కార్తిక పురాణం - 15 :- 15వ అధ్యాయము - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట Kartika Purana - 15 :- Chapter 15 - By lighting the lamp ....
- Prasad Bharadwaj
- 4 hours ago
- 2 min read

🌹. కార్తిక పురాణం - 15 🌹
🌻 15వ అధ్యాయము - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌹 Kartika Purana - 15 🌹
🌻 Chapter 15 - By lighting the lamp, one attains a human form with the memory of being a mouse in a previous birth 🌻
📚 Prasad Bharadwaj
అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.
ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును.
శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచ వలెను.
ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.
సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయ మొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.
ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచి చూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.
అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తిను బండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించు చుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.
🌹కార్తీక మాసం 15వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్ భరధ్వాజ
నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు
దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు
జపించవలసిన మంత్రం:-
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'
🌹 🌹 🌹 🌹 🌹



Comments