నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం Pushya Masam, loved by Lord Shani, begins today...
- Prasad Bharadwaj
- 24 minutes ago
- 1 min read

🌹 నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం 🌹
ప్రసాద్ భరద్వాజ
పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది. అటు శనిదేవుడి జన్మనక్షత్రం కూడా పుష్యమే.. అందుకే ఈ మాసం శని దేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్ఠాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.
శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. 'ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది' అంటున్నారు.
శీతాకాలంలో వచ్చే పుష్య మాసం జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది, ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. "పుష్య" అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లలోకూడా అనుసరిస్తారు.
పుష్య మాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైనదే కానీ వివాహాలు, గృహప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల కార్యాలకు ఆశుభకరమైన మాసంగా జ్యోతిష శాస్త్రం పరిగణిస్తోంది. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయమని పండితులు చెబుతున్నారు.
ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని పూజించిన వారికి ఆయన మేలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జాతకంలో ఏలినాటి శని ఉన్న వారు ఈ మాసంలో రోజూ ఉదయానే కాలకృత్యాలు తీర్చుకొని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజున తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే మానసిక ప్రశాంత లభిస్తుంది. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం శ్రేష్టం.
🌹 🌹 🌹 🌹 🌹


Comments