top of page

కార్తీక పురాణం - 7: అధ్యాయము 7: 7. శివకేశవార్చనా విధులు Kartika Purana - 7: Chapter 7: 7. Methods of Worshiping Shiva-Keshava

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 6 hours ago
  • 2 min read
ree

🌹. కార్తీక పురాణం - 7 🌹


అధ్యాయము 7


🌻 7. శివకేశవార్చనా విధులు. 🌻


📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 7 🌹


Chapter 7


🌻 7. Methods of Worshiping Shiva-Keshava 🌻


📚. Prasad Bharadwaj



'ఓ జనక రాజేంద్రా! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చనా- దీప విధానాలను చెబుతాను విను.


🌻. పుష్పార్చనా ఫలదాన దీపవిధి - విశేషములు:


ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసనియైన లక్ష్మిదేవి ఆ భక్తుల యిండ్ల స్ధిరావాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని, జాజిపువ్వులతోగాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి యీ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు.


బ్రాహ్మణ సమేతులై, ఉసిరిచెట్టు వున్న తోటలో - వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో, వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతోగాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువున కెదురుగా జప, హొమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి - పుష్పము పరాగమువలె యెగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది.


కార్తీకమాసమందు యే స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి, పంచరంగులతోనూ, శంఖ- పద్మ- స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాడు దీర్ఘయువై, అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణ్వాలయములో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్దాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా యెగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను నాచరింపనివారూ, లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి, తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు.


కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా! కార్తీక మాసములో యెవరైతే అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు - తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను, అశక్తులయిన వాళ్లు.



శ్లో || కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ !


మాసస్నానేన యత్సుణ్యం తత్పుణ్యం లభతేనృప !!


శ్లో|| ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ !


మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః !!



కార్తీకమాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణమనాడు గాని, అమావ్యానాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నాన మాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. 'ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా! మహీశా! కార్తీకమాసములో యితరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి.



🌹 🌹. కార్తిక పురాణం - 7


కార్తీకమాసము విష్ణుపూజార్ధమై యితరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్ప పూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీకమాసము సాయంకాలాలలో దేవాలయాలలో శివ - విష్ణుస్తోత్రాలను పఠించేవారు - కొంతకాలము స్వర్గలోకములో వుండి - అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతీ! కార్తీక మాసములో యెవరైతే హరిహరులను స్మరించకుండా వుంటారో వాళ్లు ఏడుజన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు.



ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తమోధ్యాయ స్సమాప్త:


🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page