కార్తీక పురాణం - 9 : 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము Kartika Purana - 9 : Chapter 9: Vishnu Parshada, Yamadootala dispute
- Prasad Bharadwaj
- 4 hours ago
- 2 min read

🌹. కార్తీక పురాణం - 9 🌹
🌻 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము. 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌹. Kartika Purana - 9 🌹
🌻 Chapter 9: Vishnu Parshada, Yamadootala dispute. 🌻
📚. Prasad Bharadwaja
యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు యిలా భాషించసాగారు, 'ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి?'
విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమీయసాగారు. "సూర్యచంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలూ దశదిశా కాలాలూ, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము.
ఓ విష్ణుదేవతలారా! శ్రద్ధగా వినండి - వేదమార్గాన్ని విడిచిన స్వేచ్చాచారులూ, సాధుజన బహిష్కృతులూ యమదండనార్హులు. బ్రహ్మణునీ, గురువునీ, రోగినీ పాదాలతో తాడించేవాడు - తల్లిదండ్రులతో కలహించేవాడూ, అసత్యవాదీ, జంతుహింసకుడూ, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడూ, డాంబికుడూ, దయారహితుడూ, పరభార్యాసంగాముడూ, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్లనీ, చేసినదానాన్ని బైటపెట్టుకునే వానినీ, మిత్రద్రోహినీ, కృతఘ్నులనీ, ఇతరుల పురుష సంతతిని చూసి యేడ్చేవానినీ, కన్యాశుల్కాలతో జీవించేవానినీ, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులనీ, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడచినవానినీ, కేవలం భోజనం గురించే ఆలోచించేవానినీ, బ్రహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడుతూంటారు. ఇక ఈ అజామిళుడంటారా? వీడు చేయని పాపమంటూ లేదు. బ్రహ్మణ జన్మమెత్తి, దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు!"
యమదూతల సమాదానాన్ని విని - విష్ణుపార్షదులిలా చెప్పసాగారు.
"ఓ యమదూతలారా! ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదలి సత్సంగమములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమ తత్సరుడూ మీ యమలోక గమనానికి అర్హులు కారు.
ఓ యమదూతలారా! అసూయారహితులై, జపాగ్నిహోత్ర నిర్వాహకులై, సర్వ కర్మలనూ సగుణ బ్రహ్మార్పణము చేసేవారు - జలాన్నగోదాతలు. వృషోత్సర్జనా కర్తలూ యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత (గురువులు), పరోపకార శీలురు, హరిపూజాప్రియులు, హరినామ జాపకులూ, వివాహ - ఉపనయనాలను చేయించే వారూ - అనాథ ప్రేత సంస్కారకర్తా - వీళ్లెవరూ మీ యమదండనల కర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి, తత్తీర్థాన్ని పానము చేసే వాడూ - తులసీకాష్ఠ మాలికలను ధరించేవాడూ, వివేవాడూ - సూర్యుడు మేష - తులా - మకర సంక్రాంతులందుండగా ప్రాతఃస్నానమును ఆచరించేవాళ్లూ - వీళ్లెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని - తెలియకగాని హరినామ సంకీర్తనమును చేసే వాళ్లు - పాపవిముక్తులవుతారు. ఓ యమదూతలారా! ఇన్నిమాటలెందుకు? ఎవడైతే అవసానకాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు.
ఈ విధముగా సాగుతున్న యమ, విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడిలోని జీవుడు - తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తూన్న జీవుడు - స్పృహామయుడై అచ్చెరువందాడు. "ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతులు ఏమై పోయారు? నేనీ వైకుంఠములో యెలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామమెలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది?" అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా! కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా- హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే యెంత పుణ్యం కలుగుతుందో వూహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే నవమోధ్యాయ స్సమాప్త:
🌹 🌹 🌹 🌹 🌹


Comments