🌹 సిద్దేశ్వరయానం - 96 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 జిల్లెళ్ళమూడి అమ్మ 🏵
నేను ఎంతో గౌరవంతో చూచే కృష్ణ భిక్షువు బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడి అనే గ్రామం వెళ్ళి వచ్చి అక్కడ అనసూయాదేవి అనే ఒక గొప్ప యోగిని ఉందని చెప్పారు. ఆ తరువాత కొద్దిరోజులకు నేను, కృష్ణభిక్షు, మరికొందరు కలసి ఆ గ్రామం వెళ్ళి ఆమె దర్శనం చేసుకొన్నాము. ఆమె చూపిన వాత్సల్యానికి అందరమూ వశులమై పోయినాము. కృష్ణభిక్షు కొంతకాలం అక్కడే ఉండిపోయినాడు కూడా. నాకూ ఆ మాతృమూర్తితో అనుబంధం పెరిగింది. ఆమెను గూర్చి అంబికాసాహస్రి అనే వెయ్యి పద్యాల కావ్యాన్ని రచించాను. మా బృందంలోని కవులు చాలామంది ఆమెను స్తుతిస్తూ రచనలు చేశారు.
అవతారమూర్తిగా ప్రసిద్ధిచెందిన ఆమె భౌతికశరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఇటీవల నేనొక సిధ్ధమంత్ర ప్రయోగం చేశాను. ఆమె పరమపదించిన రోజు వచ్చినపుడు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆత్మాకర్షణ విద్య ద్వారా ఆమెను ఆహ్వానించాను. ఆమె వచ్చి నిల్చొన్నది. తపస్సాధనకు సంబంధించి నేనడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానములు చెపుతున్నది. ఇంతలో ఒక అనూహ్యమైన సంఘటన సంభవించింది. మా ఇంటి మేడమీద మా చెల్లెలి కుటుంబం ఉంటున్నది. ఆమె మనమరాలు సంవత్సరం బిడ్డ. ఆ బాలిక మేడమెట్ల మీద నుండి దిగి క్రిందకి వచ్చి నా ధ్యానమందిరంలోకి ప్రవేశించి అమ్మకు నమస్కరించింది. నిద్రపోతున్న సంవత్సరం పిల్ల భౌతికంగా క్రిందకి దిగిరావడం సాధ్యం కాదు. ఆ అమ్మాయి సూక్ష్మశరీరం అక్కడకు వచ్చింది.
"నువ్వెందుకు వచ్చావు" ? అని నే నడిగాను. ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. "నేను పూర్వజన్మలో (జిల్లెళ్ళమూడి) అమ్మ భక్తురాలను. ఆయువుతీరి మరణించాను. మళ్ళీ అమ్మ భక్తుల కుటుంబంలో పుట్టే అవకాశం కల్గింది. అమ్మ ఇక్కడకు రావడం నాకు తెలిసింది. దర్శనం చేసుకొని నమస్కరిద్దామని వచ్చాను" అన్నది. ఈ తెలిసింది ఎవరికి ? చిన్నపిల్ల శరీరంలోని మనస్సు వైద్యశాస్త్ర రీత్యా అపరిణతమయినది. ఆలోచించే శక్తి ఇంకా రాలేదు. అప్పుడే రాదు. కనుక సూక్ష్మశరీరాశ్రితమైన మనస్సు వేరే ఇంకొకటి ఉన్నది. ఆ మనస్సుకు తాను ఎక్కడ నుండి వచ్చినది తెలుసు. తన పూర్వజన్మ తెలుసు. దేవతామూర్తిగా అనసూయాదేవి దిగిరావటం తెలుసు. అంటే ఈ మనస్సు భౌతిక శరీరాశ్రితమైన మనస్సు కంటే శక్తి కలది. మళ్ళీ అది ఎవరిదో కాదు. ఈ జీవిదే. ఈ విధంగా ఆనాటి సంఘటన ఒక విచిత్రమైన అనుభవాన్ని మిగిల్చింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments