🌹 సిద్దేశ్వరయానం - 90 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 గుహలో స్వామి - 19వ శతాబ్దం 🏵
మా స్వగ్రామం ప్రకాశం జిల్లా ఏల్చూరు. నరసరావుపేటకు 20 కి.మీ. దూరం. మూడు కొండల కింద మావూరు. చుట్టూ దగ్గరి గ్రామాల కొండలు కనిపిస్తుంటవి. వాటిమీద పులులు తిరుగుతుంటవి. ఒకసారి పులిని పట్టుకొని బోనులో పెట్టి ఊరంతా తిప్పారు. అయినా పిల్లలు కొండ ఎక్కుతూనే ఉండేవారు. మా ఊళ్ళో చుట్టూ తోటలు. వాటిలో నెమళ్ళు చాలా ఉండేవి.ఒక పర్యాయం ఆ ప్రాంతంలో పరిపాలకుడైన తెల్లదొర తుపాకీతో నెమళ్ళను వేటాడటానికి వచ్చాడు. అతడి తుపాకీ చప్పుళ్ళకు ఊరు ఉలిక్కిపడింది. చాలామంది అక్కడికి వెళ్ళారు.
నెమళ్ళను చంపవద్దని అభ్యర్థించారు. కాని అహంకార పూరితుడైన ఆంగ్లేయుడు వీళ్ళమాట పెడచెవిని పెట్టాడు. నెమళ్ళ మీదికి తుపాకి గురిపెట్టాడు. అప్పుడు మా తాతగారు లక్ష్మీనరసింహకవి పైఉత్తరీయం నడుముకు కట్టుకొని అతని ఎదురుగా వెళ్ళి అడ్డంగా నిల్చొని ముందునన్ను కాల్చి తరువాత నెమళ్ళను కాల్చు అన్నాడు. ఈ దృశ్యాన్ని ఊహించని తెల్లదొర ఒక క్షణం బిత్తరపోయినాడు. తుపాకీ దించి మారుమాటాడకుండా వెనక్కు వెళ్ళిపోయినాడు.
తన పేరుగల యువకుడీ సాహసం చేయటం కొండమీది గుహలో ఉన్న నరసింహస్వామి చూస్తూనే ఉన్నాడు.అవధానిభూషణ, వినయప్రధానభాషణ అని వారి గ్రంథాల గద్యలో ఉండేది. చాలామృదుభాషి, చిన్నవయస్సులో మారుటూరి పాండురంగారావు అనే మిత్రునితో కలిసి కరుణా సింధువు అనే గ్రంథం రచించినప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యం మరచిపోలేనిది.
ఉ॥ నేనవధానముల్ సలిపి నిల్పితి తండ్రియశంబు నీవునట్లే నవ కావ్య మొండు రచియించి భవత్పితపేరు నిల్పి వి ద్యానిథి పోతరాట్కులమటన్న సమాఖ్యకు భంగమింతయున్ రాని గతిన్ మెలంగితివి నాయన! నీకు చిరాయువయ్యెడున్
ప్రసిద్ధ పండితులు గురుభాగవతాది బహు గ్రంథకర్త బ్రహ్మశ్రీ మిన్నికంటి గురునాధశర్మగారు మా తాతగారిని గురించి చెపుతూ ఆయన మీద ఎంతో గౌరవంతో పలికిన పద్యమిది.
చం॥ ఎరుగవుగాక నీ బలము నీవు సమీరకుమారు వైఖరిన్ తిరుపతి వేంకటేశ్వరుల దీకొని సత్సభ విన్నకొండ నీ పరపిన పద్యవర్షమున బమ్మెరవోరె? అధీశుడౌ కలె క్టరు పనిబూని అడ్డుపడడా! పరపూర్వుడు బ్రహ్మశాస్త్రియున్
వినుకొండలో తిరుపతి వెంకట కవులతో వివాదం వచ్చి పద్యవర్షం కురిపిస్తుంటే సభాధ్యక్షుడుగా ఉన్న సబ్కలెక్టరు పరబ్రహ్మశాస్త్రి జంటకవుల ఇబ్బంది చూచి ఆపించాడు. ఆ దృశ్యాన్ని గుర్తుచేశారు గురునాధశర్మ గారు.
ఇంతకు ఆ కొండమీది నరసింహస్వామి అనుగ్రహం ఉండబట్టే మా తాతగారి సాహిత్య జీవితం నిరాటంకంగా కొనసాగింది. ఆ మహా శైలగుహావాసియైన నరసింహస్వామిని చూడటానికి చిన్నతనంలో పరుగెత్తు కుంటూ మెట్లెక్కి వెళ్ళేవాళ్ళము. ఆ స్వామి ఆకృతిని ఆ గుహను మనస్సులో నిక్షిప్తం చేసుకొని తరువాతి కాలంలో ఒక పద్యం వ్రాశాను.
సీ॥ దారుణారుణ సముద్భటసటాపాళికి కమ్మ సంపెగతావి కలయ చూసి పటుశిలా కఠినమౌ వక్షస్థలంబున సురభి చందనము కస్తూరి నలది క్రకచ భీషణ దంష్ట్రికలనుండి చల్లని చిరునవ్వు వెన్నెలల్ చిలకరించి కహకహారవ ఘోరగర్జనల్ విడనాడి గళమున గాంధర్వగానమూని
గీ॥ శ్రీమహాలక్ష్మి చేతము చిగురులొత్త! భవ్యశృంగారమూర్తి వై వచ్చినావొ జ్వాలికామాలికా యోగశక్తిరంహ! గిళిత భక్తాంహ! యేర్చూరి గిరినృసింహ!
ఆ కొండగుహలోన నా గుండెగుహలోన కొలువు దీరిన నారసింహా! కులదైవమని పిల్చి యిలవేలుపని కొల్చి నిన్నె నమ్మితి శక్తి రంహా!
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments