top of page

కార్తీక పురాణం - 8 : 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ. Kartika Purana - 8 : Chapter 8: Chanting the Name of Srihari and the Story of Ajamila

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 4 days ago
  • 3 min read
ree

🌹. కార్తీక పురాణం - 8 🌹


🌻 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ. 🌻


📚. ప్రసాద్ భరద్వాజ



🌹. Kartika Purana - 8 🌹


🌻 Chapter 8: Chanting the Name of Srihari and the Story of Ajamila. 🌻


📚. Prasad Bharadwaja



వశిష్టుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు: 'మహర్షీ! మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలయిన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు' అని సమస్త ధర్మ శాస్త్రాలలోను ఘోషిస్తుండగా, కేవలం కార్తీక వ్రతాచరణా ధర్మలేశము చేతనే సమస్త పాపాలూ హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది యెలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్య మాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతూన్న యింటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురిషెడు నీళ్లు జల్లినంత మాత్రాన, అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా ? తనకు తానై కొండచరియలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠా! ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులూ, పుణ్యాత్ములూ ఎలా అవుతారు ? వీటికి సమాధానమేమిటి ?


జనకుడి ప్రశ్నకు జ్ఞానహసమును చేస్తూ - ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు.


🌻. జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు


వశిష్ఠ ఉవాచ:


మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలేగాని, స్ధూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక, వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను - స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తూంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతియైన 'మహామాయ' కారణంగా సత్వర జస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి.


తర్కము- దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్ధూలస్వరూపాలు. ఇవి తమోగుణము వలన యేర్పడతాయి. వీటిల్లో - సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాలయోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. 'దేశము' అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలము. యోగ్యత అంటే - పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలూ తమాసాలు - వీటివలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా! జనకరాజా! అన్నిటికి కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికి మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరంచే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్న పూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా! పర్వతమంత యెత్తు కట్టెలను పేర్చి, వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే -ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో - అదే విధంగా తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలములో, పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచిరంచే ధర్మము అనంత పాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకుదాహరణగా ఒక కథ చెబుతాను విను.


🌻. అజామిళో పాఖ్యానము 🌻


బహుకాలం పూర్వం కన్యాకుబ్జక్షేత్రవాసీ, సార్ధక నామధేయుడూనైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామీళుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు. దాసీ సాంగత్యపరుడు, హింసా ప్రియుడుగా వుండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాడితో సాంగత్యమును పెట్టుకొని, తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయానాదులన్నిటినీ నిర్వర్తిస్తూ, కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడచిపెట్టి, కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదలివేశారు. కులము వాళ్లు వెలివేశారు. అందువలన యిల్లు వదలిపెట్టి పోవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపువాడలోని ఒకానొక దాసీ దానితో కాపురము పెట్టి, కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికకే జనాలలో లీనమై, మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు.


కార్తీక పురాణం - 8


ఇలా వుండగా, ఒకనాడతని ప్రియురాలైన దాసీది, కల్లు తాగడం కోసం తాడిచెట్టునెక్కి, కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు.


అప్పటికే ఆ దాసీ దానికి యవ్వనవతియైన కూతురు వుంది. మహాపాపాత్ముడూ, మహా కామాంధుడూ అయిన అజామిళుడు, తనకి కూతురు వరుసని కూడా తలచకుండా - ఆ పిల్లనే వరించి, ఆమెతోనే కామోపభాగాలనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు, తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా, కడగాపుట్టి మిగిలిన బిడ్డకు 'నారాయణ' అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిదురిస్తున్నా ఏం చేస్తున్నాసరే - సతతం అతనినే స్మరించుకుంటూ 'నారాయణా - నారాయణా' అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ వుండేవాడు. కాలము గడచి అజామిళుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకుగాను - ఎర్రని గడ్డములు - మీసములు కలిగి, చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు.


వారిని చూస్తూనే గడగడలాడి పోయిన అజామిళుడు, ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక, ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి వున్న కుమారునికోసమై 'నారాయణా, ఓ నారాయణా! తండ్రి నారాయణా'! అని పలుమారులు పిలవసాగాడు.


ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ 'నారాయణ' నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు - 'ఓ యమదూతలారా! అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడేగాని, మీరు తీసుకొని వెళ్లదగిన వాడు కాదు' అని హెచ్చరించారు. వికసిత పద్మాలవలే విశాలమైన నేత్రాలు కలవాళ్లూ, పద్మమాలాంబర వసనులూ అయిన ఆ పవిత్ర విష్ణుపారిషదులను చూసి, విభ్రాంతులైన యమదూతలు 'అయ్యా! మీరెవరు? యక్ష గంధర్వ సిద్ద చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందిన వారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసికొని వెళ్ళనున్న ఈ జీపుని మీరెందుకు తీసికొని వెడుతున్నారు?' అని అడగడంతో, విష్ణుదూతలులిలా చెప్పసాగారు.



ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే


అష్టమ అధ్యాయౌ స్సమాప్తః


🌹 🌹 🌹 🌹 🌹





Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page