్రికూటబోయని కుమారుడు కలియమబోయడు వేయించిన శాసనమది. అతడీ కొండమీద తపస్సు చేయగా పూర్వజన్మ స్మృతి వచ్చిందట! ద్వాపరయుద్ధం చివర ఈ పర్వతంమీద పాండవులలోని అర్జునుడు తపస్సు చేసినపుడు ఇతడు యక్షుడట. ఆ పార్థునకితడు సేవచేశాడట! ఆ వివరాలు అర్జునుని నామాలు ఆ శిలాఫలకం మీద వ్రాయబడియున్నవి. ఈ కొండమీది శివుడు మల్లేశ్వరుడు. మల్లుడై అర్జునునితో పోరాడినవాడు. శ్రీశైలంలో శివుడు మల్లెపూలతో పూజింప బడినాడు గనుక మల్లీశ్వరుడు.
స్వామివారు దుర్గకొండ నుండి బయలుదేరి మంగళగిరి నరసింహ స్వామికి అర్చన చేశాడు. ఆ దేవుడు పానకాలరాయుడు. ఆ విగ్రహం నోటిలో బెల్లపుపానకం పోస్తుంటే గుటక వేయటం స్పష్టంగా వినిపిస్తుంది. ఎత్తైన ఆ గుడి గోపురం గురించి కూడా చిత్రమైన కథలున్నవి. ఆ పర్వత గ్రామంనుండి కోటప్పకొండ చేరుకొని ఆ త్రికూటాచలేశ్వరునకు అభిషేకం చేసి కొండదిగి సమీపంలో ఉన్న ఏల్చూరు గ్రామ పొలిమేరకు చేరారు. ఊరిలోకి వెళ్ళకుండా కొండమీదగుహలో ఉన్న నరసింహస్వామిని దర్శించి భక్తితో అర్చన చేసి ప్రార్థించాడు.
స్వామీ! భైరవాజ్ఞ వల్ల నేనీ కొండ క్రింది గ్రామంలో ఆరువేల నియోగి బ్రాహ్మణులైన పోతరాజువారి వంశంలో పుట్టబోతున్నాను. ఇలవేలుపై నన్ను రక్షించు.
శ్లో || సంసార సాగర కరాళ కాల నక్రగ్రహగ్రసన నిగ్రహవిగ్రహస్య వ్యగ్రస్య రాగలసదూర్మిని పీడితస్య లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం. - శంకరాచార్య.
స్వామీ! ఈ సంసార సముద్రంలో కామక్రోధాది మకరములు నన్ను మింగకుండా అనుబంధాల అలల తాకిడికి తట్టుకోలేక కూలిపోకుండా నాకు చేయూత ఇచ్చి కాపాడు. నీ దాసుడను.
కొండదిగి బండ్లబాటవైపు వెళ్ళి పరివారాన్నందరినీ వెళ్ళిపొమ్మన్నాడు. వారిలో ముఖ్యులైన ఇద్దరు దంపతులు స్వామివారికి ఆహారాది సేవలన్నీ చేస్తూ అన్ని వ్యవహారాలు చూచుకుంటూ చిరకాలంగా అంటిపెట్టుకొని ఉన్నవారు. వారిలో మధ్య వయస్కుడైన పురుషుడు ఇలా విజ్ఞప్తి చేశాడు. "స్వామివారూ! కాశీలో జరిగిన విషయాలు మీరు తెలియజేశారు. ఇంతకాలం మీ వెంటఉండి సేవ చేసుకొన్నాము. ఇప్పుడు దిక్కులేని వారమై పోతున్నాము.
చాలా దిగులుగా ఉంది. మరొక విషయమై భయంగా ఉంది. మనం ఆంధ్రదేశంలో ప్రవేశించిన తరువాత ఒక పెద్ద ముస్లిం జమీందారున్న పట్టణానికి వెళ్ళాము. ఏ వైద్యుడు, ఏ మాంత్రికుడు కుదర్చలేని అతని వ్యాధిని మీరు కుదిర్చారు. ఆ ప్రభువు మిమ్ము ఎంతో భక్తితో పూజించి సత్కరించుకొన్నాడు. మీరు అతనికోసం హోమాలు చేస్తున్నప్పుడు మీ అజ్ఞవల్ల నేను కూడా అందులో పాల్గొన్నాను. అక్కడి ఆస్థాన మాంత్రికుడు జమిందారు దృష్టిలో అసమర్ధుడై పోయినాడు. అతని పరపతి పోయింది. దానితో మీ మీద ప్రయోగాలు చేశాడని మిమ్మేమీ చేయలేక క్రోధం పెంచుకొన్నాడని చెప్పారు. నా మీద కూడ వాడికి ద్వేషం ఉన్న సంగతి మీకు తెలుసు. మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నన్నేమైనా చేస్తాడని అనుమానం. మీరు ఎక్కడ ఉన్నా రక్షించాలి". స్వామివారు అతనిని చూచి ఇలా అన్నారు.
"నీవు చెప్పింది సత్యమే. కాని వాడు క్రిందటి నెలలో మరణించి ప్రేతమై తిరుగుతున్నాడు. తీవ్రక్రోధ ద్వేషాల వల్ల వానికి కొన్ని చిన్న శక్తులుంటవి. నీవు ప్రస్తుతం ఇక్కడి పనులు పూర్తి చేసి శ్రీశైలం వెళ్ళు. శేషజీవితం అక్కడ గడుపు. నీవు చేసిన గురుసేవవల్ల శివభక్తి వల్ల ఆరాధ్యులకుటుంబంలో పుట్టి ప్రభుత్వంలో ఉన్నతాధికారివి అవుతావు. వాడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. వచ్చే జన్మలో మళ్ళీనాకు సన్నిహితుడవవుతావు. నీకు వచ్చేప్రమాదాలనుండి నేను రక్షిస్తాను. భయపడ వద్దు" స్వామివారికి ఈ మజిలీ పూర్తి అయింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Kommentare