నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం. Nara-Narayana Incarnations - The Manifestation of Badrinath - The Badrinath Shrine.
- Prasad Bharadwaj
- Dec 25, 2025
- 2 min read

🌹 నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం పురాణగాధ. ఊర్వశి జననం 🌹
ప్రసాద్ భరధ్వాజ
బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడికి దక్ష ప్రజాపతి తన పది మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మానికి అధిష్టాన దేవత అయిన ధర్ముడు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించాడు. మహావిష్ణువు వరం కోరుకోమనగా శ్రీహరిని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు.తగిన సమయంలో జన్మిస్తాను అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానమయ్యాడు.
కొంతకాలానికి ధర్ముడికి విష్ణువు "నరుడు నారాయణుడు" అనే నామాలతో ఇద్దరు కుమారులుగా జన్మించాడు. ధర్మదేవత ధర్ముడి పుత్రులైన నరనారాయణులు వేద విద్యలతో పాటు అధర్వణ వేదంలోని యుద్ద విద్యలు అభ్యసించారు. బ్రహ్మదేవుడు నరుడికి 'అజగవము' అనే ధనుస్సు, నారాయణుడికి 'శార్ఞగము"అనే ధనుస్సు అక్షయ తూణీరాలతో ప్రసాదించాడు.
నరనారాయణులు తపోదీక్ష స్వీకరించి హిమాలయాలలోని బదరికావనానికి వెళ్లి తపస్సు చేయసాగారు. బదరికా వృక్షములతో నిండి ఉండటం చేత ఆ వనానికి బదరికావనం అని పేరు వచ్చింది. బదరికాశ్రమం ఏర్పరచుకుని నరనారాయణులు లోకంలో ధర్మ సంస్థాపనకై చేస్తున్న తపస్సుకి వేయి సంవత్సరాలు గడిచాయి.
హిరణ్యకశిప సంహారం తరువాత రాజైన ప్రహ్లాదునికి చ్యవన మహర్షి ద్వారా సంవత్సరాల తరబడి ధర్మ సంస్థాపనకై తపస్సు చేస్తున్న మహర్షులు ఉండే ప్రదేశాలైన నైమిశారణ్యం, బదరికా వనం గురించి విన్నాడు. యజ్ఞ యాగాదులతో, నిరంతర తపస్సులతో తపోభూములుగా ప్రసిద్ధి కెక్కిన రెండు పుణ్యస్థలాలను దర్శించాలని బయలుదేరాడు.
మొదట నైమిశారణ్యం చేరిన ప్రహ్లాదుడు అక్కడి మహర్షులను దర్శించి ఆశీస్సులు పొందాడు. వారి ద్వారా నరనారాయణుల గురించి విని బదరికావనం బయలుదేరి వెళ్లాడు. బదరికాశ్రమంలో నిశ్చల ధ్యానంలో ఉన్న నరనారాయణులను దర్శించాడు. నారవస్త్రాలు ధరించి కృష్ణాజినాలపై తపస్సులో ఉన్న నర నారాయణుల ముందు ధనుస్సులు, అక్షయ తూణీరాలు (బాణాలు) ఉండటం గమనించి విస్మయం చెందాడు.
తపస్సు చేసేవారి వద్ద ఆయుధాలు ఉండటం ధర్మవిరుద్ధం అని భావించి ప్రహ్లాదుడు వారితో మీరు బ్రహ్మ వంశస్థులు, బ్రాహ్మణులైన మీరు మీ వర్ణాచారం ప్రకారం తపస్సు చేయాలి. మరి ఈ ధనుస్సులు బాణాలు ఎందుకు చేపట్టారు? ధర్మదేవత ధర్ముడి పుత్రులైన మీరు అధర్మంగా ఆయుధాలు చేపట్టడం తప్పు. ధర్మదేవత పుత్రులే అధర్ములైతే నేను సహించను. మీరు ఆయుధాలను తక్షణం వదిలేయండి" అని హెచ్చరించాడు.
నరుడు నవ్వి "ప్రహ్లాద మహారాజా! ధర్మ పరిరక్షణ కూడా బ్రాహ్మణుల విధ్యుక్త ధర్మంలో భాగము అని మీకు తెలియదా! వేదశాస్త్రాలతో పాటు యుద్దవిద్యలు మీవంటి వారికి నేర్పించేది మేమే అని మరచి పోయారు. సమస్త విద్యలకు ఆచార్యులమైన మేము తపస్సు చేయడానికి, ధనుస్సు ధరించడానికి అర్హులం, సమర్ధులం. అనవసర ప్రసంగం మాని మీరు మీ దారిన వెళ్ళండి" అని అన్నాడు.
మహావిష్ణువు ప్రియ భక్తుడైన ప్రహ్లాదునికి నరుడు చులకనకి ఆగ్రహం వచ్చింది. "మీరు మా తోటి యుద్దం చేయగల సమర్థులా? రండి!తేల్చుకుందాం" అని వారితో యుద్దానికి దిగాడు. సరేనని నరనారాయణులు ధనుస్సులు ధరించి యుద్దానికి దిగారు.
ప్రహ్లాదుడు, నరనారాయణుల మధ్య భీకర ధనుర్యుద్ధం మొదలైంది. బాణాలు శరపరంపరలుగా కురిశాయి. ఆకాశం బాణాలతో కమ్ముకుపోయింది. నారాయ ణుని ప్రియభక్తునికి, నారాయణుని అంశావతారాలైన నరనారాయణులకు నూరు సంవత్సరాలు యుద్దం జరిగింది. ప్రశాంత వాతావరణం కలిగిన బదరికావనం ధనుష్టంకార ధ్వనులతో, బాణాల శబ్దాలతో దద్దరిల్లి పోయింది.
తాపసులందరు యుద్దం ఆపేలా చేయమని వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుని ప్రార్ధించారు. మొరలాలకించిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, ప్రహ్లాదుని చూసి "ప్రహ్లాదా! నరనారాయణులు నా అంశావతారులుగా జన్మించారు. జితేంద్రియులైన వీరు భవిష్యత్తులో ధర్మ సంస్థాపన కోసం జన్మించబోయే అవతార మూర్తులుగా ఉండటానికి ఈ జన్మలో ధనుర్విద్యలు అభ్యసించి ధనుర్భాణాలు ధరించారు. ఈ జన్మ లో తపస్సుతో, వచ్చే జన్మలో శస్త్రాస్త్రాలతో ధర్మ ప్రతిష్టాపన చేస్తారు కనుక నా అవతార మూర్తులతో యుద్దం తక్షణం విరమించి నీ రాజ్యానికి వెళ్లుము" అని ప్రబోధించాడు.
ప్రహ్లాదుడు నారాయణునితో పాటు నరనారాయణులకు నమ స్కరించి తన రాజ్యానికి వెళ్లి పోయాడు. నరనారాయణులు శ్రీమహావిష్ణువుకి నమస్కరించి "శ్రీమన్నారాయణా! నీవు "బదరీనాథుడు" గా ఇక్కడ స్వయంభువు మూర్తిరూపంలో వెలసి భక్తులకు నీ సుందర విగ్రహ దర్శనం కలిగించుము" అని ప్రార్ధించారు.
శ్రీహరి వారి ప్రార్థనకి సంతోషించి "నేను బదరీనాథుడిగా స్వయంభువునై ఇక్కడ అవతరిస్తాను. మీరు మీ జన్మాంతమున నాకు ఇరు వైపులా నర-నారాయణ పర్వతములుగా వెలసి నన్ను దర్శించే భక్తులను రక్షిస్తుంటారు. కలియుగాంతం వరకు ఈ ప్రదేశం బదరీనాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఉంటుంది" అని వరమిచ్చి వెలిసాడు.
కొంతకాలానికి నరనారాయణులు దేహం వదలి నారాయణునిలో లీనమై పోయారు. వారి దేహాలు పర్వతాలుగా మారి బదరీనాథునికి ఇరువైపులా నర-నారాయణ గిరులుగా ప్రసిద్ధి చెందాయి. బదరీనాథుడు రెండు పర్వతాల మధ్య ఉన్నత ప్రదేశంలో ఉండి భక్తులకు దర్శన భాగ్యం ఇస్తున్నాడు.
🌹🌹🌹🌹🌹



Comments