కార్తీక పౌర్ణమి రోజున మీ రాశి ప్రకారం దానం చేయండి! Donation according to your zodiac sign on Kartik Purnima day!
- Prasad Bharadwaj
- 5 hours ago
- 2 min read
🌹 కార్తీక పౌర్ణమి రోజు మీ రాశి ప్రకారం ఇవి దానం చేయడం మర్చిపోవద్దు! 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Don't forget to donate these according to your zodiac sign on Kartik Purnima day! 🌹
Prasad Bharadwaj
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం.
అంతే కాకుండా కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. అలాగే దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చన జరిపించిన సర్వశుభాలు ప్రాప్తిస్తాయని శాస్త్ర వచనం. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు ఆయా రాశుల వాళ్లు రాశి ప్రకారం దానం చేయాల్సినవి ఏమిటో తెలుసుకుందాం..
ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈరోజున శివుడు, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. శ్రీమహావిష్ణువు ఆలయాల్లో ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలో ప్రమిదల్లో, ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను పసుపు, కుంకుమ, పూలతో అంకరించి వెలిగించాలి. ఇక శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండదీపాన్ని అలాగే ఆకాశదీపం పేరుతో ఎత్తయిన ప్రదేశంలో వేలాడదీస్తారు. అంతే కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభఫలితాలను పొందొచ్చు. అయితే ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం..
మేష రాశి - వృషభ రాశి
మేష రాశి వారు కార్తీక పౌర్ణమి రోజు బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పులు, ఎర్రటి పండ్లు దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. అలాగే శివకేశవుల అనుగ్రహం కూడా పొందొచ్చు. ఇక వృషభ రాశి వాళ్లు కార్తీక పౌర్ణమి రోజు దుప్పట్లు, పాలతో చేసిన స్వీట్లు, బియ్యం, నెయ్యి వంటివి దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం.
మిథున రాశి - కర్కాటక రాశి
కార్తీక పౌర్ణమి రోజు మిథున రాశి వాళ్లు పెసలు, ఆకుపచ్చని కూరగాయలు, ఉసిరికాయలు, పచ్చ రంగు వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది. అలాగే.. పిల్లలకు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదం. ఇక కర్కాటక రాశి వాళ్లు పాలు, బియ్యం, పంచదార, తెల్లని స్వీట్లు వంటి వాటిని దానం చేస్తే విశేష ఫలితాలను పొందడమే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.
సింహ రాశి - కన్యా రాశి
కార్తీక పౌర్ణమి రోజు సింహ రాశి వాళ్లు గోధుమలు, రాగి వస్తువులు, బెల్లం, నూతన వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం శుభప్రదం. ఇక కన్యా రాశి వాళ్లు ఆకుపచ్చని వస్త్రాలు, పెసలు, ఆకుపచ్చ కూరగాయలు, నెయ్యి వంటివి దానం చేయడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు బట్టలు, బియ్యం, పంచదార వంటివి దానం చేయడం వల్ల అన్నీ విధాల శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల రాశి - వృశ్చిక రాశి
కార్తీక పౌర్ణమి రోజు తులా రాశి వాళ్లు మినుములు, ఉలవలు, శనగలు, అరటి పండ్లు, పసుపు రంగు వస్తువులు వంటివి దానం చేయడం శుభప్రదం. వృశ్చిక రాశి వాళ్లు బెల్లం, ఎరుపు రంగు వస్త్రాలు, పప్పులు, ఎర్రటి పండ్లు వంటివి కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం మంచిది.
ధనుస్సు రాశి - మకర రాశి
కార్తీక పౌర్ణమి రోజు ధనుస్సు రాశి వాళ్లు కార్తీక పౌర్ణమి రోజు అరటిపండ్లు, పసుపు రంగు వస్త్రాలు, కుంకుమ పువ్వు, పసుపు వంటివి దానం చేయడం శుభప్రదం. ఇక మకర రాశి వాళ్లు నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినప పప్పు, దుప్పట్లు, స్టీల్ సామాన్లు వంటివి దానం చేయడం శుభప్రదం.
కుంభ రాశి - మీన రాశి
కార్తీక పౌర్ణమి రోజు కుంభ రాశి వాళ్లు దుప్పట్లు, దుస్తులు, నువ్వులు వంటి వాటిని కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం మంచిది. ఇక మీన రాశి వాళ్లు పసుపు రంగు వస్త్రాలు, శనగపిండితో చేసిన లడ్డూలు, పసుపు వంటివి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
🌹🌹🌹🌹🌹




Comments