top of page

కార్తిక పురాణం - 14 :- 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము) Kartika Purana - 14 :- Chapter 14: Rituals to be performed during the month of Kartika

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 7 hours ago
  • 3 min read
ree

🌹. కార్తిక పురాణం - 14🌹


🌻. 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక మాస శివపూజా కల్పము. 🌻


📚. ప్రసాద్ భరద్వాజ




🌹. Kartika Purana - 14🌹


🌻. Chapter 14: Casting a spell on the abode (Vrishosarga), things to be discarded in Kartika month, Kartika month Shiva puja Kalpa. 🌻


📚. Prasad Bharadwaja



మరల వశిష్ఠులవారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.


ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.


వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.


🌻. కార్తీకమాసములో విసర్జింపవలసినవి 🌻


ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన కల్లుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.



గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |


నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||


అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుఓవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న సివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.



🌻. కార్తీకమాస శివపూజాకల్పము 🌻


1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి


2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి


3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి


4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి


5. ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి


6. ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి


7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి


8. ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి


9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి


10. ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి


11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి


12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి


13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి


14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి


15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి


16. ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి


17. ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి


ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహమణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల, వారికీ, వారివంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.


ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.


🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page