సంక్రాంతికి ఈ 6 ఆలయాలు దర్శిస్తే విశేష ఫలితాలు / Visiting these 6 temples during Sankranthi yields blessings
- Prasad Bharadwaj
- 3 days ago
- 2 min read

🌹 సంక్రాంతికి ఈ 6 ఆలయాలు దర్శిస్తే విశేష ఫలితాలు 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Visiting these 6 temples during Sankranthi yields special blessings 🌹
Prasad Bharadwaj
సంక్రాంతి పండుగను సాధారణంగా పంటల పండుగగా మాత్రమే చూసినా, భక్తుల దృష్టిలో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన కాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ సమయంలో చేసిన పూజలు, దర్శనాలు విశేష ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి.
అందుకే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే పండుగ సందడితో పాటు దేవాలయాల వైపు భక్తుల ప్రవాహం కూడా ఉద్ధృతంగా కనిపిస్తుంది. ఈ పుణ్యదినాల్లో శివ-కేశవుల ఆరాధనతో పాటు సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదమని విశ్వసిస్తారు. సంక్రాంతి రోజుల్లో కొన్ని ప్రత్యేక ఆలయాలను దర్శిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా దర్శించాల్సిన ఆరు ప్రధాన ఆలయాలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి..
ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక పురాతన సూర్య దేవాలయం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు ఎంతో ప్రాముఖ్యత కలవిగా భావిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి, ఆర్థిక అభివృద్ధి కోరుకునే భక్తులు ఈ రోజున సూర్యుని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా సంక్రాంతి వేళ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. కొత్త ఆరంభాలకు సంకేతమైన ఈ పండుగ రోజున లక్ష్మీదేవితో కూడిన వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వ్యాపారులు, ఉద్యోగస్తులు ఈ రోజున స్వామివారి దర్శనాన్ని అత్యంత శుభంగా భావిస్తారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం కూడా సంక్రాంతి సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల పాపనాశనం, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులతో బాధపడేవారు శ్రీశైల దర్శనంతో ఉపశమనం పొందుతారని భావిస్తారు.
తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సంక్రాంతి రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నూతన ఆలయ నిర్మాణం తర్వాత ఈ క్షేత్ర వైభవం మరింత పెరిగింది. సంక్రాంతి నాడు నరసింహ స్వామిని శాంత రూపంలో దర్శించుకోవడం వల్ల భయాలు తొలగి ధైర్యం, మనోబలం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. గ్రహ దోష నివారణకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి.
విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన బసర జ్ఞాన సరస్వతి ఆలయం కూడా సంక్రాంతి సమయంలో భక్తులతో కళకళలాడుతుంది. గోదావరి తీరంలో కొలువైన సరస్వతీ దేవిని ఈ రోజున దర్శించుకుంటే విద్యలో ప్రగతి సాధిస్తారని నమ్మకం. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశీస్సులు పొందడానికి ఇది అనుకూల క్షేత్రంగా భావిస్తారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం సంక్రాంతి పర్వదినంలో మరో ముఖ్యమైన గమ్యస్థానం. రత్నగిరిపై వెలసిన సత్యదేవుడు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే కుటుంబ సుఖశాంతులు, శుభకార్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా వెళ్లే వారికి అన్నవరం విశేష అనుభూతిని అందిస్తుంది.
🌹🌹🌹🌹🌹



Comments