top of page

కార్తీక పురాణం - 29 :- 29వ అధ్యాయము - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము Kartika Purana - 29 :- Chapter 29 - Ambarisha worships Durvasa

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 3 days ago
  • 3 min read
ree

🌹. కార్తీక పురాణం - 29 🌹

🌻. 29వ అధ్యాయము - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము 🌻

ప్రసాద్ భరద్వాజ


🌹. Kartika Purana - 29 🌹

🌻. Chapter 29 - Ambarisha worships Durvasa - Dwadashi Prana 🌻

Prasad Bharadwaja



అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.


ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.


మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాపంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.


ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.


నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.


ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీ దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీ కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.


ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి అత్యంత ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింప కూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును.


అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.


ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.


ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 29వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి

దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.

🌹 🌹 🌹 🌹 🌹





Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page