top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 9 Siddeshwarayanam - 9



🌹 సిద్దేశ్వరయానం - 9 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🌹సిద్దేశ్వరయానం 🌹


Part-9


🏵 బృందావన సంఘటన 🏵


బర్సానా రాజమందిరంలో పెనుమార్పులు వచ్చినవి. అందరు దుః ఖాక్రాంతులై ఉన్నారు. ఆ విషయాలు వివరించి తన భవిష్యత్తు నిర్ణయించు కోటానికి ఇందులేఖ అంతఃపురానికి సుదూరంగా ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి చేరుకొంది. ఎటు చూచినా ఎవరూ లేరు. తన స్వామి ఎక్కడ? ఎంత సేపటిలో వస్తాడు? అనుకుంటూ ఉండగానే ఆకాశం నుండి చుక్కరాలి


పడినట్లుగా సిద్ధనాగుడు వచ్చి "ఇందూ! నేను వచ్చాను" అన్నాడు. ఇందు లేఖ తలయెత్తి చూచి అతని పాదాల పై వ్రాలిపోయింది. అతడు జాగ్రత్తగా ఆమెను పొదివి పట్టుకొని ఒక పొదిరింటి దగ్గర కూర్చో బెట్టి తాను ప్రక్కననే కూర్చున్నాడు.


సిద్ధ : ఇందూ! జరిగిన సంఘటనలు నెమ్మదిగా చెప్పు!


ఇందు :


ప్రాణేశ్వరా ! తలచుకొంటే భయం పుడుతున్నది. మీ యంత్రశక్తి వల్ల వచ్చిన కలలలో ఊహించని అవతార రహస్యాలు తెలిసినవి. రాధాకృష్ణులెవరో తెలుసుకోగలిగాను. గోలోకనాయిక బయటకు వెళ్ళిన తరువాత రాజకుమారి గురించి అర్థమయింది. బలరామ కృష్ణులు మధురకు వెళ్ళారు. కృష్ణదేవులు కంసమహారాజును సంహరించారు. ప్రభుత్వం మారిపోయింది. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల కుమారుడని ప్రకటితమైంది. వారు తిరిగి బృందావనం వచ్చే ప్రశ్నలేదట! రాధాదేవి వివాహం మీరు చెప్పినట్లు ఆగిపోయింది. రాజకుమారి జీవితంలో ఇంకొకరిని పెండ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేసింది. హిమాలయాల లోని సిద్ధాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకొంటానని జీవితశేషం అక్కడే ఉంటా నని నిర్ణయించుకొన్నది. కీర్తి, వృషభానుమహారాజు దంపతులు ఎంతో బ్రతిమలాడారు. కానీ ఆమె దృఢ నిశ్చయాన్ని చూచిన తరువాత ఏమి తోచక దుఃఖిస్తున్నారు. కులపురోహితుడు గర్గాచార్యులు వారిని ఏకాంతముగా కూర్చోబెట్టి ఏవో దేవరహస్యాలు చెప్పారట! ఎట్టకేలకు వారు సమాధానపడ్డారు. ఇంతకూ ఆ సిద్ధాశ్రమమెక్కడ? దాని ప్రత్యేకత ఏమిటి?


సిద్ధ :


హిమాలయాలలో కైలాస పర్వత ప్రాంతంలో మానస సరోవరానికి సమీపంలో ఉన్నది. అది ఒక నిర్దిష్ట పరిమిత ప్రదేశము కాదు. ఆ ప్రాంతమంతా ఋష్యాశ్రమాలున్నవి. వాటిలో వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలలో ఉండే మహాపురుషులుంటారు. త్రేతా యుగంలో విశ్వామిత్రుడక్కడే తపస్సు చేసి బ్రహ్మర్షియైనాడు. తన తపస్థలాన్ని రామక్ష్మణులకు చూపించినట్లు రామాయణములో ఉంది. దమయంతీదేవి నలవియోగంతో ఆత్మహత్య చేసుకోబోతుంటే సిద్ధాశ్రమ ఋషులు ప్రత్యక్షమై ఆ ప్రయత్నాన్ని ఆపి త్వరలో


భర్తను కలుసుకుంటావని అభయమిచ్చారు. ఆ ప్రదేశాన్ని గురించి ఎంతైనా చెప్పవచ్చు. సరి! తరువాత ఏమి నిర్ణయాలు జరిగినవి. "


ఇందు :


రాజకుమారి ఎంత కాలం తపస్సు చేస్తుందో ఎవరికి తెలియదు. కాని ఆమెతపస్సు ఏ ఇబ్బంది లేకుండా సాగటానికి మహారాజు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఆమెతో పాటు రాజభటులు సఖీగణము కొందరు వెళ్ళాలి. భటులు దూరంగా ఉంటారు. ఉదయ, మధ్యాహ్నం సాయం సమయాలలో ఆమెధ్యానంలో నించి బయటకు వచ్చినప్పుడు స్నాన, భోజనాది ఏర్పాట్లను సభీగణం చూస్తుంది. పార్వతీదేవి పరమశివుని కోసం తపస్సు చేసిన విధానము పురాణములలో నుండి పెద్దలు వివరించారు. ఆ పద్ధతిలోనే రాధాదేవికి సేవా కార్యక్రమాలు నిర్ణయించబడినవి.


పరివారం అక్కడ కొన్ని నెలలుంటారు. బర్సానా నుండి వంతుల వారీగా సిద్ధాశ్రమానికి చేరిన తర్వాత పాతవారు బర్సానా వస్తారు. ఇలా ఇండ్లకు వచ్చి కొన్నాళ్ళుండి మళ్ళీ వెళ్ళటం. లలిత, విశాఖ, చంపక, నేను మొదలైన అష్టసఖులు, ఇతర మంజరీగణము ఇలా చేయాలని రాజ నిర్ణయం. రాజకుటుంబం మీద వంశానుగతంగా వస్తున్న భక్తివల్ల ప్రేమస్వరూపిణియైన రాజకుమారితో ఉన్న అనుబంధం వల్ల అందరూ అంగీకరించారు. నేను మీ దగ్గరకు వచ్చాను.


( సశేషం )


🌹🌹🌹🌹🌹




Comments


bottom of page