🌹 సిద్దేశ్వరయానం - 95 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 ఛిన్నమస్తా సాధన 🏵
గుంటూరులో మేము ఉన్న ఇంటికి దగ్గరలో 'శారదానికేతనం' అని ఒక విద్యాసంస్థ ఉన్నది. ఉన్నవ లక్ష్మీనారాయణగారనే స్వాతంత్ర్య సమరయోధుడు దానిని స్థాపించారు. అది దేవాదాయశాఖ ఆధీనంలో ఉండడం వల్ల దాని నిర్వహణా ధికారిగా ఓరుగంటి వెంకటకృష్ణయ్య గారనే ఒక ఉద్యోగి అక్కడకు వచ్చారు. ఆయన మంచి ధ్యాన సాధకుడు. ఎందరో మహానీయుల దగ్గర మెలిగినవాడు. కొంతకాలం కంచి పరమాచార్యుల వద్ద ఉన్నారు. మరికొంత కాలం అరుణాచలంలో రమణమహర్షి దగ్గర ఉండి ఆయన జీవితచరిత్రను మొదటిసారిగా తెలుగులో వ్రాశారు. మహా మంత్రవేత్త అయిన 'కావ్యకంఠ గణపతి ముని' దగ్గర కొన్నాళ్ళు శుశ్రూష చేశారు. బ్రహ్మచారి, ఉత్తమ సాధకులు అయిన ఆయనకు 'కృష్ణభిక్షు' అన్న లేఖినీ నామం ఉండేది. అతడు సంస్కృత ఆంధ్రములలో విద్వాంసుడు, కవి.
ఆధ్యాత్మిక సాహిత్య రంగాలు రెంటిలోనూ సారూప్యం ఉండడం వల్ల మా ఇద్దరి కలయిక తటస్థించింది. పూజ్యులు, కవితారంగంలో దేశికులు అయిన బ్రహ్మశ్రీ మిన్నికంటి గురునాధశర్మ గారి ఇంటిదగ్గర మొదటిసారి కలవడం ఆ తరువాత అనుబంధం పెరిగి ఇద్దరం కలిసి ధ్యానం చేయడం జరిగింది. కొన్ని నెలల పాటు ప్రతిరోజూ సాయంకాలాలు ధ్యానం చేసేవాళ్ళము. అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా ధ్యానానుభవాలు నాకూ కలుగుతూ ఉండేవి. మా ఇద్దరి మధ్య నలభైసంవత్సరాల వయస్సు తేడా ఉన్నా (నాకు 20 వారికి 60 సంవత్సరాలు) జన్మాంతర బంధం మా ఇద్దరి మధ్య ఆత్మీయతను పెంచింది. గతజన్మలలో సోదరులుగా, మిత్రులుగా ఉన్న విషయాలు స్మృతికి రావడం వల్ల సౌహార్దత పెంపొందింది. నన్ను గూర్చి తనకు ధ్యానంలో కన్పించిన ఎన్నో విశేషాలను ఆయన చెపుతూ ఉండేవారు.
గణపతి ముని గ్రంధాలలో ఎన్నింటినో కృష్ణభిక్షు వ్రాసుకొన్నారు. అవి అప్పటికి అచ్చుకాలేదు. ఇప్పటి జిరాక్స్ యంత్రాలు అప్పటికిరాలేదు. వాటి మీద ఆసక్తితో వాటన్నింటిని శ్రమించి నేను వ్రాసుకొన్నాను ఉమాసహస్రము, ఇంద్రాణీ సప్తశతి, ప్రచండ చండీత్రిశతి మరికొన్ని స్తోత్ర కదంబాలు వానిలో ముఖ్యమయినవి. గణపతి ముని యొక్క రచనా ప్రభావం సాధన ప్రభావం నామీద ఎంతో ఉన్నదని చెప్పక తప్పదు. ఆయన ఉపాసించిన ఛిన్నమస్త దేవతాసాధన నేను మొదలు పెట్టాను. అనేక సంవత్సరాలు ఆ మంత్రము యొక్క జప, హోమములు చేసి దేవత అనుగ్రహం పొందడం జరిగింది. ఉద్యోగ సంబంధమైన చిక్కులు వచ్చినపుడు ఈ వజ్రవైరోచనీ దేవత (ఛిన్నమస్త) క్షణక్షణము రక్షగా నిలచి కాపాడింది. ఒకనాడు ఒక అవధూత, వయోవృద్ధుడు హరిద్వారం నుంచి వచ్చాడు. కావ్యకంఠ గణపతి ముని శిష్యునిగా ఆయన పూర్వాశ్రమంలోనే తెలుసు.
సన్యాసదీక్ష తీసుకొని హరిద్వారంలో ఉంటున్న ఆ వృద్ధయోగికి ఒకరోజు రాత్రి పరమేశ్వరి 'ఛిన్నమస్త' గుంటూరుకు వెళ్ళి తన దర్శనం పొందిన నన్ను చూడమని ఆదేశించిందట. పనికట్టుకొని అంతదూరం నుండి కేవలం నన్ను చూడడటానికి మాట్లాడడానికి వచ్చిన ఆ తపస్వి కొద్దిసేపు తన అనుభవాలను నాతో పంచుకొని, వచ్చినవాడు వచ్చినట్లే వెళ్ళిపోయినాడు. వైరోచనీ దేవికరుణ మరొక సందర్భంలోనూ ఇటీవల వ్యక్తమయింది. మలేసియా నుండి వచ్చిన ఒక ధ్యానయోగి హైదరాబాదులో ఒకసారి నా ఫోటో తీసుకొన్నాడు. అందులో వైరోచనీ దేవి నామము చిహ్నాలు కన్పించినాయి. అవి ఏలా ఫోటోలో పడినవో అతనికి అర్థం కాలేదు. ఇటువంటి విశేషాలు చూచిన వారికి నూతనమైన ఉత్తేజాన్ని కల్గిస్తుంటవి.
ఏ దేవతను - వజ్రవారాహిగా హిరణ్యాక్షుడు భజించాడో, వజ్రశక్తిగా ఇంద్రుడు అర్చించాడో, వృషాకపి వేదమంత్రములతో ఆవాహన చేశాడో, బలిచక్రవర్తి తన సోదరిలో దర్శించాడో, ఏదేవి మంత్రమునకు భైరవుడు ఋషియో అట్టి ఛిన్నమస్తను, ప్రచండ చండికను, వైరోచనిని కొలిచెదను.
పురుషాయితక్రీడలో నున్న రతిమన్మధులపై నిల్చుండి, దిగంబరయై తన కంఠమును తానే ఖండించుకొని దాని నుండి యెగసే మూడు రక్తధారలలో మధ్య రక్త ధారను తాను, మిగిలిన రెండిటిని చెలికత్తెలైన వర్ణిని, డాకిని త్రాగుతుంటే భీషణరూపంతో ప్రకాశించే ఈ దేవత ఉపాసకులకు శత్రు విజయాన్ని సమస్త వాంఛితాలను అనుగ్రహిస్తుంది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments