005 - కార్తీక పురాణం - 4 : 4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ Kartika Purana - 4 ; Chapter 4: The glory of Deeparadhana, the story of Shatrujit
- Prasad Bharadwaj
- Oct 25
- 3 min read

🌹. కార్తీక పురాణం - 4 🌹
🌻 4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ. 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌹. Kartika Purana - 4 🌹
🌻 Chapter 4: The glory of Deeparadhana, the story of Shatrujit. 🌻
📚. Prasad Bharadwaja
జనకుడు అడుగుతున్నాడు: "హే బ్రహ్మర్షీ ! నువ్వింత వరకూ కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో యీ వ్రత మాచరించాలో - ఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి."
వశిష్ట ఉవాచ: అన్ని పాపాలనూ మన్ను చేసేదీ, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేదీ అయిన యీ కార్తీక వ్రతానికి ఫలానా 'సంకల్పము' అనేది హాస్యాస్పదమయిన విషయము.
ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలనూ, తత్ఫలాలనూ చెబుతాను విను.
కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ - శివలింగ సన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకములో శివాలయములో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఇప్ప - నారింజనూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో - వాళ్లు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నయినా సమర్పించిన వాళ్లు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము, కాంక్షతో గాని - నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్లు కూడా శివప్రియులవుతారు. ఇందు కుదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను.
🌻. కార్తీక దీపారాధనా మహిమ
పూర్వము పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజొకడు, కుబేరుని మించిన సంపద కూర్చుకుని వున్నా, కుమారులు లేని కారణంగా క్రుంగిపోయినవాడై, కరంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని - అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, 'ఓ రాజా! ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి, బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే - నీకు తప్పక పుత్రక సంతానము కలుగుతుందని" చెప్పాడు. బుషి వాక్యమును శిరోధార్యముగా తలచి - ఆ పాంచాలుడు తన పట్టణము చేరి, కార్తీక వ్రతమాచరించి, శివప్రీతికై బ్రహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెల తప్పి, యుక్తకాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజ దంపతులా శిశువుకి 'శత్రుజిత్తు' అని పేరు పెట్టారు.
🌻. శత్రుజిత్తు చరిత్రము
ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్థమానుడై పెరిగి, యువకుడై, వీరుడై వేశ్యాంగనా లోలుడై, అప్పటికీ తృప్తి చెందక, పరస్త్రీరక్తుడై, యుక్తా యుక్త విచక్షణా నాస్తికుడై, శాస్త్ర దిక్కారియై, వర్ణసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదరించుచు, స్వేచ్చాచారియై ప్రవర్తింపసాగేడు. అటువంటి సందర్భంలో -సౌందర్యరాశి సింహమధ్యమా, అరటి దోనెల వంటి తొడలు గలదీ, పెద్ద పెద్ద పిరుదులూ, కుచాలూ, కన్నులూ కలదీ, చిలుకవలే చక్కని పలుకులు గలదీయైన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య, శౌర్య, తేజో విరాజితుడైన యీ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా - ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే - సంకేత స్ధలంలో రాజకుమారుని కలిసి - సురత క్రీడలలో సుఖించేది. రంకూ- బొంకూ దాగవు గదా! ఏదో విధంగా యీ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనొక కత్తిని ధరించి - ఈ రంకు జంటకు ప్రత్యక్షంగా చూసి, వారి గొంతు లుత్తరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకురాలయిన జారిణిగాని, ఆ శత్రుజిత్తుగాని యీ సంగతి నెరుగరు.
రోజులిలా గడుస్తూ వుండగా ఒకానొక కార్తీక పూర్ణిమా సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్ధానముగా యెంచుకున్నారు. అపరరాత్రివేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా వుంది. ఆ బాపనిది తన చీరచెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడెక్కడినించో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు.
ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడెలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తునీ, అనంతరం తన భార్యనూ తెగనరికి - తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్లు ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే - పాశహస్తులైన యమదూతలూ - పవిత్రాత్ములైన శివదూతలూ - ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలా రాకుమారుడినీ, రంకులాడినీ తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలీ యమాయకపు బాపడిని తమతో నరకమువైపు లాగుకొనిపోసాగారు. అందుకచ్చెరుపడిన పారుడు - "ఓ శివదూతలారా! కానిపని చేసిన వారికి కైలాసభోగము - నా వంటి సదాచారుడికి నరక యోగమూనా?' అని ప్రశ్నించగా, అందులకా శివదూతలు - 'వీరెంత పాపాత్ములయినా - ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి, శివాలయములో - అందునా - శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక, వారి పాపాలూ, నేరాలూ నశించి పుణ్యాత్ములయ్యారు.
ఏ కారణం చేతనైనాసరే కార్తీక మాసములో అందునా పౌర్ణమినాడు, పైగా సోమవారమునాడు దేవాలయములో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్యులైన వీళ్లని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివీ, పాపాత్ముడివీ అయ్యావు. అందుకే, నీకు నరకము - వీరికి కైలాసము' అని చెప్పారు.
బ్రహ్మణుడికీ, శివపారిషదులకూ జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, 'అయ్యలారా! దోషులము మేమైయుండగా, మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము గాదు. కార్తీక మాసము దొడ్డదయితే, అందునా పూర్ణిమ గొప్పదయితే, సోమవారము మరీ ఘనమయనదయితే, దీపారధాన మరీ పుణ్యకరమైనదయితే మాతోబాటే కలసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్ప'దని వాదించడం జరిగింది. తత్ఫలముగా - శత్రుజిత్తు తానూ, తన ప్రియురాలూ ఆచరించిన వత్తీ, తైలముల పుణ్యము తాముంచుకుని, ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా , శివదూతలా విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి - తమతో కైలాసానికి తీసికొనివెళ్ళారు.
కాబట్టి, ఓ మిధిలానగరాధీశ్వరా ! కార్తీకమాసములో తప్పనిసరిగా - శివాలయములోగాని, విష్ణ్వాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందునా, శివాలయములో చేసిన దీపారాధన విరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని - కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు చతుర్థాధ్యాయ స్సమాప్త:
🌹 🌹 🌹 🌹 🌹



Comments