top of page

007 - కార్తీక పురాణం - 6 : అధ్యాయము 6 : 6. దీపదాన విధి మహత్యం Kartika Puranam - 6 : Chapter 6 : 6. The significance of offering lamps

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 7 days ago
  • 2 min read
ree

🌹. కార్తీక పురాణం - 6 🌹


అధ్యాయము 6


🌻 6. దీపదాన విధి మహత్యం, లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట. 🌻


ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Puranam - 6 🌹


Chapter 6


🌻 6. The significance of offering lamps: even the miser attains heaven. 🌻


Prasad Bharadwaja



శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షీ, జనకా! ఈ కార్తీక మాసము ముప్పయి రోజులు కూడా - ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరీ, గంథాదులతోనూ, పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణుసన్నిధిలో దీపారాధనమును చేసినా, దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి, బియ్యప్పిండి లేదా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి, ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సధ్భ్రాహ్మణుని ఆహ్వానించి, చివరి రోజున వెండి ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన వుంచి, పూజా నివేదనాదులను పూర్తిచేసి, బ్రహ్మణులకు భోజనము పెట్టి అనంతరము - తాము స్వయంగా


🌻. దీపదాన మంత్రము


మంత్రం :


సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం ! దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ!!


'జ్ఞానమునూ, సంపదలనూ,శుభములనూ కలిగించే దైవ, దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి, సుఖము లేర్పడుగాక' అని చెప్పుకుంటూ, పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలూ కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్ధమై ఒక కథను వినిపిస్తాను విను.



🌻. లుబ్ధ వితంతువు మోక్షమందుట 🌻


పూర్వం ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతు వుండేది. ఆమె రోజూ భిక్షాటనమును చేసి, వచ్చిన దానిలో - మంచి అన్నమునూ, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగినది. ఇతరుల యిండ్లలో వంటపనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ వుండేది. అదిగాక ద్రవ్యభిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్నమానసయైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప యేనాడూ హరినామస్మరణ చేయడంగాని, హరికథనో, పురాణాన్నో వినడంగాని, పుణ్యతీర్ధ సేవనమునుగాని, ఏకాదశీ వుపవాసమును గాని చేసి యెరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన - శ్రీరంగ యాత్రీకుడైన ఒక బ్రహ్మనుడు వచ్చి - ఆమె స్ధితిని చూసి - ఆమెకు నరకము తప్పదని గుర్తించి, జాలిపడి - ఆమెను మంచి దారిలో పెట్టదలచి -


'ఓ అమాయకురాలా! నేను చెప్పేది శ్రద్దగా విని ఆలోచించుకో. ఈ కేవలము చీమూ - నెత్తురూ - మాంసమూ - ఎలుకలతో కూడుకుని సుఖదుఃఖ లంపటమై వున్నదే తప్ప, ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి - అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా - ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకూ చెదరిపోయే వాననీళ్లలా - చెదరిపోతాయి. నీటి మీద నురుగులాటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే - ఆశల అగ్నిలో పడే మిడతలవలె మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలనూ వదలి పెట్టు. దైవమొక్కడే శాశ్వతుడనీ, సర్వభూతదయకారుడనీ గుర్తించు. నిరతమూ హరిచరణాలనే స్మరించు. కామమంటే - కోరిక, కోపమంటే - దురాగ్రహం, భయమంటే - ఆత్మనాత్మీయ భంగత, లోభమంటే - ధనవ్యయచింత, మోహమంటే - మమతాహంకారాలు - ఇటువంటి ఈ ఆరింటినీ వదలిపెట్టు. నా మాటవిని, యికనుంచయినా కార్తీకమాసములో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు' అని హితవు చెప్పి, తనదారిన తాను వెళ్లిపోయాడు.


అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తానుకూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీకమాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము - ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులూ ఆచరించి చివరిరోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించి పోయినదై, విగతాసువై విమానారూఢురాలై, శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది.


కాబట్టి 'రాజా! కార్తీకమాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసిగాని, తెలియకగాని యెవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకొన్నవారే అవుతున్నారు. దీనిని వినినా, చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు.


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠోధ్యాయ స్సమాప్త:



🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page