top of page

కార్తిక పురాణం - 21 :- 21వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావం Kartika Purana - 21 :- Chapter 21 - The influence of Puranjaya on Kartika

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 4 days ago
  • 2 min read
ree

🌹. కార్తిక పురాణం - 21 🌹

🌻. 21వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావం 🌻

ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 21 🌹

🌻. Chapter 21 - The influence of Puranjaya on Kartika 🌻

Prasad Bharadwaja


అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి, కాంభోజాది భూపాలురకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు రథికుడితో, అశ్వసైనికుడు అశ్వసైనికుడితో, గజ సైనికుడు గజ సైనికుడితో, పదాతులు పదాతి దళాలతో, మల్లులు మల్లయుద్ధనిపుణులతో, ఖడ్గ, గద, బాణ, పరశు మొదలు ఆయుధాలు ధరించినవారు అవే ఆయుధాలు ధరించినవారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకొంటూ.. హూంకరించుకుంటూ.. దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ, విజయకాంక్షతో పోరాడారు.


ఆ రణ భూమి అంతా ఎక్కడ చూసినా… విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వాతాల్లా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా.. మూడు అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్నా… పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దు:ఖించుచుండెను.


ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి, పురంజయుడిని ఊరడించారు. ”రాజా! ఇంతకు ముందు ఒకసారి నీవద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్లమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మప్రవర్తుడవైనందునే… ఈ యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నా మాటలు విను. జయాపజయాలు దైవాదీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని, శత్రురాజులను యుద్ధంలో జయించి, నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీకమాసం. రేపు కృత్తికా నక్షత్ర యుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన, జపాది నిత్యకర్మలు ఆచరించి, గుడికి వెళ్లి, దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి. భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి. ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు… శ్రీమన్నారాయణుడిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై… నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి… రేపు అలా చేసినట్లయితే… పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి, నేను చెప్పినట్లు చేయి…” అని ఉపదేశించాడు.


ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే, ఏకవింశోద్యాయ సమాప్తం. ఇరవయొక్కటో రోజు పారాయణం సమాప్తం.

🌹🌹🌹🌹🌹


🌹కార్తీక మాసం 21వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం

దానములు:- యథాశక్తి సమస్త దానాలూ

పూజించాల్సిన దైవము:- కుమారస్వామి

జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page