🌹 సిద్దేశ్వరయానం - 99 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 రాధాసాధన - 2 🏵
ఆనుషంగికంగా ఒకటి రెండు అంశాలు ప్రస్తావిస్తాను. ఆనాడు అయిదు శతాబ్దాల క్రింద నా శిష్యునిగా ఒక యువకుడు ఎంతో సేవ చేసేవాడు. అతని సేవాభావానికి ముగ్ధుడై రాధికాప్రసాద్మహారాజ్ గారు 'నాదగ్గరికి వస్తావా?' అని ప్రేమతో పిలిచారు. అది అప్పుడు జరగడానికి అవకాశం లేకపోయింది. అత డిప్పుడు నా తమ్మునిగా పుట్టి పెరిగి వారిశిష్యుడై వారి సేవచేసి వారి ఆశ్రమంలోనే ఉన్నాడు.(పి.వి.కె. రామారావు రాంబాబు) ఆకాలంలో సనాతన గోస్వామితో గూడా నాకు స్నేహ బంధము ఉండేది. వారి ఆశ్రమానికి కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. వారి గృహస్థశిష్యులు ఒకరు జన్మాంతరములో మౌనస్వామిగా ఎలా ఉదయించారో ఇంతకుముందే చెప్పటం జరిగింది.
సనాతనస్వామి ప్రదక్షిణ చేసిన శిలను అలంకరించిన పుష్పమాలను ధరించి ధ్యానం చేస్తే మౌనస్వామిని గురించిన విశేషాలు తెలిసినవి. ఆయన పూజించిన రాధా మదనగోపాల విగ్రహాలను అలంకరించిన పుష్పమాల ధరించి ధ్యానం చేస్తే మురళీమోహనుడు దర్శనమిచ్చాడు. దేవతలను పూజించిన వస్తువులలో అద్భుతశక్తి ప్రసారం జరగడం ఎన్నోసార్లు అనుభవించాను. అయిదువందల సంవత్సరాల క్రింద బృందావనధామంలో నాకు సమకాలికులుగా ఉన్న వ్యక్తులలో అనేకులను ఇటీవల గుర్తుపట్టటం జరిగింది. వివిధ వయస్సులలో, వివిధ పదవులలో) ఉన్న పురుషులు, స్త్రీలు ఆనాడు అక్కడ రాధాకృష్ణులను వారు ఏవిధంగా సేవించేవారో ఆ విశేషాలు ఎన్నో పరమేశ్వరి రాధాదేవి కరుణవల్ల చూడగలిగాను.
ఇటీవల ఒక ఐ.ఎ.యస్. ఆఫీసర్ నాకు సన్నిహితుడయినాడు. అతను పూర్వజన్మలో ఒక చిన్నరాజుగా ఉండి బృందావనంలో ఒక పెద్ద రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించాడు. ఆ పుణ్యఫలితంగా అఖిలభారతసర్వీసు కమీషనులో ఎంపికై ప్రస్తుతం ఒక జిల్లాలో కలెక్టరుగా ఉన్నాడు. అదేవిధంగా నేను ప్రిన్సిపల్గా పనిచేసిన కాలేజీ కమిటీ అధ్యక్షుడు పూర్వజన్మలో బృందావనంలో ఒక ఉద్యాన వనపాలకునిగా ఉండి రాధాకృష్ణ పూజకు పూలు పంపించేవాడు, స్వయంగా పూజచేసేవాడు. ఈజన్మలోనూ అతడు కృష్ణభక్తుడే. ఒకసారి వారి ఇంట్లో దొంగలు పడితే పోయిన వస్తువులలో పూజావిగ్రహాలు కూడా ఉన్నాయి. అతడు చాలా బాధపడుతూ “డబ్బుపోతే పోయింది. రాధాకృష్ణ విగ్రహాలు దొరికితే బాగుండు" అన్నాడు. ఆయనమీది అభిమానం వల్ల రాధాదేవిని ప్రార్థించాను.
మరునాడు ఆ రెండు విగ్రహాలు మాత్రం లభించినవి. ఈ జన్మలో నాకు భార్య అయిన సుందరీదేవి కూడ ఆనాటి బృందావన నివాసినియే. అదే విధంగా మా పిల్లలు జయంతి, కిరణ్, శ్యామ్ కూడా అప్పటి బృందావన జీవులే. వారు పూర్వజన్మలో రాధాభక్తులని తీవ్రసాధకులని శ్రీరాధికాప్రసాద్మహారాజ్ ప్రత్యేకంగా చెప్పారు.
హితహరివంశమహరాజ్ ‘రాధాసుధానిధి' అన్న అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. గోపికల మధురభక్తి భావాన్ని మించిన సఖీ భావాన్ని పొందిన 'మహాభావ' సమన్వితు డతడు. ఆ గ్రంథాన్ని చదివి పరవశించి అనువదించాలని పూనుకొన్నప్పుడు దర్శనమిచ్చి ప్రేమతో పలకరించి అనువాదానికి అనుమతిని అనుగ్రహించిన రసికభక్తుడు అతడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comentarios