🌹 సిద్దేశ్వరయానం - 94 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 మంత్రసాధనలు 🏵
“దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం' ఈ ప్రపంచమంతా దైవమునకు ఆధీనం. ఆ దైవం మంత్రమునకు అధీనం. కనుక దేనిని సాధించాలన్నా దేవతల అనుగ్రహం కావాలి. దానిని పొందాలంటే మంత్రసాధన చేయాలి. ఆ మార్గం మీదకు మనస్సు పూర్తిగా తిరగడం మొదలయింది. మంత్రవేత్తలు సిద్ధయోగులు ఎక్కడయినా దొరుకుతారా ? అన్న అన్వేషణ ప్రారంభమయింది. ఒక మిత్రుని ద్వారా కర్నూలుజిల్లా రామాపురం అన్న గ్రామంలో పసుమాముల సుబ్బరాయశాస్త్రి గారనే మహోపాసకులున్నారని అక్కడకు వెళ్ళాను. ఆయనతో అనుబంధం పెరిగింది. ఏడుకోట్లకు పైగా దత్తాత్రేయ మంత్రాన్ని చేసి దశాంశ హోమములు పట్టుదలతో చేసి దత్తానుగ్రహం పొందిన మహనీయుడు ఆయన.
ఆయన నుండి దత్తాత్రేయ, కార్త వీర్యార్జున నాగాస్త్రాది మంత్రాలను ఉపదేశం పొందాను. ఆ ప్రాంతంలో ఎవరికి పాము కరచినా వానిని మంచం మీద వేసుకొని సుబ్బరాయుడు గారి దగ్గరకు వెడుతున్నామని మొక్కుకొని ప్రజలు వారి గ్రామం నుంచి రామాపురం వచ్చేవారు. ఆయన మంత్రం వేసి పాముకరచిన వారిని బ్రతికించే వారు. ఆ ప్రభావాన్ని గమనించిన తరువాత ఆ విద్యయందు ప్రత్యేకమయిన ఆసక్తికల్గి అహోరాత్రాలు కూర్చుని ఆ మంత్ర సాధన తీవ్రంగా చేశాను. గురుకృపవల్ల మంత్రదేవతాదర్శనం లభించింది. ఏ వ్యాధి నయినా నివారించడానికి ఆ మంత్రం అద్భుతంగా పనిచేసేది. కాలక్రమాన ఇటీవల నాగజాతితో, నాగదేవతతో వేలసంవత్సరాలను నుండి ఉన్న అనుబంధాలు తెలియ వచ్చినవి. పూర్వానుబంధ ఫలితమే ఈ నాగాస్త్రాన్ని పొందగల్గడం అన్న సంగతి అవగతమయింది. ఆ యోగివర్యుని స్తుతిస్తూ ఒక పద్యం చెప్పి నా కృతజ్ఞతను ఇలా నివేదించుకొన్నాను.
సీ॥ మహితదత్తాత్రేయ మంత్రరాజంబును ఏడుకోటులు జపియించినాడు శివ సహస్ర ఘటాభిషేక శోషితవారి పృధుసృష్టి మరల రప్పించినాడు మార్గ నిర్గత మదోన్మదచోరనిచయంబు స్థిరశక్తి స్తంభింపజేసినాడు వ్యాజ్యాన నొకసారి సాక్ష్యంబు చెప్పుచో న్యాయాధిపతి బుద్ధినాపినాడు.
గీ॥ పాము కరచిన యెవడైన స్వామి కడకు పోవుచున్నాననన్ దిగిపోవు విషము అంతటి మహత్వమందిన యజ్ఞమూర్తి రమ్యవాక్ శస్త్రి శ్రీసుబ్బారాయశాస్త్రి
( సశేషం )
🌹🌹🌹🌹🌹
تعليقات